Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి కింకర్తవ్యం ఏమిటి?

– సచివాలయానికి వెళ్ళరు… ఇంటి నుంచి బయట అడుగుపెట్టరా?
-లక్ష మంది మహిళల సమస్యపై ఒక్క మాటైనా మాట్లాడరా?
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్ళరని, ఇంటి నుంచి కాలు బయట పెట్టరని, లక్ష మంది మహిళా సమస్యలపై మాటైనా మాట్లాడరని కనీసం వారికి ముఖం కూడా చూపెట్టరని… మరి ముఖ్యమంత్రి కిం కర్తవ్యం ఏమిటని నరసాపురం
ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి లక్ష మంది మహిళల సమస్య కంటే పెద్ద సమస్య ఏమిటని నిలదీశారు. అంగన్వాడీ మహిళల జీతాల పెంపుపై ముఖ్యమంత్రి ఒక మాట చెప్పవచ్చు కదా?, వారికి ఆ నమ్మకం వేరే గా ఉండేది కదా?? అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

అంగన్వాడీలతో విద్యాశాఖ మంత్రి చర్చించడం విడ్డూరం
అంగన్వాడీలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరపడం విడ్డూరంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. విద్యాశాఖ మంత్రి కి అంగన్వాడీలకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంగన్వాడీలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తారని గుర్తు చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కిందకు వచ్చే అంగన్వాడీలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపితే, విద్యాశాఖ సమస్యలపై మాత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరపడం విడ్డూరం కాకపోతే మరి ఏమిటని ఎద్దేవా చేశారు.

అంగన్వాడీలు విరోచితంగా పోరాటం చేశారు. అంగన్వాడీల ఆందోళనను పోలీసుల ద్వారా అణిచి వేసే ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. పోలీసుల ద్వారా అంగన్వాడీలను భయభ్రాంతులకు గురిచేసింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. చివరకు ఘోరంగా అర్ధరాత్రి చర్చలు జరిపింది. అర్థరాత్రి మహిళలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరపడం దురదృష్టకరం. ఇంత జరిగినా ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం పరిశీలిస్తే ఆయనకు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని మనసే లేదని స్పష్టమవుతుంది.

ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు జీతాలను పెంచుతామని ఇచ్చిన హామీపై వారు తాము చేస్తున్న పనికి తగిన జీతం చెల్లించాలని మాత్రమే కోరారు. నిన్న అర్ధరాత్రి అంగన్వాడీల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపి మమ అనిపించారు. జీతాలను పెంచుతామని చెప్పినప్పటికీ, వెంటనే పెంచకుండా జూన్ జులై మాసాలలో పెంచుతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారు?. జూన్ జూలై నాటికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. అంగన్వాడీల జీతాలను పెంచేది అప్పుడు ఎవరవుతారు ? ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన చంద్రబాబు నాయుడే అవుతారన్నారు. ఇప్పటికీ ఇప్పుడే జీతాలను పెంచితే వచ్చే నష్టం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

లక్ష మంది మహిళల శాపాలను మూటగట్టుకోవలసిన అవసరం ఏమిటన్న విచక్షణ కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంగన్వాడీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వానిదైతే … మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరైనా, అంగన్వాడీలను ఉద్యోగంలో నుంచి తీసివేస్తామని ఎలా అంటారు. ఉద్యోగంలో నుంచి తీసివేసే హక్కు ముఖ్యమంత్రికి ఉన్నదంటే తమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కింద పరిగణిస్తున్నారని భావించిన అంగన్వాడీలు ఊరట చెందారు. అంగన్వాడీలు ఎవరైనా మరణిస్తే వారి దహన సంస్కారాల కోసం డబ్బులు ఇస్తామని చెప్పారు..

జీతాల పెంపు గురించి అడిగితే, మళ్లీ తిరిగి ఎన్నికైన తరువాత పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీని తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది.. కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే నూతన ప్రభుత్వం వారికి తప్పకుండా న్యాయం చేస్తుందన్న ఆశాభావాన్ని రఘురామ కృష్ణంరాజు వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ద్వారా వారికి తాత్కాలికంగా కూడా ఉపశమనం లభించలేదు.

జీతాల పెంపు కోసం వీరోచితంగా పోరాడిన అంగన్వాడీలు పది అడుగులను ముందుకు వేయడానికి, ప్రస్తుతం ఒక్క అడుగు వెనక్కి వేశారు. ఇది వెనుకడుగాని భావించాల్సిన అవసరం లేదు. అంగన్వాడీలకు భవిష్యత్తులో మంచే జరుగుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగితే మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాలేదు
విశాఖపట్నం వేదికగా జరిగిన పారిశ్రామిక పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినప్పటికీ, మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి రాలేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. దావోస్ లో జరిగిన పారిశ్రామికవేత్తల పెట్టుబడుల సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలను కుదుర్చుకున్నారు.

పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్న పారిశ్రామికవేత్తలతోనే రేవంత్ రెడ్డి ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు అర్థమవుతుంది . దావోస్ లో గత ఏడాది, ఈ ఏడాది జరిగిన పారిశ్రామికవేత్తల పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కాలేదు.

అంతకు ముందు ఏడాది హాజరైనప్పటికీ బైజుస్ వంటి దివాలా కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దావోస్ కు ముఖ్యమంత్రి వెళ్ళకపోయినప్పటికీ, ఇక్కడే సెట్ చేయవచ్చు. కానీ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు హాజరు కావడమే అసలు సమస్య అంటూ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

26 వ తేదీన నిర్వహించే సెమినార్ ను సక్సెస్ చేయండి
తక్షశిల స్కూల్ ఆఫ్ రిపబ్లిక్ పాలసీ సంస్థ, న్యాయవాది ఉమేష్ చంద్ర తో పాటు పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన ఒక ప్రత్యేక సెమినార్ నిర్వహిస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంత దారుణంగా అన్యాయానికి గురవుతున్నామో ప్రజలకు వివరించేలా ఈ సెమినార్లో ముఖ్య వక్తల ప్రసంగాలు ఉంటాయని చెప్పారు.

పరిశ్రమలను దారుణంగా నిర్లక్ష్యం చేస్తే, ప్రగతి అన్నదే లేకపోతే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడం కష్టమేనని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ సెమినార్ లో ప్రముఖులు చేసిన ప్రసంగాలను క్రోడీకరించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక వినతి పత్రం అందజేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు హాజరై తమ విలువైన సలహాలు సూచనలను అందజేయాలని కోరారు.

లావు శ్రీకృష్ణదేవరాయులు ఎందుకు రాజీనామా చేశారు?
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైకాపాకు ఎందుకు రాజీనామా చేశారని, అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీని ఎందుకు వీడారో సాక్షి దినపత్రికలో రాస్తే బాగుంటుందని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి వ్యక్తి అని ఆయన్ని కూడా ఎందుకు భరించలేకపోయారంటూ ప్రశ్నించారు.

నేను అనుకున్నది చేయలేకపోయానని శ్రీకృష్ణదేవరాయలు ఆవేదన వ్యక్తం చేశారంటే, ఆయన అనుకున్నది మీరు చేయనివ్వలేదనే అర్థం కదా అంటూ నిలదీశారు. నిడదవోలు సీటు కోసం, ఇంకేదో సీటు కోసం కుస్తీలు పడుతున్నారని, వారు వెళ్ళిపోయారు… వీరు వెళ్లిపోయారన్న వార్తలు ఇప్పుడు వైకాపాలో కామన్ అయ్యాయి. ఎంపీ బాలశౌరి వికెట్ డౌన్ అయిన తర్వాత, తెదేపా తో పొత్తు వల్ల జనసేనకు అన్యాయం జరుగుతుందని సాక్షి దినపత్రిక ఆందోళన చెందుతూ వార్త కథనం రాయడం విడ్డూరంగా ఉంది.

రోజుకోక నాయకుడు వైకాపాను ఎందుకు వీడుతున్నారో మాత్రం సాక్షి దినపత్రిక వార్తా కథనాలను రాయడం లేదు. వైకాపాలో కేశినేని నాని చేరారని చెబుతున్నప్పటికీ, బడ్జెట్ సమావేశాల తర్వాత ఆ పార్టీ కి గట్టి షాక్ తగలననిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తెదేపా జనసేన కూటమిలో లేని లుక, లుక లను ఉన్నట్లుగా క్రియేట్ చేసి, రెండు పార్టీల మధ్య దూరం పెంచాలనుకునే ప్రయత్నాన్ని సాక్షి దినపత్రిక ఎంతగా చేసినప్పటికీ, ప్రజలు అన్ని గమనిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు, సాక్షి దినపత్రిక యాజమాన్యానికి, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియజేశారు.

ఆధారాలతో సహా పిటిషన్ దాఖలు చేశాను
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఎలా లబ్ధి పొందారో స్పష్టంగా ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని రఘు రామ కృష్ణంరాజు తెలియజేశారు. నేను దాఖలు చేసిన పిటిషన్ విచారణ కు అర్హత పొందుతుందనే ఆశాభావంతో ఉన్నాను. సాక్షి దినపత్రికకు వందల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చారు. జగనన్న ఆసరా అడ్వర్టైజ్మెంట్ ను మంగళవారం కూడా రెండు మూడు పేజీలు సాక్షి దినపత్రిక కు మాత్రమే ఇవ్వడం జరిగింది.

ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలకు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. ఒక్క సాక్షి దినపత్రికకే అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇచ్చారు. సాక్షి దినపత్రిక నాది కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పవచ్చు. ఇంకా సాక్షి దినపత్రిక కౌంటర్ దాఖలు చేయలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

నేను దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం నాడు విచారణ అర్హతపై ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయడానికి ధర్మాసనం ఒక టైం ఫ్రేమ్ ను ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్, భారతి పాలిమర్స్, దాల్మియా సిమెంట్స్ మాత్రమే కౌంటర్ ఫైల్ చేశారు. ఈ కేసులోని మిగతా ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయలేదు. మంగళవారం నాడు విచారణకు హాజరైన వారి తరపు సీనియర్ న్యాయవాదులు మరికొద్ది సమయం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.

ఎన్నికలు వస్తున్నాయని, ఎన్నికల్లో పాపులారిటీ కోసమే రఘురామకృష్ణం రాజు ఈ తరహా పిటిషన్ దాఖలు చేశారని వారు పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే కేసు వేశాననడం హాస్యాస్పదంగా ఉంది. నేను ఎన్నో కేసులను దాఖలు చేశాను. మూడు సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను సహేతుకమైన కారణమే చెప్పాను. న్యాయస్థానాలలోని కేసుల విచారణకు హాజరై కడిగిన ముత్యంలా నిర్దోషిగా బయటపడాలని మాత్రమే కోరుకుంటున్నట్లు చెప్పానని గుర్తు చేశారు.

అలాగే న్యాయస్థానాలలోని కేసులను సత్వరమే తేల్చాలని కోరడం జరిగింది. ఇప్పుడేదో నేను కొత్తగా కేసు వేసినట్లు ప్రతివాదులు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రావణబ్రహ్మ సీతను చెరపట్టేటప్పుడు లంక వినాశనం అవుతుందని విభీషణుడు చెప్పినట్లుగా, పుత్ర ప్రేమ వల్ల కురువంశం వినాశనమవుతుందని విదురుడు సూచించినట్లుగానే నేను ప్రభుత్వ పెద్దలకు సలహాలు సూచనలు చేయడం జరిగింది.

అయినా నా మాటలు వారు పెడచెవిన పెట్టారు.. దీనితో ఒక ప్రజా ప్రతినిధిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. సీనియర్ న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఈ కేసును ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేశారు.

కూటమి విజయంలో కీలక పాత్ర పోషించనున్న నారా లోకేష్
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన కూటమిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక పాత్ర పోషించనున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు. తనకు తగిలిన ఎదురు దెబ్బలను పునాది రాళ్లుగా మార్చుకుంటూ నాయకుడిగా నారా లోకేష్ ఎదిగారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేసిన నారా లోకేష్ తెలుగు భాష ను, తమ తెలుగు భాష ఏదో గొప్పగా ఉన్నట్లు కొంతమంది అపహాస్యం చేశారు.

పాదయాత్ర ద్వారా పరిణీతి చెందిన నాయకుడిగా నారా లోకేష్ అందరి మన్నలను పొందారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయములో కీలక పాత్ర పోషించనున్న నారా లోకేష్ అందులో అత్యద్భుత విజయాన్ని సాధించాలని, ఆయన కు నాలాగే ఎందరో అండగా ఉండనున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడైన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

LEAVE A RESPONSE