Suryaa.co.in

Devotional

కురుక్షేత్ర యుద్ధం రహస్యం

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు భంగమైన ఊరువులతో తన మృత్యువుకై ఎదురుచూస్తున్నాడు. పాండవులు దుర్సోధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రథాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గదాయుద్ధాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రథాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో ఉప్పొంగుతోంది.

అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి, “బావా చూసావా కౌరవులు ఎలా నశించారో?” అని అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు. అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులూ, శత్రువులంతా ఎలా తన అస్త్రశస్త్రాలకి బలైంది తనకళ్ళకు కనపడినది. తను జయించాడు…కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన మేటి విలుకాడే ఈ భూమి మీదే లేకుండాపోయాడు. అన్ని రథాలు రణరంగం మధ్యలో ఉన్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి.

ధర్మరాజు ఒక్క ఉదుటన రథం కిందకు దూకి – “పితామహా.. పితామహా.. మేము జయించాం… కౌరవులందరూ నిహతులైనారు..” అన్నాడు. భీష్ముడు దుఃఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు.
“అయితే నాయనా నూర్గురు సోదరులని చంపినట్టేనా..” అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు. అవును పితామహా… సుయోధనుడి ఊరువులను ఇప్పుడే భంగపరిచాను. గదా యుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు. నా ప్రతిజ్ఞలు నేరవేర్చుకున్నాను. ఇక రాజ్య లక్ష్మి మా వశమైంది..”
“కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్నమాట”
“అవును పితామహా.. ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి..” అని నకులుడన్నాడు. నాడు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహా అని సహదేవుడాన్నాడు.భీష్ముడు నలుదిక్కులా కలయజూశాడు.
“అర్జునా. పిలిచాడాయన నెమ్మదిగా.”చెప్పండి పితామహా..”
“నీవేమి చెప్పవేం..??”
“చెప్పేదేముంది పితామహా… నేను గెలిచాను.. మిమ్మల్ని పడగొట్టాను,కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను. ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము.”
“మంచిది నాయనా.. అవును వాసుదేవుడేడి..?” ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి గంగాతనయునికి నమస్కరించాడు.
“పరంధామా.. నాకెందుకయ్యా నమస్కరిస్తావు. ధర్మపక్షపాతివై ధర్మం పక్షాన నిలిచావు, ఆయుధంపట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదేకదా ముకుందా… నీకే మేమంతా నమస్కరించాలి.”

ఆ మాటలువింటూనే అర్జునిడికి ఎక్కడలేనికోపం వచ్చింది. ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు. యుద్ధం చేసిందంతా నేను.. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టిగరిచారు. ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు కానీ నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత అని మనసులో అనుకున్నాడు.

అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరు తమ తమ రథాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారథి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేసాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రథం పైన ఉన్న ధ్వజం వైపు చూసాడు. ఝండా పై ఉన్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రథంముందు వినయంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు.

“శ్రీరామచంద్రా… వాసుదేవా.. పరంథామా నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా పార్ధుడి రథంపై ధ్వజమై నిలిపి నీవు లోకానికి ప్రసాదించిన భగవద్గీతాసారం విని నీ విశ్వరూప సందర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా..” అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రథంపైనుండి దిగాడు. నెమ్మదిగా కొంతముందుకి వచ్చి రథంవైపు చూసి తన పిల్లనగ్రోవినెత్తి సైగచేసాడు.

అంతే… ఫెళ ఫెళ మంటూ శబ్దం చేస్తూ రధం కుప్పకూలిపోయింది. రథచక్రాలు తునాతునకలయ్యాయి. రథాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయకంపితులై చూస్తుండగానే రథం అశ్వాలతో సహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు “అర్జునా అర్జునా” ఏమైంది అంటూ పరుగు పరుగున వచ్చాడు.

అర్జునుడు కూడా భయపడుతూ “బావా వాసుదేవా” అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. “నీకేమికాలేదు కదా బావా.. ఏమిటిలా జరిగింది..” అన్నాడు ఖంగారుగా. ఆ మాటలు వింటునే కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వాడు. పక్కనే వున్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు.
“ఆంజనేయా.. నా ఖంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా..” అన్నాడు అర్జునుడు. హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు -“పార్థా నవ్వక ఏమి చెయ్యమంటావు. నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరమార్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది.”
“బావ నన్ను కాపాడాడా.?”
“అవును అర్జునా… ఈ రథం ఇప్పుడు కూలిపోలేదు… భీష్ముని బాణ ధాటికి నీ రథ చక్రాలు ఏనాడో కూలాయి. కర్ణుని అస్తాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణించాయి. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలల్లో నీ రథం అప్పుడే తునాతునకలయ్యింది. బ్రహ్మాస్త్రం ధాటికి నీ రథం యావత్తూ బూడిదయ్యింది.”
“మరి..?”
“నీ రథం పైన సాక్షాత్తు ఆది విష్ణువే ఉన్నాడు. ఆ పరమాత్ముడి ఆజ్ఞలేక అన్నీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు వాసుదేవుడు రథంనుండి కిందికి దిగడంతో ఆ అస్త్రాలు పనిచేసాయి. నీ రథం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచెయ్యలేదంటే దానికి కారణం తెలుసా! అవి నిన్ను చేరాలంటే నీ కన్నా ముందు ఆసీనుడైన ఆ పరంథాముణ్ణి దాటి రావాలి కాబట్టి..”
హనుమంతుడు ఈ మాటలనగానే పాండవులకు తమ అజ్ఞానం ఏమిటో బోధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడికి ఎందుకు ఆపాదించాడో అర్థం అయ్యింది. అయిదుగురూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు.
“పరమాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి..” అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా.శ్రీకృష్ణుడు మళ్ళి మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.

– ఆర్కే

LEAVE A RESPONSE