– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
గోరంట్ల: ఎన్నికల ముందు బూదిలి పంచాయతీ వాసులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నాని, 2027 నాటికి చిత్రావతి నదిపై వంతెనను నిర్మించి వినియోగంలోకి తీసుకొస్తానని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. గోరంట్ల మండలం బూదిలి పంచాయతీ చిత్రావతి నదిపై రూ.8.52 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి సవిత బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, చిత్రావతి వరదల సమయంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇదే విషయం సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లగా, చిత్రావతి నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. రూ.8.52 కోట్లతో బూదిలి గ్రామం వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పీఎంజీఎస్ వై నిధులతో వంతెనను నిర్మించనున్నట్టు వెల్లడించారు. గడువులోగా బూదిలి వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని, 2027 నాటికి వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి సవిత స్పష్టంచేశారు.
వలస పక్షులతో ఒరిగింది శూన్యం
వలస పక్షుల రాజకీయాలతో పెనుకొండ నియోజక వర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వారి వల్ల ఒరిగిందేమీ లేదని మంత్రి సవిత విమర్శించారు. వైసీపీ పాలనలో నాటి పాలకులు వ్యక్తిగత లబ్ధికే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చెప్పిన హామీలనే కాదు చెప్పని హామీలను కూడా అమలు చేసిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోందని తెలిపారు. అంతకుముందు మంత్రి చిత్రావతి నదికి జలహారతి ఇచ్చి, పసుపు కుంకుమతో గంగమ్మకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు నరసింహారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.