బకాయిల విషయంలో రైతులను బలిచేసేలా మంత్రి బొత్స వ్యాఖ్యలు

– బకాయిల కోసం ధర్నా చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టేందుకు కుట్ర
– తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎస్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని జగన్ రెడ్డి.. నేడు వారిని నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. రెండేళ్లుగా షుగర్ ఫ్యాక్టరీ.. రైతులకు బకాయిలను చెల్లించలేదు. రైతులు ఆందోళనకు దిగగా.. పోలీసులపై రాళ్లు రువ్వారంటూ వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. బకాయిల చెల్లింపుల విషయంలో అన్నదాతలను ఆదుకునేలా చర్యలు తీసుకోవడంలో జగన్ రెడ్డి నిర్లక్ష్యం వహించారు.
ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ రైతుల బకాయిలు చెల్లించేలా చూస్తామంటూనే.. మరోవైపు వారిని నేరస్థులుగా చిత్రీకరించేలా మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు. బొత్స హామీలను నమ్మే పరిస్థితుల్లో చెరకు రైతులు లేరనే విషయాన్ని గమనించాలి. తమ అసమర్థతను కప్పిపుచ్చు కునేందుకే టీడీపీ బురజ జల్లుతున్నారు. ఎన్సీఎస్ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తక్షణమే రైతులకు బకాయిలు రూ.16.33 కోట్లు చెల్లించాలి.
రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. తమకు రావాల్సిన బకాయిలు అడిగితే దాష్టీకానికి పాల్పడటమే కాకుండా అక్రమ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలనుకోవడం అమానుషం. షుగర్ ఫ్యాక్టరీలను అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు మాట తప్పారు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక చర్యలను రాష్ట్ర ప్రజానీకం గమనిస్తోందనే విషయాన్ని గ్రహించాలి.

Leave a Reply