Suryaa.co.in

Editorial

మంత్రి ఓఎస్డీనా.. మజాకానా?

– ప్యానెల్‌లో లేకున్నా ఆర్ధిక మంత్రి ఓఎస్డీ భార్యకు ప్రమోషన్
– సప్లిమెంటరీ ప్యానెల్‌లో చేర్చి మరీ ప్రమోషన్
– ఒకేరోజులో వాయువేగంతో నడిచిన ప్రమోషన్ ఫైలు
– శరవేగంతో ఒక్కరోజులోనే ప్రమోషన్
– మిగిలిన వారికి రెండు నె లల సమయం
– ప్యానెల్‌లో ఉన్నా ప్రమోషన్ రాకుండానే రిటైరైన వాళ్లు బోలెడు
– ఇప్పటికే వివాదంగా మారిన మంత్రి అచ్చెన్న సోదరుడి ప్రమోషన్ వ్యవహారం
– రిటైరయ్యే ముందురోజు డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ ఫైల్
– దానికోసం హడావిడిగా 32 మందితో ప్రత్యేక జాబితా
– అందులో నాయుడుది 29వ పేరు
– దానితో ఆర్ధికశాఖపై భారం
– తనకేమీ తెలియదన్న ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్
( మార్తి సుబ్రహ్మణ్యం)

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దన్న సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరికను ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. గత జగన్ ప్రభుత్వంలో ఇలాంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలతో, ఆ ప్రభుత్వం అనతికాలంలోనే అప్రతిష్ఠపాలయింది. అలాంటి అపవాదు తమ ప్రభుత్వానికి రావద్దన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన.. ఆవేదనగానే మిగులుతోంది. దీనికి ఆర్ధిక శాఖలో తాజాగా వెలుగుచూసిన ఓ అధికారిణి ప్రమోషన్ వ్యవహారమే నిలువెత్తు నిదర్శనం.

ఆడిట్ శాఖకు చెందిన చెందిన మధురిమ అనే గ్రూప్-1 అధికారి.. మిగిలిన వారి మాదిరిగానే ప్రమోషన్ కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో తనకు ప్రమోషన్ రాలేదంటూ ఆమె కోర్టులో కేసు వేశారు. అది నడుస్తోంది. ఈలోగా ప్రభుత్వం మారింది. ఆర్ధికమంత్రిగా పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. దానితో ఆయన సీటీవోగా ఉన్న ఓ అధికారిని తన ఓఎస్డీగా నియమించుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది.

ఎప్పుడైతే ఆర్ధికశాఖకు ఆ అధికారి ఓఎస్డీగా వచ్చారో, ఆ తర్వాతనే మధురిమ ప్రమోషన్ ఫైలు పంచకల్యాణి కూడా, ఈర్యేపడేంత వాయువేగంతో కదిలింది. ఒకేరోజులో ఫైలు కదిలింది. ఆమె కోసం సప్లిమెంటరీ ప్యానల్ తయారుచేశారు. కార్యదర్శుల స్థాయిలోని ఐఏఎస్‌లూ ఆమెకు అనుకూలంగా సంతకాలు చేశారు. అంతే.. ఆమెకు ప్రమోషన్ ఖరారయి.. కోరుకున్న వ్యవసాయశాఖలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి (ఏఓ)గా నియమితులయేందుకు రంగం సిద్ధమయింది. ఎందుకంటే సదరు మహిళా అధికారి.. ఆర్ధికమంత్రి గారి ఓఎస్డీ భార్య కాబట్టి! ఇప్పుడు ఈ ప్రమోషన్ వ్యవహారం అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా ఒక అధికారికి ప్రమోషన్ రావాలంటే, దానికి చాలా పెద్ద ప్రక్రియనే ఉంటుంది. ప్రమోషన్ల కోసం ప్యానెల్ ఒకటి రూపొందిస్తారు. అందులో ముగ్గురు అధికారులు ఉంటారు. ప్రమోషన్లు ఇవ్వాల్సిన అధికారుల అర్హత, గుణగణాలను పరిశీలించిన తర్వాతనే, ఈ కమిటీ అధికారుల ప్రమోషన్ జాబితా విడుదల చేస్తుంది. ప్రస్తుతం మరో 5 నెలల వరకూ ప్యానెల్ లేదు. అయితే.. మధ్యలో అవసరం అనుకుంటే సప్లిమెంటరీ ప్యానెల్ తయారుచేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఈ సప్లిమెంటరీ ప్యానెల్ ప్రక్రియనే, మంత్రిగారి ఓఎస్డీ భార్యకు వరంగా పరిణమించింది.

సప్లిమెంటరీ ప్యానెల్ ద్వారా ఆమెకు ప్రమోషన్ ఇచ్చినప్పటికీ, అసలు ప్యానెల్‌లో ఆమె పేరు లేకపోవడమే ఇక్కడ మరో ఆశ్చర్యం. నిజానికి ప్రమోషన్ ప్యానెల్ ప్రక్రియ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. అసలు ప్యానల్‌లో పేరున్నప్పటికీ, ప్రమోషన్ రాకుండానే రిటైరయ్యేవారి సంఖ్య బోలెడు. కానీ ఆశ్చర్యంగా ఓఎస్డీ గారి భార్య ఫైలు మాత్రం.. ఒకేరోజులో వాయివేగంతో నడిచి, సంతకాల ప్రక్రియ పూర్తి చేసుకోవడం విశేషం.

తనకు ప్రమోషన్ రాకుండా అన్యాయం జరిగిందంటూ, ఆమె గతంలో కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అంతకుముందే ప్రమోషన్లపై స్టే ఉంది. ఈ క్రమంలో ఆమె తాను వేసిన పిటిషన్‌ను తాజాగా ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు.

దీనిపై ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ వివరణ కోరగా.. ఇలాంటి ఫైళ్లన్నీ నా దాకా రావు. అవన్నీ సెక్రటరీల స్థాయిలోనే జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కేశవ్ ఎప్పుడూ వ్యవహరించడు. మీరు చెప్పే అధికారిణి నా ఓఎస్డీ భార్య అన్న విషయం కూడా నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించారు.

కాగా ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు, విశాఖ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కింజరాపు ప్రభాకర్‌నాయుడు ప్రమోషన్ వ్యవహారం కూడా వివాదాస్పందగా మారింది. ఈనెల 31తో డిఎస్పీగా రిటైర్ కానున్న ప్రభాకర్‌నాయుడుకు, అదేరోజు అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ ఇచ్చి రిటైర్మెంట్ చేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సోషల్‌మీడియా వార్తలతో వివాదంగా మారింది.

ఆయన ఒక్కరి కోసం ఏకంగా 32 మందిని అడిషినల్ ఎస్పీలుగా ప్రమోషన్ ఇవ్వడం వల్ల, ప్రభుత్వంపై ఆర్ధికభారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అడిషినల్ ఎస్పీగా రిటైరయితే వచ్చే బెనిఫెట్ల భారం ఖజానాపై పడుతుందని ఆర్ధికశాఖ స్పష్టం చేసినప్పటికీ, మంత్రి అచ్చెన్నాయుడు వినకుండా సోదరుడి కోసం పట్టుపడుతున్నారన్న వార్తలు ప్రభుత్వానికి అప్రతిష్టగా మారాయి. ఈ వార్త ఇప్పుడు ప్రధాన మీడియాలో కూడా ప్రముఖంగా రావడంతో ప్రమోషన్ల వ్యవహారం చర్చనీయాంశమయింది.

LEAVE A RESPONSE