మన సీమ గురించి ఇకనైనా ఆలోచిద్దాం
జవసత్వాలు కోల్పోతున్న మనుషులు
అనుభవించే హక్కులు తెలుసుకొని
సీమ భవిష్యత్తును గూర్చి చర్చిద్దాం..
రాయలసీమ రాళ్ళసీమగా మారే
జీవిస్తున్నం రాళ్ళలాగా ఉన్నాం
స్పందన లేకుండా జీవచ్ఛవంలా ఉంటూ
సీమ భవిష్యత్తును కాల రాస్తున్నాం…
ఎన్నాళ్లు మౌనంగా ఉంటాం
మన మనుగడే ప్రమాదంగా ఉంటే
బ్రతుకులు చిందరవందరం అవుతూ
నేల విడిచి వలసలు వెళుతుంటే..
ఏ ఎండకు వానకు ఆ గొడుగు పడుతూ
రాజకీయాల గొడుగులో ఉంటూ
చీకట్లోనే తిరుగుతున్నాం
ఆ నీడలు సీమను ఎడారిగా మారుస్తున్నాయి..
చిమ్మ చీకట్లోనే సీమ బ్రతుకులు
ఈ వాస్తవాన్ని గ్రహించండి
సత్యాన్ని గ్రహించకపోతే అంధకారమే
మనభూమి ఎడారిగా మారిపోతుంది..
రాతి బతుకులు ఇంకెన్నాళ్లు
బండ రాళ్లలా మౌనంగా ఉంటాం
ఉద్యమాలకు ఊపిరి పోయకుంటే
భవితకు బ్రతుకులు భారమవుతాయి..
నీ నీటి హక్కు ప్రశ్నించు
నీ స్థాయిలో నీవు ప్రయత్నించు
మొదలు పెట్టకపోతే ఎట్లా
మనం భవిష్యత్తుకు ద్రోహం చేసినట్లే..
నాకెందుకులే అనుకుంటే పొరపాటే
సీమ జీవనం గ్రహ పాటే
సీమ మట్టి పొరలు తడపకుంటే
ఆకలి కేకల అనర్థాలు జరుగుతాయి..
– కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235