Suryaa.co.in

Featured

భారీ మెజార్టీ కోసం వైసీపీ..పరువు కోసం ప్రతిపక్షాలు..!!

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని సాక్షిగా ఉప ఎన్నిక యుద్దం జరుగుతోంది. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమకు భారీ మెజార్టీ తీసుకు వస్తాయని వైసీపీ అభ్యర్ది గురు మూర్తి చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార శైలి చూస్తుంటే ప్రతిపక్షాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏం చెప్పి ఓట్లు అడగాలో కూడా ప్రతిపక్షాలకు తెలియడం లేదు. పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నుంచి టీడీపీ ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు.

ఎప్పటిలాగానే టీడీపీ అబద్దాలనే నమ్ముకుని ప్రచారం చేస్తుంది. టీడీపీ అభ్యర్ది పనబాక లక్ష్మీని గెలిపిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని నారా లోకేష్‌ ప్రచారం చెబుతున్నారు. నారా లోకేష్‌ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో తమకు మంచి కామెడీ అర్టిస్ట్ దొరికాడని తిరుపతి లోక్ సభ ప్రజలు చెప్పుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలో లోపలు ఉంటే వాటిని పట్టుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతేకాని.. పనబాక లక్ష్మీకి ఓటేస్తే రాష్ట్రానికి ఏమాత్రం సంబంధంలేని పెట్రోల్ , డీజిల్ ధరలు ఎలా తగ్గుతాయో నారా లోకేష్‌ సెలవివ్వాలి. ప్రజలు ఇంకా 1990ల్లోనే ఉన్నారని లోకేష్‌ అనుకోవడం దురదృష్టకరం. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన 1995 నాటి కంటే ప్రజలు చాలా చైతన్యమంతులయ్యారు . ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకునే తెలివితేటలు ప్రజలకు వచ్చాయి. చంద్రబాబు రెచ్చగొట్టగానే, లోకేష్‌ చెప్పగానే ఓట్లు వేసే రోజులు పోయాయి. మీడియా ఏం చెప్పినా వాస్తవాలు తెలుసుకుని ప్రజలు ఓట్లు వేస్తున్న కాలమిది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. క్షణాల్లోనే ఏది కరక్ట్, ఏది రాంగ్ తెలుసుకునే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉంది. డిజిటల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తున్న రోజులివి. ఎవరితోనో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మీద బురద చల్లించి,తరువాత ఎల్లో మీడియాలో బ్రేకింగ్‌లు వేసి, మళ్లీ దానినే టీడీపీ నేతలు, చంద్రబాబు, లోకేష్‌లు అందిపుచ్చుకుని ప్రజల బుర్రల్లోకి పంపాలని చూసినా కుదరని కాలమిది. పత్రికలు చదివి, టీవీలు చూసి ఓట్లు వేసే రోజులు పోయాయి. తమ గురించి ఏ నాయకుడు ఆలోచస్తున్నాడు, తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఏ నాయకుడు చూపిస్తున్నాడో బేరీజు వేసుకుని ఓట్లు వేసే కాలమిది. ఈ వాస్తవాన్ని చంద్రబాబు,లోకేష్‌, వారి పార్టనర్‌ పవన్ కల్యాణ్‌ ఇంకా గమనించకపోవడం గమనార్హం.

2019లో తిరుపతి లోక్‌ సభ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు బల్లి దుర్గా ప్రసాద రావు. బల్లి దుర్గా ప్రసాద రావుకు 7లక్షల 22 వేల 877 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో 53 శాతం దుర్గా ప్రసాద రావుకు వచ్చాయి. 2019లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మే పోటీ చేశారు. ఈమెకు 4లక్షల 94వేల 501 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో 37.65 శాతం పనబాక లక్ష్మికి వచ్చాయి. ఇక..బీజేపీ నుంచి బొమ్మి శ్రీహరి రావు పోటీ చేశారు. 16వేల 125 ఓట్లు మాత్రమే వచ్చాయి . పోలైన ఓట్లలో శ్రీహరి రావు కు వచ్చింది 1.25 శాతం మాత్రమే. 2019లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గా ప్రసాద రావు 2లక్షల 28వేల 376 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 16, 2020న ఎంపీ దుర్గా ప్రసాద రావు మరణించారు. దీంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీపై కన్నేసింది. 4లక్షలకు పైగా మెజార్టీ సాధించాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు కంకణం కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ – జనసేనలు ఉమ్మడి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభను నిలబెట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన మెజార్టీ చూసుకుంటే బీజేపీకి తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో పెద్దగా బలం లేదని చెప్పొచ్చు. జనసేన ఓటు బ్యాంక్‌ కూడా పెద్దగా ఏం లేదు. పవన్ కల్యాణ్‌ ప్రచారం బీజేపీకి ఓట్లు తెచ్చే అవకాశం లేదు. పవన్‌ కల్యాణ్‌కు నిలకడలేని రాజకీయ నాయకుడిగా పేరుంది. రాజకీయ అవకాశవాదిగా అనతి కాలంలోనే పవన్ కల్యాణ్ పేరు తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్‌ అని సామాన్య ప్రజలే మాట్లాడుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌ బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ చంద్రబాబు ఆజ్ఞల మేరకే పని చేస్తు న్నారని విమర్శలున్నాయి. ఈ విమర్శలను ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కల్యాణ్ తన విశ్వసనీయతను కోల్పోయారు. జనసేన ఏదో ఒక పార్టీతో పెవికాల్ బంధం పెట్టుకుంటుందని, పవన్ కల్యాణ్‌కు సింగిల్‌గా పోటీ చేసే ఆలోచనే ఉండదని గతంలోనే జనసేన నుంచి బయటకు వచ్చిన కొంత మంది నేతలు ఆరోపించారు. టీడీపీ గతంలో కంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. లోకేష్‌ తిరుపతిలో మకాం వేసినా, చంద్రబాబు పనిగట్టుకుని ప్రచారం చేసినా టీడీపీకి డిపాజిట్ వస్తే చాలు అనుకునే పరిస్థితి ఉంది.

తిరుపతి లోక్‌సభ స్థానం ఎస్సీ కేటగిరిలో ఉంది. తిరుపతి లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
4 అసెంబ్లీ నియోజకవర్గాలు నెల్లూరు జిల్లా పరిధిలో ఉంటే, 3 చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరు పేట, వెంకటగిరి నియోజకవర్గాలున్నాయి. వీటిలో గూడూరు, సూళ్లూరు పేట ఎ స్సీ రిజర్వడ్‌ నియోజక వర్గాలు, ఇక చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తీ, సత్యవేడు ఉన్నాయి. వీటిలో సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ నియోజకవర్గాలు.

వైసీపీ తిరుపతి లోక్‌సభ స్థానంలో పోటీ చేసినప్పటి నుంచి గెలుస్తూనే ఉంది. 2014లో వర ప్రసాద రావు 37వేల 425 ఓట్లతో గెలిచారు. బీజేపీ – టీడీపీ ఉమ్మడి అభ్యర్ధిగా కారుమంచి జయరామ్ పోటీ చేసి ఓడి పోయారు. తిరుపతి లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ కంచుకోట. వైఎస్‌ఆర్‌ అకాల మరణం, ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు, వైఎస్‌ఆర్‌ సీపీ ఆవిర్భవించడంతో ఫ్యాన్‌కు ఫ్యాన్‌ అయ్యారు తిరుపతి లోక్‌సభ ప్రజలు. 1999లో మినహాయిస్తే 1989 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌ తిరుపతిలో గెలుస్తూ వచ్చింది. 1999లో బీజేపీ -టీడీపీ అలయన్స్‌లో భాగంగా కమలం గుర్తు నుంచి పోటీ చేసిన డాక్టర్ నందిపాక వెంకటస్వామి 12వేల 497 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తరువాత తిరుపతి ప్రజలు మహానేత తనయుడుతోనే నడవడం ప్రారంభించారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ సహజంగానే వైఎస్‌ఆర్‌ సీపీకి షిఫ్ట్ అయింది.
వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి 23 నెలల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఓటు బ్యాంక్‌కు భారీ గండిపడినట్లు పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల గణాంకాలు తెలియజేస్తున్నాయి. 23నెలల వైఎస్‌ జగన్‌ పాలనలో టీడీపీకి బీసీలు దూరమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో కూడా బీసీలు టీడీపీ మీద అభిమానంతో చంద్రబాబు వెంటే ఉన్నారు. వైఎస్‌ఆర్‌ బీసీల్లో చీలిక తెచ్చారు కానీ..టీడీపీని ఇబ్బంది పెట్టే విధంగా చీల్చలేక పోయారు. కానీ..వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం 23 నెలల కాలంలో 53 బీసీల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బీసీలకు సంక్షేమ పథకాలు అందించడంతోపాటు రాజకీయంగా వారి ఎదుగుదలకు సాయపడ్డారు. అందుకే..పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా అభ్యర్ధిని బట్టి కాకుండా సీఎం జగన్‌ను చూసి ఓటేశారు. 82 శాతం పంచాయతీలు వైసీపీ సానుభూతిపరులకు కట్టబెట్టారు. తాడిపత్రి మినహా మునిసిపాలిటీలు అన్నింటినీ వైసీపీ కైవసం చేసుకుంది. 11 కార్పొరేషన్‌లలో వైసీపీ జెండా ఎగిరింది. చంద్రబాబు పనిగట్టుకుని ప్రచారం చేసి, ప్రజలను రెచ్చగొట్టినా విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో వైఎస్‌ఆర్‌ సీపీనే ప్రజలు గెలిపించారు. దీంతో అధికార వికేంద్రీకరణకు తమ ఓటుతో ప్రజలు ఆమోద ముద్రవేశారు.

1995లో ఎన్టీఆర్‌ నుంచి కుర్చీలాక్కుని చంద్రబాబు సీఎం అయ్యారు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో బీజేపీ – జనసేనలతో పొత్తు పెట్టుకుని సీఎం అయ్యారు. 2019లో మాత్రం ఒంటరిగా పోటీ చేసి చిత్తుగా చంద్రబాబు ఓడిపోయారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి పవన్ కల్యాణ్‌ను విడిగా పోటీ చేయించినా ఫలితం లేకుండా పోయింది. పవన్‌ కల్యాణ్‌ కమ్యూనిస్టులు, బీఎస్పీతో కట్టిన కూటమి చంద్రబాబు సూచనల మేరకే ఏర్పడిందని ప్రజలు గ్రహించి టీడీపీకి బుద్ది చెప్పి వకిల్‌ సాబ్‌ను భీమవరం, గాజువాకల్లో ఘోరంగా ఓడించారు. చంద్రబాబు ఏనాడు తాను పథకాలు చెప్పుకుని ఎన్నికల్లో నిలబడలేదు.
కులం, మతం, ప్రాంతాలను రెచ్చగొట్టి తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటారు.
ఇప్పుడు తిరుపతిలో చంద్రబాబు చేయబోతుంది అదే..పవన్ కల్యాణ్ మాట్లాడింది ఇదే..ఎల్లో మీడియా డిబేట్లు పెడుతుంది కూడా ఇదే లైన్‌.

తిరుపతి లోక్‌సభ పరిధిలో ఉన్న బలిజల ఓట్ల కోసం అప్పుడే చంద్రబాబు విభజన రాజకీయాలు చేపట్టారు. ఎల్లో మీడియాలో అదే పనిగా డిబేట్లు పెట్టిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి తిరుపతి ప్రచారానికి బయల్దేరుతున్నారు అనగానే ఎల్లో గ్యాంగ్‌లో వణుకు మొదలైంది. భారీ మెజార్టీ రాదేమోనని జగన్‌ వెళ్తున్నాడంటూ ఏబీఎన్‌లో వెంకట కృష్ణ రాగాలు తీయడం మొదలు పెట్టాడు. కాలర్ నలగకుండా, ఒక్క ప్రకటన కూడా చేయకుండా స్థానిక ఎన్నికల్లో జగన్‌ కనబడకుండా చేశారు. మునిసిపాలిటీ ఎన్నికలు సందర్భంగా రెండు సభలు పెడదామని కేబినెట్ మంత్రులు అడిగినా కూడా నా ప్రజలపై నమ్మకం ఉందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సున్నితంగా తిరుస్కరించారు. ఈ మాటు ప్రెస్‌ మీట్‌లు స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
ఇప్పుడు ఏకంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుపతిలో అడుగు పెడుతుండటంతో డిపాజిట్లు కూడా రావని టీడీపీ నేతలు వణికిపోతున్నారు. ఇదే భయం వెంకట కృష్ణ డిబేట్‌లో కనిపించింది. ఫ్యాషన్ చూసి ఓట్లు వేసే రోజులు పోయాయి..పథకాలు చూసి ఓట్లు వేసే రోజులు ఇవి అని టీడీపీ గుర్తు పెట్టుకోవాలి.

“చంద్రబాబును టచ్‌ చేస్తే జగన్‌ బతుకుతాడా” తిరుపతి ప్రచారంలో నారా లోకేష్ చేసిన కామెంట్ ఇది. ఓ రాష్ట్ర సీఎంను పట్టుకుని ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇవి. రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతకైనా చంద్రబాబు అండ్ కో తెగిస్తారు. లోకేష్ మాటల్లో అంతరార్ధం ఏంటీ..?. “జగన్‌ బతుకుతాడా” అన్న లోకేష్ కా మెంట్ సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే..గతంలో విశాఖలో కూడా వైఎస్‌ జగన్‌ మీద దాడి జరిగింది. ఇంటిలెజెన్స్‌, పోలీస్‌ అధికారులు చంద్రబాబు కుట్రలపై కన్నేసి ఉంచాలి.

14న తిరుపతిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అడుగుపెడుతున్నారు. ఆయన మైక్ పట్టుకుని చేయితో కొట్టే సౌండ్‌కే ప్రతిపక్షాలు పత్తాలేకుండా పోతాయి. ఈ వాస్తవం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు తెలుసు కాబట్టే కులాన్ని రెచ్చగొడుతున్నారు. కానీ..ఆ కులమే కత్తై చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చీల్చిచెండాడే సమయం ఆసన్నమైంది. అమరావతి భూకుంభకోణం నుంచి బయట పడటానికి టీడీపీని చంపడానికి కూడా సిద్ధమైన చంద్రబాబును తిరుపతి లోక్‌సభ ప్రజలు క్షమిస్తారని నేను అనుకోను. తిరుపతి లోక్‌సభ ఓటర్లు ఫ్యాన్‌పై వేసే ఒక్కో ఓటు చంద్రబాబు రాజకీయ పతనానికి నాంది కాబోతుంది. అది ఆయన సొంత జిల్లా నుంచే కావడం చంద్రబాబు దురదృష్టం.

వై.వి. రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్

LEAVE A RESPONSE