-160 కిలోమీటర్ల పైప్ లైన్లకు గాను 83 కీమీ పైప్ లైన్ వేయకుండా రూ.13 కోట్లు దోచుకున్నారు
– కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి
కావలి: పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రవేశపెట్టిన అమృత్ పథకం పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని, కోట్ల రూపాయలు దిగమింగారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.
జూన్ 4వ తేదీకి ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం అవుతున్న సందర్భంగా మంగళవారం ఆయన వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, పుర ప్రముఖులు, వివిధ వర్గాల వారికి ఏడాదిలో జరిగిన అభివృద్ధి, గత ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసం పై కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కల్యాణ మండపంలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.
ప్రభుత్వ ఆస్థి అయిన పైలాన్ ధ్వంసం అయితే ఆ పైలాన్ ని ఆఫ్ట్రాల్ అంటూ ప్రతాప్ రెడ్డి మాట్లాడాటం దుర్మార్గం అన్నారు. రూ.57.92 కోట్లతో అమృత్ పధకం టెండర్లను కేఎస్ఎల్ఆర్ కంపెనీ దక్కించుకుందని, ట్యాంకులు మాత్రమే కట్టారని, 160 కిలోమీటర్ల పైప్ లైన్లకు గాను 83 కీమీ పైప్ లైన్ వేయకుండా రూ.13 కోట్లు దోచుకున్నారని, ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో నిజం బయటకు రావాలన్నారు. పైప్ లైన్ వేయకుండా తాగునీటి కొరత సృష్టించడం ద్వారా గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు నీటి ట్యాంకర్ల తో రూ.9.55 కోట్ల నిధులు వెచ్చించడం జరిగిందన్నారు.
పనులు జరగకపోవడం వలన అమృత్ పథకం క్రింద ప్రజల నుండి వసూలు కావలసిన నీటి పన్ను 4.51కోట్లు కోల్పోవలసి వచ్చిందన్నారు. దీని వలన రూ.27 కోట్ల తాగునీటి బారం మున్సిపాలిటీపై పడిందన్నారు. అమృత్ పథకానికి మున్సిపాలిటీ రూ.51.92 కోట్ల రుణాలు తెచ్చిందని, అసలు తీర్చకపోగా ఇప్పటికీ వడ్డీ చెల్లిస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని తెలిపారు.
ఉదయగిరి రోడ్డులోని జాతీయ రహదారిపై మున్సిపాలిటీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వచ్చే పైప్ లైన్ ధ్వంసం చేశారని, దీని విలువ 7.40 కోట్లు అని, ఎలాంటి నష్ట పరిహారం జాతీయ రహదారి సంస్థ నుండి రాబట్ట కుండా కాంట్రాక్టర్లతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కుమ్మక్కు అయ్యాడని మండిపడ్డారు. దానిని ప్రస్తుతం రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఒక్క తాగునీటి పథకం లోనే రూ.35 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు.