గిరిజన ప్రాంతాల్లో మీ డాక్టర్ -మీ ఇంటికి సంచార వైద్యశాల ప్రాజెక్ట్ ఏప్రిల్ లో ప్రారంభం
– ఏపీ రెడ్ క్రాస్ జనరల్ సెక్రటరీ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.కె.పరిదా
విజయవాడ: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ), AP స్టేట్ బ్రాంచ్ మరియు REC ఫౌండేషన్ సంయుక్తంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు పాడేరు, పల్నాడు, తిరుపతి మరియు నంద్యాల తదితర 7 జిల్లాలలో నివసించే నిరు పేద గిరిజనుల కోసం “మీ డాక్టర్ మీ ఇంటికి” అనే ఒక వినూత్న మొబైల్ మెడికల్ యూనిట్ ను పేద గిరిజనుల కోసం ఏప్రిల్ లో ప్రారంభించనున్నామని ఏపీ రెడ్ క్రాస్ జనరల్ సెక్రటరీ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.కె.పరిదా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మీ డాక్టర్ -మీ ఇంటికి మొబైల్ మెడికల్ ప్రాజెక్ట్ రాష్ట్ర విభజన తర్వాత ఎపి రెడ్ క్రాస్ యొక్క అతిపెద్ద CSR ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం రూ.8.40 కోట్లతో రూపొందిందని, ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్, 2025 నుండి మూడు సంవత్సరాల వ్యవధిలో అమలు చేయబడుతుంది. మొత్తం ఖర్చు REC ఫౌండేషన్ ద్వారా అందించబడుతుంది అని ఎ.కె.పరిదా తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఒక వైద్యుని నేతృత్వంలో స్టాఫ్ నర్సు మరియు ఫార్మసిస్ట్‌తో కూడిన బృందం REC ఫౌండేషన్ అందించిన వాహనాల్లో పేద లబ్దిదారుల కుటుంబాల ఇంటి వద్దకు వెళ్లి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీతో సహా ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది అని ఆయన తెలిపారు.
శిశు మరణాల రేటు , ప్రసూతి మరణాల రేటు తగ్గించడానికి, మొత్తం మరణాల రేటును తగ్గించడానికి, అంటువ్యాధుల వ్యాప్తి తగ్గించడానికి మరియు 100% వ్యాది నిరోధక టీకాలు మరియు వైద్య సౌకర్యం అందుబాటులో లేని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ను రూపొందించామన్నారు. 30% మొబైల్ మెడికల్ యూనిట్లు కేవలం మహిళలు మరియు వృద్ధులకు వైద్య సాయం అందించడానికి కేటాయించబడ్డాయన్నారు. డ్రైవర్ మినహా మిగిలిన సిబ్బంది అంతా మహిళా సిబ్బందితో ఈ ప్రాజెక్ట్ నిర్వహించబడుతుంది అని ఫరీదా తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయడానికి ఎ.కె.పరిదా విజయవాడలోని ఆర్‌ఇసి చీఫ్ ప్రోగ్రామ్ మేనేజర్ సంజయ్ కుమార్ రాయ్ బుధవారం ఒప్పంద పత్రం పై సంతకం చేశారు.