– కాంగ్రెస్ అభ్యర్ది నామినేషన్ కార్యక్రమంలో బీహార్ ఎన్నికల పరిశీలకులు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలతోకూడిన మహాఘట్ బంధన్ అఖండ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ బీహార్ ఎన్నికల పరిశీలకులు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
బీహార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకునిగా పాట్నా నుంచి పర్యటన ప్రారంభించిన మంత్రి పొంగులేటి శనివారం బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా నూతన్ అసెంబ్లీ నియోజకవర్గం మహాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ గిరి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే బీహార్ ప్రజలను చైతన్యపరిచారని, ఆ రాష్ట్రంలో ఓట్ల కుంభకోణాన్ని ప్రజలకు వివరించి మహాఘట్ బంధన్ విజయానికి బాటలు వేశారని అన్నారు. ఇటీవల మహిళలకు తాయిలాలను పంచిన ప్రధాని నరేంద్రమోదీ ఒక విధంగా వారి కూటమి పరాజయాన్ని ముందుగానే అంగీకరించారని, నవంబర్ 14న జరిగే ఓట్ల లెక్కింపుతో ఈ విషయం సుస్పష్టమవుతుందన్నారు.
ఎన్డీయే కూటమి పాలనలో సిఎం నితీష్‌కుమార్ అన్ని రంగాలలో విఫలమయ్యారని ఈసారి ప్రజలు ఆయనను తిరస్కరించబోతున్నారని అన్నారు. బీహార్‌లో నితీష్ కుమార్–బీజేపీ పాలన కేవలం మాటలకే పరిమితమైందని వాస్తవానికి ఇది అసమర్థ పాలన అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీహార్‌లో ఎక్కడ చూసినా నిరుద్యోగం, యువతలో నిస్పృహ కనిపిస్తున్నాయని, ఆ రాష్ట్రంలో నుంచి యువత ఉద్యోగాల కోసం వలసపోతోందని అన్నారు.
అందువల్లే దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడ చూసినా బీహార్ యువకులే కనిపిస్తున్నారని, ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. .బీజేపీ–జెడీయూ పొత్తు కేవలం అధికారం కోసమే తప్ప ప్రజల కోసం కాదని, సిఎం నితీష్ కుమార్ తన కుర్చీ కోసం నీతిబాహ్య చర్యలకు పాల్పడుతుంటారని ఆరోపించారు.
ఈసారి ఇండియా కూటమి విజయం సాధించి ప్రజల్లో కొత్త ఆశలకు , వారి ఆకాంక్షలకు ప్రాణం పోస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. నామినేషన్‌కు ముందు కాంగ్రెస్ వార్‌రూమ్‌లో ఎన్నికల వ్యూహంపై స్దానిక కాంగ్రెస్ నాయకులతో చర్చించారు.