25న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్(BLA) తో సమావేశం

-ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
-కార్యక్రమ ఏర్పాట్లపై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమీక్ష
-పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి

ఈ నెల 25న ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ బూత్ లెవెల్ ఎజెంట్స్ సమావేశానికి బూత్ లెవెల్ ఎజెంట్స్ పెద్ద ఎత్తున తరలి రావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లు, ఇతర వివరాలపై జూబ్లీహిల్స్ నివాసంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో సమీక్షించారు.

కార్యక్రమానికి సంబంధించి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశంలో ఖర్గే పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవెల్ ఎజెంట్స్ క్రియాశీలకంగా పనిచేశారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేసిన బూత్ లెవెల్ ఎజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply