– కీలక తీర ప్రాంతంలో సరైన భద్రత లేదు
– దీని వెనక పెద్ద నెట్వర్క్
– తీర ప్రాంతంలో భద్రతను గాలికి వదిలేస్తే ఎలా?
– పోర్టు సీఈఓ కు, పోర్టు స్టేక్ హోల్డర్స్ కు నోటీసులు
– కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తా
– అలీషా అనే పేరు పదే పదే వినిపిస్తోంది
– అక్రమ రేషన్ బియ్యం తరలింపు వెనుక కింగ్ పిన్స్
– 16 కంపెనీలతో బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారు
– కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం రవాణా పై తనిఖీలు అనంతరం మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కాకినాడ: కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. రోజుకి ఇక్కడికి వెయ్యి నుంచి 1100 లారీలు ఇక్కడకు వస్తాయి. బియ్యం ఎగుమతులకు ఇది కీలకమైన పోర్టు. ఇంత కీలక పోర్టుకు కేవలం కేవలం 16 మంది సెక్యూరిటీ ఉండడం దారుణం. రోజుకు 1100 లారీలు వెళ్తే తనిఖీల కోసం 16 మంది ఉండడం ఏంటీ? ఇక్కడ జరిగే కార్యకలాపాలు ఎంత మేర అడ్డుకుంటున్నారో దీన్ని బట్టి అర్ధం అవుతుంది.
ఇటీవల భారీగా దొరికిన అక్రమ రవాణా బియ్యం, అలాగే పోర్టు లోని వాస్తవ పరిస్థితులు పరిశీలించాలని వచ్చాను. పోర్ట్ లో పరిశీలనకు బయలుదేరుతున్న సమయంలో నాకు చాలా మంది ఇక్కడికి రావద్దు అని సందేశాలు పెట్టారు. నేను వస్తే పదివేల మంది ఉపాధి దెబ్బ తింటుందని చెబుతున్నారు. కాకినాడ పోర్టు అనేది స్మగ్లింగ్ కోసం అనుమతి ఇచ్చింది కాదు.
ఇది ఎగుమతులకు నిలయం మాత్రమే అక్రమ ఎగుమతులకు కాదు. గత రెండు నెలలుగా కాకినాడ పోర్టుకు రావాలని చాలాసార్లు ప్రయత్నించాను. చాలామంది అధికారులు ఇక్కడకు రావద్దని మేము చూసుకుంటామని రకరకాలుగా చెప్పారు. మీరు వస్తే కొత్త సమస్యలు వస్తాయని చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితిని పరిశీలించడానికి స్వయంగా వచ్చాను.
ఇటీవల పట్టుబడిన రేషన్ బియ్యం ఉన్న షిప్ పరిశీలించాలని సముద్రంలోకి వెళ్ళాను. స్టెల్లా ఎల్ అనే షిప్ లో పట్టుబడిన 640 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని పరిశీలించడానికి వెళ్తే నన్ను షిప్పు ఎక్కనివ్వకుండా వేర్వేరు కారణాలు చెబుతూ అక్కడక్కడే తిప్పారు. ఒక ఉపముఖ్యమంత్రిగా నన్నే షిప్పు ఎక్కనివ్వకుండా బోట్లో తిప్పారు అంటే దీని వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అర్ధం అవుతుంది. ఒక ఉప ముఖ్యమంత్రి కి కూడా సహకరించని పెద్ద నెట్వర్క్ దీని వెనక ఉంది.
ఆ షిప్ లో బియ్యమే కాకుండా ఇంకా ఏమున్నాయో స్వయంగా చూసేందుకు వెళ్తే నన్ను షిప్ చుట్టూ తిప్పారు. అదేంటి అని అడిగితే నన్ను సముద్రం రఫ్ గా ఉందని, వెళ్ళడానికి లేదని చెప్పారు. చిన్న బోట్లు కట్టుకుని మిగిలిన వారు వెళ్తున్నా, నన్ను మాత్రం షిప్ ఎక్కకుండా చేశారు. అంటే దీనివెనుక పెద్ద వ్యక్తులు పెద్ద వ్యవస్థ ఉందని అర్థమవుతుంది.
కీలక తీర ప్రాంతంలో సరైన భద్రత లేదు. ఇక్కడ తీర ప్రాంత భద్రత కూడా చాలా ప్రధానం. కీలకమైన సంస్థలు ఉన్నచోట ఏమైనా తీర ప్రాంతంలో భద్రత లోపిస్తే చాలా ప్రమాదం. కేవలం బియ్యం అక్రమ రవాణా విషయం ఒక్కటే కాదు.. ఇక్కడ భద్రత కూడా చాలా ముఖ్యం. అక్రమంగా బియ్యం రవాణా అవుతుంటే, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పదార్థాలు, వ్యక్తులు రావడం పెద్ద కష్టం కాదు.
గతంలో జరిగిన యుద్ధ సమయంలో విశాఖకు శత్రుదేశాల జలాంతర్గములు వచ్చాయి. మరి ఇప్పుడు కాకినాడ లాంటి కీలకమైన తీర ప్రాంతంలో భద్రతను గాలికి వదిలేస్తే ఎలా? కాకినాడ తీర ప్రాంతంలోనూ కేంద్ర ప్రభుత్వ కీలక సంస్థలు ఉన్నాయి. ఇక్కడ భద్రత పూర్తిస్థాయిలో నేరస్థులకు సహకరించేలా తయారయింది.
కిలో రేషన్ బియ్యం ఇచ్చేందుకు రూ.43.50 పైసలు ఖర్చు అవుతుంటే ప్రజలకు ఆ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాల వల్ల ఇంటింటికి తీసుకొచ్చే బియ్యాన్ని అక్కడే లబ్ధిదారుల వద్ద కొని, వాటిని ఆఫ్రికా లాంటి దేశాలకు తరలిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుంది. ప్రభుత్వం భరిస్తున్న రాయితీ సొమ్ము బియ్యం మాఫియా జేబులోకి వెళ్తోంది. ఇవే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించి అక్కడ కేజీ రూ. 72, రూ. 74 లకు అమ్ముతున్నారు. ఆఫ్రికా దేశాలకు భారత దేశమే కేజీ బియ్యం రూ. 42 లకు ఇచ్చినా దేశం గౌరవం ఎంతో పెరుగుతుంది.
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా రవాణా అవుతున్న విషయం మీద పోర్టు సీఈఓ కు, పోర్టు స్టేక్ హోల్డర్స్ కు నోటీసులు ఇస్తాం. కాకినాడ పోర్టు బియ్యం అక్రమ రవాణా పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నేను ప్రత్యేకంగా లేఖ రాస్తాను. కీలకమైన సంస్థలు ఉన్న తీర ప్రాంతంలో బియ్యం అక్రమ రవాణా వల్ల తీర ప్రాంత భద్రతకు ముప్పు వాటిల్లుతోంది.
ఇక్కడ పోర్టులో భద్రత లేదు. కసబ్ లాంటి ఉగ్రవాదులు ముంబైకి ఇలాగే వచ్చారు. ముంబై పార్టీకి పేలుడు పదార్థాలు చేరాయి. ఎంతటి ఉగ్రవాద దాడులు జరిగాయి అన్నది చూసాము. కాకినాడ పోర్టు పరిస్థితిని అక్రమ రవాణాపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తాను.
25 వేల కేజీల మత్తు పదార్థాలు విశాఖ తీరంలో దొరికాయి. అలీషా అనే పేరు పదే పదే వినిపిస్తోంది. ఇదే తరహాలో నేర చర్యలకు అలవాటైపోతే రేపొద్దున్న దేశభద్రతకు కూడా ప్రమాదం. ఆర్ డి ఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు తేవడానికి, టెర్రరిస్టులు రావడానికి వాళ్ళు సహకరిస్తారు. నేరాలు అలవాటు పడినవారు ఎంతకైనా తెగిస్తారు.
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ప్రతిసారి పట్టుబడుతున్న వారిపై పీడీ యాక్ట్ పెడతాం. భూ ఆక్రమణలు చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఇటీవల తీర్మానించాం. దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపేలోపే ఇప్పుడు అక్రమ రేషన్ బియ్యం రవాణాలో పట్టుబడుతున్న వారిని పై కూడా పీడీ యాక్ట్ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తాం.
సంక్షేమ పథకాల అమలకు ప్రభుత్వం ఖజానాలో నిధులు లేక కింద మీద పడుతుంటే ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టి ఇలాంటి అక్రమార్కులు వేలకోట్లు దోచుకుంటున్నారు. రేషన్ బియ్యం తాలూకా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉంటే రోడ్లు వేయడానికి, సంక్షేమ పథకాలు అమలకు, పాలనకు ఇబ్బంది ఉండదు.
కాకినాడ పోర్టు నుంచి పారదర్శకంగా ఎగుమతులు జరగాలి. ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే ప్రతి సరుకు చట్టబద్ధంగా ఉండాలి. ప్రైవేట్ పోర్టు నుంచి ఇష్టానుసారం తరలిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కచ్చితంగా దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులు, వ్యవస్థలను ఆడిస్తున్న అసలు శక్తులు ప్రజలకు సమాధానం చెప్పే సమయం వస్తుంది.
అక్రమ రేషన్ బియ్యం తరలింపు వెనుక కింగ్ పిన్స్ ఉన్నాయి. సుమారు 16 కంపెనీలతో వారు రకరకాల మార్గాల్లో బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారు. బియ్యం పట్టుకున్నప్పటికీ వెంటనే కోర్టులను ఆశ్రయించి చేసిన తప్పుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ఆలోచిస్తాం. అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెడతాం.
ఒక వ్యక్తి లక్ష్యంగా ఈ అక్రమ రేషన్ బియ్యం మాఫియా గురించి ఆలోచించడం లేదు. రేషన్ బియ్యం విషయంలో ప్రభుత్వ ఖజానా నుంచి వేలాది కోట్లు దర్జాగా కొల్లగొడుతున్నారు. ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బును అక్రమంగా జేబులో వేసుకుంటున్నారు. ఈ మొత్తం అక్రమ రేషన్ బియ్యం మాఫియాను నాశనం చేయాలి అన్నదే మా విధానం.
స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంలో కూడా మార్పు రావాలి. ఏదైనా చర్య తీసుకుంటున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు మోకాలడ్డుతున్నారు. అధికార యంత్రాంగంలోనూ ప్రక్షాళన జరగాలి. ఓ ప్రత్యేక మాఫియా దీన్ని మొత్తం నడిపిస్తోంది. వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజాధనాన్ని ఈ మాఫియా కొల్లగొడుతుంది .
ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐతో విచారణ చేయించాలా లేక సిఐడి తో విచారణ చేయించాల అన్నది క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయం కచ్చితంగా దేశభద్రత మీద కూడా ఆధారపడి ఉంది.