Home » ఉద్యోగం వీడి..కాషాయం కట్టి..

ఉద్యోగం వీడి..కాషాయం కట్టి..

పేదలకు న్యాయ సహాయం..
అవినీతిపై ధర్మపోరాటం
 విలక్షణ వ్యక్తిత్వం జయచంద్రరాజు సొంతం

20 నిమిషాల్లో 5 కి.మీ. పరుగు.. ఏ మాత్రం తటపటాయించకుండా లక్ష్యం సాధించడానికి యువత పరుగుతీయటం సర్వసాధారణంగా సాగుతోంది. తుదకు తమ శరీరంపై ఖాకీ దుస్తులను చూసుకోవాలన్న తపనతో కానిస్టేబుల్‌ ఎంపికలో యువతపడే తాపత్రయం అలాంటిది. కానీ ఒక సీఐ స్థాయికి చేరుకున్న వ్యక్తి అవినీతి నేతల వ్యవహారశైలికి తాళలేక.. తన వృత్తికి పూర్తి స్థాయిలో నిజాయతీగా న్యాయం చేయలేకపోతున్నానని.. ఆవేదనతో ఉద్యోగాన్ని వీడటం ఊహించగలమా.. ఈ విషయాన్ని అవలీలగా చేసి ఖాకీ దుస్తులను విడనాడి కాషాయాన్ని ధరించి దేవుడి సేవతో పాటు పేదలకు చేయూతను ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు రాజులకండ్రిగకు చెందిన జయచంద్రరాజు.

నాగలాపురం మండలం రాజులకండ్రిగకు చెందిన రైతు కుటుంబంలో జన్మించిన జయచంద్రరాజుకు చిన్ననాటి నుంచి పోలీసు వృత్తిపై మక్కువ ఎక్కువ.  తన లక్ష్యాన్ని 1991లో సాధించి కర్నూలు జిల్లా పాణ్యం మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఆపై ఉయ్యాలవాడ, కర్నూలులో పనిచేసిన ఆయన 2004లో సీఐగా పదోన్నతి సాధించి ఇంటెలిజెన్స్‌, రైల్వే, ఏసీబీ విభాగాల్లో పనిచేశారు. ఎక్కడ పనిచేసినా తన విధి నిర్వహణకు అడ్డు తగులుతున్న కొందరు నేతలు, ఉన్నతాధికారుల వత్తిడిని సహించలేకపోయారు.

ఈ మానసిక సంఘర్షణతో రాజీపడలేక 2010లో  సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు.  తనకు తొలి నుంచి మార్గదర్శిగా ఉన భగవద్గీతనే నమ్ముకుంటూ స్వగ్రామంలో తన పొలంలోనే శ్రీకృష్ణ సేవాశ్రమాన్ని నిర్మించుకున్నారు. నిత్యపూజలు, భజనలతో ఉద్యోగిగా తాను భరించిన బాధను మరిచి గ్రామంలో శ్రీకృష్ణభజన మందిర నిర్మాణానికి సంకల్పించారు. తన పొలంలో కొంతభాగాన్ని విక్రయించి రూ.10 లక్షల మూలధనంతో నిర్మాణం ప్రారంభించి గ్రామంలోని ఇంజినీరు విద్యార్థులు, గ్రామస్థుల విరాళాలతో  రూ.70 లక్షల వ్యయంతో శ్రీకృష్ణమందిరాన్ని నిర్మించారు.

గ్రామంలో తరచూ తలెత్తే విభేదాలు, గొడవలకు మూలంగా నిలుస్తున్న మద్యపానం, మాంసాహారాలను 2011లో గ్రామస్థులు ఎవరూ స్వీకరించరాదంటూ తీర్మానించి ఆదర్శంగా రాజులకండ్రిగను రూపొందించారు. గ్రామంలోని 90 శాతం మంది యువకులు, పెద్దలు వీటిని విడనాడి సంసారాలను సవ్యదిశలో సాగిస్తున్నారు.

నాగలాపురంతో పాటు సమీప మండలాల్లోని పలువురు పేదలు, బాధితుల పక్షాన ఆయన నిలిచారు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ధర్మరక్షణ సమితిని స్థాపించారు. ఈ సమితి అధ్వర్యంలో నిరాహార, నిరసన దీక్షలు, పాదయాత్రలతో అవినీతి, ధర్మరక్షణపై పోరాటం చేస్తున్నారు. నాగలాపురంలో జోరుగా సాగే ఇసుక, సారా అక్రమ రవాణాలు, రెవెన్యూ అవినీతి బాగోతలకు వ్యతిరేకంగా పోరాడి తన శక్తిమేర వాటిని కట్టడిచేశారు.

తాను విశ్రాంత సీఐగా ఉన్నా పలు కేసులను ఎదుర్కొని న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు న్యాయవాదులు బాధితులపై చూపించే వేధింపులను చూసి పేదలకు న్యాయ సహాయం సైతం ఉచితంగా చేయాలని నిర్ణయించుకుని న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. తాను స్థాపించిన ‘కన్సలేషన్‌ ఫోరం’తో మధ్యవర్తిత్వాన్ని ఉచితంగా చేసి సమస్యకు పరిష్కరాన్ని అందిస్తున్నారు.

గతంలో 900 కి.మీటర్ల మేర దూరంలోని బాసరకు పాదయాత్ర చేసిన ఆయన ప్రస్తుతం ధర్మరక్షణ జరగాలంటూ భగవంతుని ప్రార్థిస్తూ రాజులకండ్రిగ నుంచి ఇచ్ఛాపురం వరకు 1000 కి.మీ.ల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అర లక్ష వేతనంతో పాటు ధనాన్ని ఇబ్బడిముబ్బడిగా సంపాదించే అవకాశాలను విడనాడి కుటుంబ జీవనభృతికి తనకు మిగిలిన ఒకటిన్నర ఎకరా పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న జయచంద్రరాజు వ్యక్తిత్వం విలక్షణం.

న్యాయం వీలుకాకుంటే తప్పుకోవడమే ధర్మం..
నాకు చిన్ననాటి నుంచి పోలీసులన్నా, ఆధ్యాత్మికత మార్గమన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రెండింటిని ఒకేసారి సాధించి పోలీసుగా బాధ్యతలు చేస్తున్నప్పుడు నిందితులకు ప్రవచనాలు వినిపించేవాణ్ణి. సీఐగా ఉన్న సందర్భాల్లో నా చేతిలో బాధితులకు పూర్తిన్యాయం చేసే అవకాశమున్నా కొన్నిసార్లు అది చేయలేకపోతుండటంతో మథనపడ్డాను. నీ చేతిలో పూర్తి న్యాయం వీలుకాకుంటే తప్పుకోవడమే ఉత్తమమని ధర్మం సూచిస్తుండటంతో సీఐ బాధ్యతల నుంచి రాజీనామాతో తప్పుకున్నా. మానవుల వ్యక్తిత్వ, విలువల వికాసానికి సమున్నతమైన భగవద్గీతనే నమ్ముకుని శ్రీకృష్ణుని సేవలో తరిస్తున్నా. నా శక్తి మేర బాధితులకు న్యాయ సహాయం చేస్తూ అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా. ప్రతి ఒక్కరూ గీతాసారానికి కట్టుబడి ధర్మమార్గంలో పయనించి విలువతో కూడిన జీవనం సాగిస్తేనే సనాతన భారతీయ సంప్రదాయం కళకళలాడి మానవసంబంధాలు ధృడపడుతాయి.

– జయచంద్రరాజు, విశ్రాంత సీఐ, రాజులకండ్రిగ

Leave a Reply