మహిళా జీవితాలు మార్చేందుకే మహాశక్తి పథకం

-మహిళా శక్తికి మహాభివందనం
-మహిళలను ఘనంగా సన్మానించిన జీవి దంపతులు
-మహిళలపై పెరుగుతున్న నేరాలపై ఆవేదన
-మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ: సృష్టికి మూలం స్త్రీ..ఆమె శక్తి యుక్తులు అపారం..ఆమె లేకుంటే గమ్యం, గమనం లేదు.. మానవాళికి జీవం జీవితమే లేదు.. అందుకే ఆమెకు శతకోటి వందనాలంటూ పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విఠంరాజుపల్లి వద్ద గెస్ట్ హౌస్ లో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు జీవీ ఆంజనేయులు ఆయన సతీమణి లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సతీమణి, జనసేన నాయకులు మహిళా విభాగ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని, అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా అవరోధాలన్నీ అధిగమించి ముందుకు వెళుతున్నారన్నారు. ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ ముందంజలో దూసుకు వెళ్తున్న స్త్రీ మూర్తులు ఎందరో ఉన్నారని, వాకిలి దాటవద్దని ఆంక్షలు పెడితే ఆవలి హద్దులు దాటి అవనిని జయించి మహిళా శక్తిని చాటుకున్నారని ఆయన కొనియాడారు.

మహిళల జీవితాలు మార్చేందుకు టిడిపి-జనసేన సంయుక్తంగా మహా శక్తి పథకం రూపొందించిందని అధికారంలోకి రాగానే ఈ పథకం అమలుతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆడబిడ్డలు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణించాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆలోచించారని చెప్పారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి ప్రోత్సహించారన్నారు. 50% ఉన్న మహిళలు అందరూ చదువుకునేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారని, వారి ఉన్నత విద్య కోసం మహిళా విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

వైసీపీ ప్రభుత్వం నిత్యవసరాలు పెంచడంతో మహిళలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయన్నారు. మహిళల జీవితాలు రోడ్డున పడేసేలా వైసిపి ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారని, మద్యపాన నిషేధం చేశాకే మరల మీ వద్దకు వచ్చి ఓటు అడుగుతానని జగన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడన్నారు. మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయని, దేశంలోనే వీటిలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో మూడు గంటలకు ఒక మహిళపై దాడి, ఎనిమిది గంటలకు ఒక అత్యాచారం జరుగుతుందన్నారు. టిడిపి ప్రభుత్వంలో మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన ఫోర్త్ లయన్ యాప్ ను దిశా యాప్ గా మార్చారే తప్ప దానివల్ల మహిళలకు ఎటువంటి ఉపయోగం లేకుండా ప్రభుత్వం దగా చేసిందన్నారు.

అనంతరం మహిళా దినోత్సవ సందర్భంగా జీవి దంపతులు మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మహిళలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజిని, మాజీ శాసన సభ్యులు మక్కెన మల్లికార్జునరావు సతీమణి మక్కెన పద్మావతి, సినీ డైరెక్టర్ మేదరమెట్ల సౌజన్య, తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గద్దె రాజ్యలక్ష్మి,పల్నాడు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, శావల్యాపురం జడ్పిటిసి పారా హైమావతి, నూజెండ్ల మండల జడ్పిటిసి జడ్డా సుబ్బులు రామయ్య,నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు ముప్పుడి చౌడమ్మ,కౌన్సిలర్ లు పోలూరి అంజలి దేవి ,తెలుగు మహిళలు ఆదిలక్ష్మి, పట్టణ తెలుగు మహిళలు బట్లగుంట లక్ష్మి,చెవులు సుబ్బులు, బసవమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply