Suryaa.co.in

Devotional

మహా పర్వదినం.. మహా శివరాత్రి

ఆసేతు శీతాచలం ఆస్తికులు శివనామ స్మరణంలో, శివభక్తి తత్పరతలో 24 గంటలూ పరవశించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. అంతేకాదు అత్యంత విశిష్టమైనదిగా, పరమపవిత్రమైనది.

మహాశివరాత్రి పండుగను జరుపుకోవడంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం. అయితే ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు తెలియజేస్తోంది.

భక్తుల పాలిట కల్పతరువు అయిన మహాశివునికి ఈ విశిష్ట రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.

మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు.. నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతూనో, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివ గాధలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.

మహశివరాత్రి పురాణగాథ
ఒక సమయంలో బ్రహ్మ, విష్ణుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరెవరు ఎంతటి గొప్పవారో తేల్చుకోనేందుకు రంగంలోకి దిగుతారు. వారిని గమనించిన పరమ శివుడు వారికి కలిగిన అహంభావాన్ని అణగదొక్కి.. ఇరువురికి గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ‘మాఘమాసం చతుర్దశినాడు శివుడు వారి ఇరువురకు మధ్య ‘జ్యోతిర్లింగం’గా రూపుదాల్చాడు. వారు ఇరువురు ఆలింగం యొక్క ఆది అంతాలను తెలిసుకోవాలని విష్ణుమూర్తి వరాహ రూపందాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళగా; బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆకాశం అంతా ఎగిరాడు.

చివరకు కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుని శరణు వేడుకుంటారు. అప్పుడు ఆ పరమ శివుడు తన నిజరూపంతో దర్శన మిచ్చి అనుగ్రహించి వారి అహంకారాన్ని పోగొడుతాడు. దానితో బ్రహ్మ,విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి వానిని విశేష పూజలతో సేవించారు. ఆ పర్వదినమే ‘మహశివరాత్రి’గా మారిందని పురాణ గాథ.

‘శి’ అనగా శివుడని.. ‘వ’ అనగా శక్తి రూపమని శివ పద మణి మాల చెబుతోంది. ఈ ‘శివరాత్రినాడు’ విశేషమైన కాలం ‘లింగోద్బవకాలం’. ఈ కాలం రాత్రి 11-30 నుండి 1 గంట వరకు ఉంటుందని చెబుతారు. ఆ సమయంలో నిర్మల మనస్సుతో శివపంచాక్షరీ జపిస్తూ ఉపవాస దీక్షతో ‘పార్ధివ లింగానికి ‘ పుజాభిషేకాలుచేసి మొదటి జాములో పాలతోను, 4వ జామునందు తేనెతోను అర్చించిన ఉమాశంకరులకు అత్యంత ప్రీతికరమని, అలాగే లక్ష బిల్వార్చన ఆచరించిన వారికి విశేష పుణ్యఫలం సిద్ధిస్తుందని, శివునితో విసర్జించబడిన ‘మొగలిపూవులతో’ శివారాధన కనుక చేస్తే ఆ రోజు విష్ణుమూర్తి ప్రీతికొరకై స్వీకరించి వారికి సహస్రాశ్వమేధ ఫలం లభించి, శివ సాయుజ్యం లభిస్తుందని పండిత శ్రేష్ఠులు ‘శివరాత్రి మహత్యం’ గురించి వివరిస్తూ ఉంటారు.

– చింతా గోపీ శర్మ సిద్ధాంతి
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం)
పెద్దాపురం
9866193557

LEAVE A RESPONSE