– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సవిత
అమరావతి : మొంథా తుపాను నుంచి బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుందామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. తుపాను తీవ్రంగా ఉండే ప్రాంతాల్లోని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టంచేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలతతో మంత్రి సవిత మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
బీసీ హాస్టళ్ల విద్యార్థుల రక్షణకు తీసుకున్న చర్యల గురించి జిల్లాల వారీగా మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు. పలువురు డీబీసీడబ్ల్యూవోలతోనూ మంత్రి స్వయంగా ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత సవిత మాట్లాడుతూ, వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు, ప్రిన్సిపాళ్లు 24 గంటలూ హాస్టళ్లలో ఉండడడంతో పాటు రాత్రి సమయంలో విద్యార్థులతో కలిసి నిద్రపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్ల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే అందివ్వాలన్నారు. బయట ఆహారాలను హాస్టళ్లలోకి అనుమతించొద్దన్నారు. తుపాను నేపథ్యంలో విద్యుత్ కోతలు ఉండే అవకాశముందని, ఇన్వర్టర్లను పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. టార్చిలైట్లు, క్యాండిల్స్, అగ్గి పెట్టెలను పెద్ద మొత్తంలో ముందు జాగ్రత్తగా సమకూర్చుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ల ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్యులతో వైద్య సేవలందించాలన్నారు.
హాస్టళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేయాలని స్పష్టంచేశారు. మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను శుభ్రం చేయాలన్నారు. దోమలు చొరబకుండా హాస్టళ్ల గదుల కిటికీల వద్ద మెస్ లు ఏర్పాటు చేయాలన్నారు. తుపాను దృష్ట్యా హాస్టళ్లను, ఎంజేపీ స్కూళ్లను నిరంతరం పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు వాటి స్థితిగతులు, విద్యార్థుల ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణను, ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలతను మంత్రి సవిత ఆదేశించారు. హాస్టళ్ల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో పలువురు బీసీ సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు. .