Home » కర్నాటకలో కమలవిలాపానికి కారణాలు కోటి!

కర్నాటకలో కమలవిలాపానికి కారణాలు కోటి!

-అంబానీ-అదానీలకు దేశ సంపద దోచిపెడుతున్నారన్న భావన
– దానిని తిప్పికొట్టడంలో బీజేపీ నాయకత్వం విఫలం
-అదానీ వ్యవహారంపై పార్లమెంటులో స్పందించని బీజేపీ నిర్లక్ష్యం
-ఒక్కసారి కూడా స్పందించని మోదీ తీరుపై విస్మయం
-ఇతర రాష్ట్రాల్లో మాత్రం విపక్షాల అవినీతిపై నానా యాగీ
– అవినీతి సీఎంలకు తెరచాటు మద్దతునిస్తోందన్న భావన
– జైళ్లకు వెళ్లొచ్చిన సీఎఎంలకు దన్నుగా ఉందన్న ఆగ్రహం
– ప్రత్యర్ధులపై విచారణ సంస్థలను ఉసిగొల్పుతోందన్న అసంతృప్తి
– వాజపేయి-అద్వానీలకు భిన్నంగా మోదీ-షా పాలనపై సొంత పార్టీలోనూ అసంతృప్తి
– ఇప్పటి బీజేపీని నియంత్రించడంలో ఆరెస్సెస్ విఫలమయిందన్న సొంత నేతల అసంతృప్తి
– పబ్లిక్‌వల్స్‌ను పట్టడంలో బీజేపీ బాసుల విఫలం

బీజేపీకి దక్షిణ భారతంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్నాటక రాష్ట్రం ఆ పార్టీ చేతి నుంచి జారిపోయింది. ఇది నిజంగా ఆ పార్టీకి స్వయంకృతమే. తన ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ పల్స్ ఏమిటన్న వాస్తవాన్ని గ్రహించడంలో బీజేపీ నాయకత్వం విఫలమయింది. మోదీ సర్కారు నియంతృత్వ విధానాలు సాగిస్తుందన్న భావన సగటు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.

ప్రధానంగా అంబానీ, అదానీలకు దేశ సంపద దోచిపెడుతోందన్న భావన కల్పించిన విపక్షాల ఆరోపణలకు తగిన సమాధానం ఇవ్వటంలో బీజేపీ విఫలమయింది. చివరకు మోదీ కూడా అదానీ వ్యవహారంపై పెదవి విప్పకుండా మౌనం వహించడంతో, మౌనం అంగీకారమనే భావన ఏర్పడింది. అదానీ అక్రమాలపై వచ్చిన ఆరోపణలకు పార్లమెంటులో సమాధానం చెప్పకుండా, విపక్షాలు ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల అవినీతిపై సమాధానం చెప్పాలంటూ చేస్తున్న యాగీని, ప్రజలు పట్టించుకోలేదన్న వాస్తవాన్ని, కమలదళం పరిగణనలోకి తీసుకుని ఉంటే, ఈ పరాభవం తప్పేదేమో?

తన రాజకీయ ప్రత్యర్ధులపై సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పి వేధిస్తోందన్న భావన మేధావి, ఉద్యోగ వర్గాల్లో నాటుకుపోయింది. నీతి నిజాయితీ కబుర్లు చెప్పే భాజపా, కర్నాటకలో 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతోందన్న ఆరోపణలపై దిద్దుబాటుకు దిగి ఉంటే అక్కడ ఫలితాలు మరోలా ఉండేవేమో? చివరకు సొంత పార్టీ కార్యకర్త బిల్లు ఇచ్చేందుకూ 40 శాతం కమిషన్ అడిగితే, అది భరించలేక ఆ కార్యకర్తల ఆత్మహత్య చేసుకున్న వైనం, ఆ పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసం వమ్ముచేసినట్టయింది. ఇది సొంత పార్టీ శ్రేణులకూ పార్టీపై తేలిక భావం ఏర్పడేందుకు కారణమయింది.

కర్నాటకలో విద్యావంతుల శాతం ఎక్కువే. పైగా ఈ సోషల్‌మీడియా యుగంలో ఏదీ రహస్యం కాదు. అంబానీ-అదానీలకు బీజేపీ సర్కారు దేశ సంపద దోచిపెడుతోందని, ప్రతిఫలంగా వారితో సహా, పారిశ్రామికవేత్తల నుంచి భారీ స్థాయిలో విరాళాలు సేకరిస్తోందన్న మీడియా కథనాలపై, బీజేపీ నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడాన్ని విద్యావంతులు గ్రహించకపోలేదు.

ప్రధానంగా అదానీ అక్రమాలపై.. పార్లమెంటులో అంత రగడ జరుగుతున్నా, మోదీ సహా పార్టీ ప్రముఖులంతా మౌనవ్రతం పాటించటాన్ని కర్నాటక సహా, దేశంలోని విద్యావంతులంతా.. ‘ప్రత్యేక దృష్టి’తో చూసిన విషయాన్ని, బీజేపీ నాయకత్వం గ్రహించకపోవడమే ఆశ్చర్యం. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి, పక్కా గుజరాతీ వ్యాపారిలా వ్యవహరిస్తోందన్న అసంతృప్తినీ బీజేపీ మేధావులు గ్రహించకపోవడం ఓ వింత.

కర్నాటకలో అవినీతిని ఆరెస్సెస్ కూడా ప్రోత్సహించిందన్న ప్రచారం, ఆ పార్టీని అభిమానించే సగటు ఓటరులో, బీజేపీపై అసహ్యానికి కారణమయింది. అటు పార్టీలో కూడా, వాజపేయి-అద్వానీ శకాన్ని చూసిన సంప్రదాయవాదులకు.. మోదీ-షా ద్వయం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు, సీనియర్లకు రుచించడంలేదు. జాతీయ అధ్యక్షుడికి ఎలాంటి నిర్ణయాధికారం లేదు. ఆయన ఉత్సవవిగ్రహం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అమిత్‌షాదే అంతిమ అభిప్రాయం అన్న వాస్తవం సగటు కార్యకర్తకూ తెలిసిపోయిన దుస్థితి.

పార్టీని నియంత్రించే ఆరెస్సెస్ కూడా.. మోదీ-షా ప్రభావానికి లోనయిందన్న భావన, సగటు కార్యకర్తల్లో స్థిరపడింది. అవినీతిపరులైన ముఖ్యమంత్రులు, అక్రమార్కులుగా ముద్రపడి.. జైళ్లకు వెళ్లొచ్చిన ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు, బీజేపీ తెరచాటు స్నేహహస్తం అందిస్తోందన్న భావన సగటు ప్రజల్లో బలపడింది. వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించడమే వారి అనుమానాలకు అసలు కారణంగా కనిపిస్తోంది. ఇంకా.. ఇలా కర్నాటకలో బీజేపీ ఓటమికి కారణాలు అనేకం. అవేమిటో చూద్దాం.

మత ప్రచారం, మత విద్వేష ప్రసంగాలను ప్రజలు తిప్పికొట్టారు. మోడీ వ్యక్తిగత ఆకర్షణ తగ్గింది.అమిత్ షా కుయుక్తులు ప్రజలు గమనిస్తున్నారు.మోడీ ప్రచారం చేసిన చాలా చోట్ల బీజేపీ వారు ఓడిపోయారు.

బీజేపీకి ఒక పరిపూర్ణమైన ఆర్థిక విధానం లేకపోవటం.( అసలు వారికి ఏ విధమైన ఆర్థిక విధానం లేదు) ఎదురుతిరిగిన వారి మీద వ్యవస్థల చేత దాడులు చేయించటం. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయటం.

ఆపరేషన్ లోటస్ పేరు మీద ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాలనే కొనుగోలు చేయటం. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించటంలో కీలక పాత్ర వహించటం. అదాని స్కాం గురించి పార్లమెంట్ లో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం.అన్ని ప్రభుత్వరంగ సంస్థలను తమ తాబేదార్లకు కట్టపెట్టటం.

దేశభక్తి వారి ఒక్కరి సొత్తులాగా ప్రచారం చేసుకోవటం.దేశాన్ని పరిపాలించే ప్రధాని యొక్క విద్యార్హతలను గురించి వివాదం చెలరేగినప్పుడు,ప్రధాని నోరు విప్పి తన విద్యార్హతలను ఆధారాలతో సహా నిరూపించుకోలేకపోవటం.

మోడీ గారు ఒక గుజరాత్ కే ప్రధానిగా వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో పాతుకొనిపోవటం. .2014 లో ఎన్నికల మానిఫెస్టో లో ఇచ్చిన వాగ్దానాలను 10 ఏళ్ల తర్వాత కూడా నెరవేర్చలేకపోవటం. వీలున్నప్పుడల్లా గాంధీ, నెహ్రూలను కించపరచడం.సావర్కర్ ను గొప్ప దేశ భక్తుడిగా చిత్రించడం. ఇంకా ఎన్నో? బెంగాల్ ఎన్నికల ప్రచారంలో దీదీ ఖేల్ ఖతం అని ప్రధాని స్థాయి వ్యక్తి, ఒక మహిళా ముఖ్యమంత్రిని అవమాననించిన వ్యక్తి !! ఇప్పుడు మోడీ.. నీ ఖేల్ ఖతం అనవచ్చా !!

– శారదాప్రసాద్

Leave a Reply