– ఒకటవ తేదీనే ఏపీ మంత్రులకు జీతాలు
– ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రం 15, 20వ తేదీకి దిక్కులేదు
– ఉద్యోగుల జీతాలు, సమస్యలకు ఇంకా కరోనానే కారణమట
– మంత్రుల జీతాలకు మాత్రం కరోనా అడ్డం కాదట
– అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఫస్ట్‌నే జీతం తీసుకున్న మంత్రులు
– ఫస్ట్‌నే పువ్వుల్లో పెట్టి మంత్రులకు ఇస్తున్న సర్కారు
– పీసీసీ నేత సుంకర పద్మశ్రీ ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగుచూసిన వాస్తవం
– ఉద్యోగులతో పాటే మంత్రులకు జీతాలివ్వవచ్చు కదా?
– ఉద్యోగులు చేసిన పాపం, మంత్రులు చేసిన పుణ్యమేమిటి?
– మంత్రుల పాటి విలువ ఉద్యోగులకు లేదా?
– ఉద్యోగులంటే సర్కారుకు ఇంత వివక్షనా?
– ఉడుకుతున్న ఏపీ ఉద్యోగులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
న్యాయం చెప్పే స్థానంలో ఉన్న వాళ్లు దానిని ముందు తన ఇంటి నుంచి ప్రారంభించాలన్నది, ‘పెదరాయుడు’ సినిమాలో మోహన్‌బాబు డైలాగ్. నిజంగా కూడా అంతే కదా? ధర్మం-న్యాయం గురించి మాట్లాడేవారు.. మొదట దానిని తన ఇంటి నుంచి అమలుచేయాలి. అదే న్యాయం కూడా!
కానీ ఏపీ సర్కారు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తమ ఏలుబడిలో పనిచేసే ఉద్యోగులకు, 20 వ తేదీ తర్వాత కూడా జీతాలిస్తున్న ఏపీ సర్కారు.. తన మంత్రులకు మాత్రం, ఠంచనుగా పొల్లుపోకుండా ఒకటవ తేదీనే జీతాలను పువ్వుల్లో పెట్టి ఇస్తున్న దొడ్డమనసు బట్టబయలయింది.
కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు- డీఏలు- ఇంకా అనేక సమస్యలు తీర్చలేకపోతున్నామని.. ఏపీ సర్కారు అరిచే బీద అరుపులు ఇప్పటివరకూ నిజమే కామోసని, ఆంధ్రా ప్రజలు నమ్ముతూ వచ్చారు. అందుకే ఉద్యోగులు-పెన్షనర్లకు ఒకటవ తేదీన సకాలంలో జీతాలివ్వడం లేదని భ్రమించారు. ఖజానాలో కాసులు లేకపోతే పాపం జగనన్న మాత్రం ఏం చేస్తారని అనుకున్నారు.
అయితే.. అవన్నీ ఉత్తిదేనని, కరోనా కరవు ఉద్యోగులకే తప్ప, మంత్రులకు లేనేలేదని స్వయంగా ప్రభుత్వమే ఇచ్చిన ఓ వివరణ బట్టబయలు చేసింది. ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీకి.. ప్రభుత్వ సహాయ కార్యదర్శి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ హోదాలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో.. ‘కరోనా కాలంలోనూ’ మంత్రుల వైభోగం వెలుగుచూసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష, సచివుల పట్ల చూపిస్తున్న ఆపేక్షపై ఉద్యోగులు ఉడికిపోతున్నారు.
ఏపీ మంత్రులకు ఏ తేదీలో జీతాలు చెల్లిస్తున్నారంటూ.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు ఆమె ఫిబ్రవరి 2న ఆర్టీఐ చట్టం కింద, సాధారణ పరిపాల శాఖకు దరఖాస్తు చేశారు. దానికి స్పందించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హోదా ఉన్న ప్రభుత్వ సహాయ కార్యదర్శి , మార్చి 1న సుంకర పద్మశ్రీకి లిఖిత పూర్వక సమాధానం పంపించారు.
ఆ ప్రకారం.. ఏపీ మంత్రులందరికీ ప్రతి నెల ఠంచనుగా ఒకటవ తేదీనే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకూ ఒకటవ తేదీనే మంత్రులకు జీతాలు చెల్లించామన్నది, అధికారి ఇచ్చిన లేఖ సారాంశం.
ప్రభుత్వ అధికారి ఇచ్చిన లిఖిత పూర్వక వివరణను, సుంకర పద్మశ్రీ మీడియాముఖంగా వెల్లడించడంతో జీతాల జగడం మొదలయింది. ఓ వైపు తమకు న్యాయబద్ధంగా రావలసిన డీఏలు, అరియర్సుతోపాటు.. ఒకటవ తేదీన జీతాలు-పెన్షన్ల కోసం తామంతా ఆందోళన చేస్తుంటే.. దర్జాగా ఏసీ కార్లు- ఏసీ చాంబర్లలో తిరుగుతూ, ఠంచనుగా ఒకవవ తేదీన జీతాలు తీసుకుంటున్న మంత్రులకు ఉన్న ప్రత్యేకత ఏమిటని ఉద్యోగులు విరుచుకుపడుతున్నారు.
కరోనా కష్టాలు-ఆర్ధిక నష్టాలు మంత్రులకు వర్తించవా అని నిలదీస్తున్నారు. ‘‘ఈ ప్రభుత్వం ఉన్నంతవరకూ కరోనా కష్టాలుంటాయని’’ ఓ ఉద్యోగ నేత తాజా చర్చల్లో చేసిన వ్యాఖ్య అబద్ధమేనని, తాజా ఆర్టీఐ లేఖతో రుజువయిందంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమకు ఒకటవ తేదీన జీతాలు-పెన్షన్లు ఇచ్చేందుకు సినిమా కష్టాలు చెబుతున్న సర్కారు.. అదే సినిమా కష్టాలు సచివులకు ఎందుకు వర్తింపచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
తాము దాచుకున్న డబ్బులు, తమ బడ్జెట్‌ను తమకు ఇచ్చేందుకు ఏదో త్యాగాలు చేసినట్లు బిల్డప్ ఇస్తున్న ప్రభుత్వం.. మరి మంత్రులకు సైతం, తమతోపాటే 10, 15, 20 తేదీల్లోనే జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక కష్టాల్లో ఉన్నందున, జీతాల ఆలస్యానికి కారణాలు అర్ధం చేసుకోవాలని బీద అరుపులు అరుస్తున్న మంత్రులు.. మరి తామెందుకు ఒకటవ తేదీన జీతాలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కదిపిన జీతాల తేనెతుట్టె, ఉద్యోగులను మానసికంగా కుట్టేస్తోంది. తమకు 20వ తేదీ వరకూ జీతాలిస్తున్న సర్కారు.. తన మంత్రులకు మాత్రం ఠంచనుగా ఒకటవ తేదీనే జీతాలందుకోవడాన్ని, ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్’ అని అందమైన పదాలు వాడుతున్న సలహాదారులు, ఈ పక్షపాతానికి సమాధానం చెప్పాలన్నది ఉద్యోగులు సంధిస్తున్న ప్రశ్నాస్త్రం!