Suryaa.co.in

Andhra Pradesh

కాంగ్రెస్ లోకి ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ, జనసేన నేతలు

విజయవాడ :ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవం సాధించాలంటే కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటూ ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన నేతలు పలువురు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు.

విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అధ్యక్షతన, నంద్యాల పార్లమెంట్ జిల్లా, డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో నంద్యాల జిల్లా, నందికొట్కూర్ మండలం జనసేన పార్టీకి చెందిన మనపాటి శ్రీనివాస్ గౌడ్, రాజులు, అదే జిల్లా కొల్లూరు మండలం అమ్మ పార్టీకి చెందిన మధు, బనగానపల్లె తాలుక అమ్మ పార్టీకి చెందిన స్వర్ణ సుప్రవీణ, ఆదం బాబు పార్టీ కండువా కప్పుకున్నారు.

అదే విధంగా నంద్యాల జిల్లా జుపాడు బంగ్లా మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వి.సురేంద్ర రెడ్డి, బి.రాములు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార వైసీపీ విధానాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీనే ఏకైక ప్రత్యామ్నాయమని, అందుకే తాము కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు వీరంతా స్పష్టం చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ సభ్యులు మేడా సురేష్, మీసాల రాజేశ్వరరావు, షేక్ ఖాజామెహిద్దీన్, డాక్టర్స్ సెల్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ రామచంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE