– యువత ఉపాధి కల్పన కోసం లోకేష్ భగీరథ యత్నం
ఎక్కడ సమస్యలుంటే అక్కడే ఆయన ‘లోకేష’న్. చిన్న వయసులోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్న ఆయన.. అటు మంత్రిగా కూడా నిమిషం తీరికలేకుండా పనిచేస్తున్నారు. ఈ విషయంలో ఆయన తండ్రికి జిరాక్సు! ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రచ్చబండ పేదలకు వేదికగా మారింది. అటు శాఖాపరంగా విద్య, ఐటి రంగాలపై తనదైన ముద్ర వేస్తున్న యువనేత.. ఇప్పుడు జగన్ జమానా పుణ్యాన కుప్పకూలిన వ్యవస్థలను నిలబెట్టేందుకు భగీరధ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఉపాథి, ఉద్యోగ అవకాశాల కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రపంచయాత్రకు బయలుదేరారు. సొంత గడ్డ బిడ్డలు ఉద్యోగ-ఉపాథి కోసం, పక్క రాష్ట్రాలకు పరుగులు పెట్టకుండా వారిని నిలువరించి.. పుట్టిన గడ్డపైనే ఉపాథి-ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఆ విక్రమార్కుడి ప్రస్తుత లక్ష్యం. ఆ పట్టువదలని విక్రమార్కుడే మంత్రి నారా లోకేష్.
రాష్ట్రంలో గత అయిదేళ్ల దమన పాలకుల పాలనలో సానుకూల పెట్టుబడి వాతావరణం ధ్వసం అయింది.మళ్ళీ పారిశ్రామిక రంగాన్ని జేగీయ మానంగా వెలిగించడానికి విద్య,ఐటీ శాఖల మంత్రి గా నారా లోకేష్ భగీరథ యత్నం చేస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధితోనే పసిడి కాంతులని గుర్తించి.. పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసి, ఆ రంగంలో వృద్ధి రేటు భారీగా పెంచి నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ఐటీ లోకేష్ భగీరథ యత్నమే చేస్తున్నారు.
రాష్ట్రంలో పెట్టు బడుల సాధనే లక్ష్యంగా ఇటీవల అమెరికాలోని వివిధ నగరాల్లో పర్యటించి.. వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలయి రాష్ట్రానికి వీలైనన్ని పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో విస్తృతంగా పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు వున్న అపార అవకాశాలు వివరించి భారీ పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికీకరణను కొత్త పుంతలు తొక్కించాలని, ప్రోత్సాహకాలు ప్రకటించి మెప్పించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక,వ్యాపార దిగ్గజాలు రాష్ట్రానికి రావడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
మాటల మనిషిని కాదని, చేతల మనిషినని నిరూపించుకుంటున్నారు లోకేష్. విదేశీ, స్వదేశీ పెట్టుబడులను పెద్దయెత్తున ఆకర్షించి పారిశ్రామికాభివృద్ధి సాధించి.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అయిదేళ్ల లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి యువత కు బంగారు బాటలు వేయాలని, కాలికి బలపం కట్టుకొని విదేశాలలో పర్యటిస్తూ, పెట్టుబడులపై వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలవుతున్నారు.
అందులో భాగంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీ పరిశ్రమకు అనంతపురం జిల్లా అనుకూలమైన ప్రదేశం పెట్టుబడులు పెట్టండి అంటూ టెస్లా కంపెనీని కోరారు. స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించాలని, అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని చెప్పగా, టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా పర్యటన కొనసాగింది. మైక్రో సాప్ట్ సిఈవో సత్య నాదెండ్లను అమెరికాలో కలిశారు ఆయన. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ కు, సాంకేతిక సహకారం అందించాలని,అమరావతి ని ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, ఏపీని సందర్శించాలని సత్య నాదెళ్లను మంత్రి లోకేష్ ఆహ్వానించారు.
సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటీ హబ్బులు, ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నామని, ప్రపంచ స్థాయి సంస్థలకు ఏపీ ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలున్నాయని, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఏపీకి ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, పెట్టుబడి అనుకూల విధానాలు, భూమి, నీరు సమృద్ధిగా ఉందని, క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి వెళ్లాలని,సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని.అగ్రిటెక్ ఏఐ అనుసంధానంతో రాష్ట్ర సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ఉత్పాదకతను పెంచే సాగు విధానాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి లోకేష్.
అమెరికా పర్యటన లో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని ఇండియాస్పోరా యుఎస్ ఇండియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం, గూగుల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి, సంస్థ సిఈవో, వైస్ ప్రెసిడెంట్ల ను కలిసి విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని వారికి విజ్ఞప్తి చేయడం, యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని, ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లలను కలిసి ఆంధ్రప్రదేశ్ స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని, ఏపీలో ఎఐ వర్సిటీ, డాటా సెంటర్లు రాబోతున్నాయని.పెట్టుబడులకు ఇదే సరైన సమయమని లోకేష్ వారికి వివరించారు. లాస్‌వేగాస్‌లోని ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాతో విడివిడిగా సమావేశమయ్యి టెక్నాలజీ, తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని కోరారు.
విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధితో యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్న ,ఏపీలో సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను ప్రత్యక్షంగా చూడటానికి ఒకసారి రాష్ట్రాన్ని సందర్శించాలని కోరగా, ఇంద్రానూయి సానుకూలంగా స్పందించి ఏపీలో పెట్టుబడులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ సీఆర్‌ఎంను మెరుగుపరచడానికి సేల్స్‌ఫోర్స్ ఐన్‌స్టీన్ అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఏపీలో పరిచయం చేయాలని సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాను కోరారు. స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై దృష్టి సారించామని, ఏపీలో ఏఐ స్కిలింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకరిచాలని కోరారు.
సేల్స్‌ఫోర్స్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్, టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్ట్‌పలకు ఏఐ టూల్స్, మెంటార్‌షి్‌పను అందించాలని లోకేష్ కోరగా.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో మాట్లాడతానని క్లారా తెలిపినట్లు సమాచారం.
విశాఖను ఐటీ డెస్టి నేషన్‌గా మారుస్తానని హామీ ఇచ్చి, తన మాటను మొదటి నాలుగు నెలల్లోనే నిలబెట్టుకున్నారు లోకేశ్. ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌ను విశాఖకు వచ్చేందుకు కృషి చేశారు. విశాఖ లో టీసీఎస్ ని ఏర్పాటు చెయ్యడం ద్వారా పది వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలుస్తుంది. టీసీఎస్ విశాఖ కు రావడంతో మరికొన్ని పెద్ద ఐటీ కంపెనీలు అక్కడకు వచ్చే అవకాశం ఉంది.
ఇక చిన్న కంపెనీల విషయం చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక ప్రోత్సాహానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తుండగా, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పెట్టుబడులు బారులు తీరే అవకాశం వుంది. పెట్టుబడుల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దే క్రమంలో టీసీఎస్ విశాఖకు రావడం ముఖ్యమైన మైలురాయిగా చెప్పాలి.
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ క్రమంగా గమ్యస్థానంగా మారుతోందని చెప్పడానికి ఇప్పటికే లులూ, ఒబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్ వంటి సంస్థలు ముందుకు రాగా మరికొన్ని సంస్థలు రాష్ట్రానికి రావడానికి సిద్ధపడుతున్నాయి. టీసీఎస్ విశాఖలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంసిద్ధం కావడంతో విశాఖ ఐటీ హబ్‌గా మారనున్నదని చెప్పవచ్చు.దీంతో ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైవంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు.
రాష్ట్రంలో తమ సేవలను భారీగా విస్తరించేందుకు హెచ్‌సీఎల్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక అమలుకు అడుగులు వేస్తున్నట్లుగా ఐటీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. హెచ్‌సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ లోకేష్ తో సమావేశమయిన సందర్బంగా.. రాష్ట్రంలో తమ సంస్థ విస్తరణ ద్వారా మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఆరు కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. కొత్త ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుతో రాష్ట్రాల్లో గణనీయమైన పారిశ్రామికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ కొత్త పార్కుల్లో పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా రూ.లక్షన్నర కోట్ల విలువ చేసే పెట్టుబడులను ఆకర్షించవచ్చు. అందులో సగం పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కొత్త పార్కుల ఏర్పాటు లక్ష్యం.
దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా మనకు 10 ఓడరేవులు,10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా, లాజిస్టిక్స్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని పశ్చిమ తీరం కంటే తూర్పు తీర ప్రాంతం రోడ్డు, రైలు, విమానయాన మార్గాలతో మెరుగైన రీతిలో అనుసంధానమై ఉంది. ఇవన్నీ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహారశుద్ధి వంటి రంగాల్లో ఎక్కువ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీపడే విధంగా ఎపి విధానం ఉండాలని గతంలో ఉన్న ఎపి బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు. పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేలా ప్రోత్సహించడంతోపాటు, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలతో ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు.
దృఢమైన కార్యాచరణతో పారిశ్రామిక రంగాన్ని జేగీయ మానంగా వెలిగించడానికి విద్య,ఐటీ మంత్రి గా నారా లోకేష్ భగీరథ యత్నం చేస్తున్నారు.తాజాగా పెట్టుబడుల లక్ష్యంగా సాగుతున్న లోకేష్ దావోస్ పర్యటన ఆశావహకంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, వివిధ రంగాల్లో పేరున్న పారిశ్రామికవేత్తలతో లోకేష్ విడిగా భేటీ అవుతున్నారు.
దావోస్‌లో సైతం సత్యనాదెళ్ల, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ, సింగపూర్ వర్సిటీ ఈడి మాథ్యూ ఉక్ చాంగ్, ఆక్సెస్ హెల్త్ కేర్ సీఈఓ అనురాగ్ జైన్, స్విస్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నికోలస్ సామ్యూల్ గగ్గర్, స్నైడర్ సిఇఓ దీపక్ శర్మ, ఎయిరిండియా సీఇఓ క్యాంప్ బెల్ విల్సన్, జిఎంఆర్ ఇన్ ఫ్రా కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్, జిఎస్ఎంఎ (యుకె) డైరక్టర్ జనరల్ వివేక్ బద్రీనాథ్, రోబస్ట్ ఎఐ సిఇఓ ఆంటోనీ జూలెస్, పెప్సికో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అథినా కనౌరియా, ఆగరి (యుఎస్ఎ) సిఇఓ సార్ యోస్కోవిట్జ్, టెమాసెక్ స్ట్రాటజిక్ హెడ్ రవి లాంబా వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఉత్పత్తిదారులతో లోకేష్ వ రస భేటీలు నిర్వహిస్తున్నారు.
జగన్ జమానాలో కుప్పకూలిన ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టడమే కాదు. ఏపీ యువత ఉద్యోగ-ఉపాథి కోసం బయట రాష్ట్రాలకు వెళ్లకుండా, సొంత గడ్డపైనే వారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన.. కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రపంచదేశాల్లోని పెట్టుబడుదారుల వెంటపడి మరీ, కంపెనీలు తీసుకువచ్చేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నారు.
దావోస్ పర్యటనలో తండ్రి చంద్రబాబునాయుడు ఉన్నప్పటికీ, పేరున్న కంపెనీలతో లోకేష్ విడిగా ముచ్చటిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదివిన ఏకైక భారత మంత్రి అయిన లోకేష్ కు, మిగిలిన వారిలా భాషా సమస్యలు లేకపోవడం ఒక ప్లస్ పాయింట్. అవును.. లోకేష్ పట్టువదలని విక్రమార్కుడే. అది యువగళం పాదయాత్రలో తెలుగుప్రజలంతా దర్శించినదే!

సీనియర్ జర్నలిస్ట్,
9849625610