Suryaa.co.in

National

“మలరే మౌనమా…”

1995లో వచ్చిన కర్ణ తమిళ్ష్ సినిమాలోని పాట “మలరే మౌనమా…”

విద్యాసాగర్ విజయనగరంలో పుట్టిన పదహారణాల తెలుగువ్యక్తి. విద్యాసాగర్‌కు ఉన్నంత విద్వత్, విషయం, ప్రతిభ, సృజనాత్మకత ఇంత వరకూ వచ్చిన తెలుగువారైన సినిమా సంగీత దర్శకుల్లో మరెవరికీ లేవు. ఈ మాట అతిశయోక్తి కాదు; అబద్ధం కాదు. Arrangements, recording values, orchestration, tunes, sounding అంశాలలో మరే తెలుగు సంగీత దర్శకుడికన్నా విద్యాసాగర్ మిన్న.

పరిశ్రమ, నేర్చుకోవడం, నేర్పు, పనిచెయ్యడం, పనితనం ఉన్న తెలుగు సంగీత దర్శకుడు విద్యాసాగర్. Westernలో కర్ణాటక సంగీతంలో సరైన, మేలైన అభ్యాసం, ఉత్తీర్ణత ఉన్న తెలుగు సంగీత దర్శకుడు విద్యాసాగర్. గజల్ గాన విధానంపై బీ. శంకర్, పీ.బీ. శ్రీనివాస్, జీ.కె. వెంకటేశ్ (ష్) తరువాత సరైన అవగాహన ఉన్న తెలుగు సంగీత దర్శకుడు విద్యాసాగర్.

వైబ్రోఫోన్, గిటార్, పిఅనో, కీ బోడ్, సంతూర్ వంటి పలు వాయిద్యాలను వాయించడంలో దిట్ట విద్యాసాగర్. సుసర్ల దక్షిణామూర్తి తరువాత ఇంగ్లిష్ సినిమాకు సంగీతం చేసిన తెలుగువ్యక్తి విద్యాసాగర్.

1989లో పూమనమ్ అన్న తమిళ్ష్ సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యారు విద్యాసాగర్. తొలి సినిమాలోనే “సిల నేరమ్ ఏదేదో నడక్కుమ్…” అన్న గజలియత్ పాట చేశారు. గజలియత్ పాట కాబట్టి పీ.బీ. శ్రీనివాస్ చేత పాడించారు ఆ పాటను. పీ.బీ. శ్రీనివాస్, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం వంటి గొప్ప తెలుగు గాయకుల గొప్పతనాన్ని సరిగ్గా తెలుసుకున్న తెలుగువ్యక్తి, తెలుగు సంగీత దర్శకుడు విద్యాసాగర్. ఇది అరుదైన విషయం.(తెలుగు సంగీత రసజ్ఞ మేధావర్గం ఇప్పటికీ ఘంటసాలను దాటి బయటకు రాలేకపోతోంది)

విద్యాసాగర్ గాన అభిజ్ఞత ఆయన ఎస్.పీ.బీ. గురించీ పీ.బీ.ఎస్. గురించీ తమిళ్ష్ వేదికలపై మాట్లాడుతున్నప్పుడు స్పష్టమౌతూంటుంది. తెలుగు రసజ్ఞ మేధావర్గానికి విద్యాసాగర్ పొసగకపోవడం బాధాకరం. తెలుగువాళ్లం మనం గర్వపడాల్సిన సంగీత దర్శకుడు విద్యాసాగర్.

1989కు ముందు తమిళ్ష్‌లో సంగీత దర్శకుడు ఎస్.ఎ. రాజ్ కుమార్ పేరుతో వచ్చిన కొన్ని ఉన్నతస్థాయి పాటలు విద్యాసాగర్ చేసినవి. 1989లో తాను సంగీత దర్శకుడుగా పరిచయమయ్యాక తమిళ్ష్ సినిమాల్లో ఎంతో గొప్ప సంగీతాన్ని ఇచ్చారు విద్యాసాగర్. కమల్ హాసన్ నటించిన అన్బే శివమ్ అన్న సినిమాలో “అన్బే శివమ్…” అన్న మహోన్నతమైన పాట చేశారు విద్యాసాగర్. ఒక out of the world పాట అది.

మలయాళంలో ఎంతగానో రాణించారు విద్యాసాగర్. ఒకదశలో మలయాళంలో గొప్ప సంగీతదర్శకుడు విద్యాసాగర్. తెలుగులో సూపర్ హిట్ అయిన “తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే…” పాట మలయాళంలో విద్యాసాగర్ చేసిన పాటే.

“మలరే మౌనమా…” పాట దేశంలో వచ్చిన గొప్ప పాటల్లో ఒకటి. దేశం మొత్తం ధ్వనించింది. ఈ పాటను విన్న హిందీ కవి, నటుడు గుల్‌షన్ బావ్‌రా ఈ పాటకు విస్మయం చెందారు. పని మీద చెన్నై వచ్చిన సందర్భంలో ప్రముఖ కవి భువనచంద్ర గారితో గుల్‌షన్ బావ్‌రా “ఈ పాట చేసిన సంగీత దర్శకుడికి పాదాభివందనం చేస్తాను నాకు ఆయన్ను పరిచెయ్యండి” అన్నారు. (భవనచంద్ర స్వయంగా ఈ వ్యాస రచయితతో చెప్పినది)
“మలరే మౌనమా…” పాట కానడ రాగం (95%)లో చేశారు విద్యాసాగర్. చరణంలో ఒకచోట పెద్ద ‘గ’ (స్వరం)వాడి సౌందర్యం కోసం కాస్తంత మిశ్ర కానడ గా మార్చారు. పాట tone, timbre, texture, rhythm, prelude & interlude music చాల ఉదాత్తంగా ఉంటాయి. పాట arrangements చాల గొప్పగా ఉంటాయి.

ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పాడారు. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ఈ పాట గొప్పతనం గురించి బహిరంగంగా ఎంతో చెప్పారు. పాట చూడడానికి కూడా ఎంతో బావుంటుంది.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE