CWC సమావేశంలో జరిగేదేమిటి ?
( ఎస్‌కె జకీర్- ఎడిటర్, బంకర్‌న్యూస్)
ఆదివారం సాయంత్రం ఢిల్లీలో సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంపై ఆ పార్టీలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
జాతీయ రాజకీయ చిత్రపటంలో నరేంద్ర మోదీ సుస్థిర స్థానాన్నిమళ్ళీ సంపాదించుకున్నారు.ఈ సంతోషాన్ని ఆయన గుజరాత్ ప్రజలతో పంచుకున్నారు. శుక్ర, శనివారాల్లో మోడీ అక్కడ పర్యటించారు.
తన తల్లికి పాదాభివందనం చేశారు.నరేంద్రమోడీకి దీటుగా కాంగ్రెస్ లో సమర్ధ నాయకత్వం లేకపోవడం ఒక శూన్యాన్ని సూచిస్తున్నది. దేశంలో అత్యధిక ప్రజాకర్షణ ఉన్న నాయకుడు మోడీ అన్నది నిర్వివాదాంశం.ఆయనకు సమఉజ్జీగా ‘గాంధీ’ వారసులెవరూ కనిపించడం లేదు.
ఉత్తరాఖండ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చినా బీజేపీకే ప్రజలు పట్టం గట్టారు. అలాగే ప్రతి ఐదేళ్లకూ ఒకసారి ప్రభుత్వం మారిపోయే సంప్రదాయాన్నికూడా ఉత్తరప్రదేశ్ లో మార్చిపారేశారు.బీజేపీకి ఉన్న ఏకైక అతిపెద్ద ‘పాజిటివ్ పాయింటు’ మోదీ మాత్రమే.ఆయన తర్వాతే అమిత్ షా అయినా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయినా.మోడీ,అమిత్ షా ద్వయం రచించే వ్యూహాలను చిత్తు చేయగల పరిస్థితిలో కాంగ్రెస్ లేదు.అధికారంలోకి ఎలా రావాలో,వచ్చిన అధికారాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలో, మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువ సీట్లు సాధించినా మాయోపాయాలు,హార్స్ ట్రేడింగ్ తో అధికారాన్ని ఎట్లా వశపరచుకోవాలో మోడీ బాగా వంటబట్టించుకున్నారు.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి అరవింద్ కేజ్రీవాల్‌కు ఉన్న ప్రజాదరణ కూడ సహకరించింది. పంజాబ్‌లో కేజ్రీవాల్‌కూ ఒక అవకాశం ఇవ్వండి అనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేసింది.ఢిల్లీ నమూనా పరిపాలనను అందిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉధృతంగా ప్రచారం చేశారు. భగవంత్ సింగ్ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ‘ఆప్’ ప్రకటించింది.
కాంగ్రెస్ లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత ఆ స్థాయి ప్రజాకర్షణ కలిగిన వారు ఎదగకపోవడం చారిత్రిక సత్యం.అలాంటి నాయకుడిగా ఎదుగుతారని రాహుల్ గాంధీ గురించి చేసిన అంచనాలు తలకిందులయినవి.
కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని బీజేపీ 2014 నుంచి సంధించిన ఒక నినాదం బలంగా దూసుకువెడుతున్నది. మోదీ మాటలు నేరుగా ప్రజలకు ‘కనెక్టు’ అవుతాయి.ప్రజల్ని ఆకట్టుకునే కళ ఆయన సొంతం. వాక్ చాతుర్యంలో ఆయన దిట్ట.నాయకత్వ పటిమలో,పరిస్థితికి తగినట్టు వ్యూహాలను రచించడంలో మోడీ నిష్ణాతుడు.
కాగా పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించడం, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌ను పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా నియమించడం రెండూ రాహుల్ గాంధీ నిర్ణయాలే.ఈ వ్యూహం ఫలించలేదు.ప్రజా క్షేత్రంలో మోదీ ముద్ర బలంగా ఉన్నది.నరేంద్ర మోదీ ఈ వయసులో కూడా 16 గంటలకు పైగా పనిచేస్తున్నారు. పార్టీ గురించి,రాజకీయాల గురించి ఆయన నిరంతరం ఆలోచిస్తుంటారు.
కాంగ్రెస్ పార్టీలోని పాతతరం నాయకుల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది.గులాం నబీ ఆజాద్,కపిల్ సిబల్,ఆనంద్ శర్మ,మనీష్ తివారి వంటి వారంతా ‘జీ 23’ గా ఏర్పడ్డారు.పార్టీ నాయకత్వంలో మార్పు కోరుతున్నారు. యువతరానికి,పాత తరానికి మధ్య పూడ్చలేని అంతరం ఏర్పడింది.కాంగ్రెస్ పార్టీలో వేగంగా నిర్ణయాలు తీసుకోకుండా నాన్చడానికి ప్రధాన కారణం ఆ పార్టీలో ఉన్న పాతతరం నాయకత్వం.
మారుతున్న సామాజిక,రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆ పార్టీ విఫలమవుతున్నది. ఇప్పటికీ ‘కోటరీ’ సంస్కృతి కొనసాగుతున్నది. సలహాదారులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులుగా పనిచేస్తున్న నాయకులు రాహుల్ గాంధీ భజన బృందంగా ఏర్పడ్డారు.ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా,రాహుల్ గాంధీ విధేయునిగా చెలామణి అవుతున్న కేసి.వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు మణికం ఠాగూర్ తదితరులంతా ఈ ‘కోటరీ’లోనే ఉన్నారు.సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ మరణానంతరం ఆ లోటు అలాగే ఉందన్న విశ్లేషణలున్నవి.
దేశాన్ని కొత్తగా మార్చేస్తామని 2013 లో రాహుల్ గాంధీ గంభీరంగా అన్నారు.దేశం సంగతేమో గానీ పార్టీలో కూడా ఆయన ఏమాత్రం మార్పు తీసుకురాలేకపోయారన్నా విమర్శలున్నవి.కాంగ్రెస్ లో సంస్థాగతంగా అనేక మార్పులు తీసుకురావాలన్న డిమాండు చాలాకాలంగా ఉన్నది.ఆ దిశగా అడుగులు పడడం లేదు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని,నియామకాల్లో పారదర్శకత ఉండాలని, పార్టీ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ భావించినా అవి నెరవేరలేదు.
కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పుల కోసం 2019లోనే ‘జీ 23’ గా పిలిచే కాంగ్రెస్ నాయకుల బృందం డిమాండ్ చేసింది. గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, రాజ్‌బబ్బర్, శశిథరూర్ వంటి వాళ్లు ఈ బృందంలో ఉన్నారు.రాహుల్ గాంధీ సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియా, ఆర్పీఎన్ సింగ్ లాంటి యువ నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీల్లో చేరారు.సింధియా బీజేపీలో చేరి కేంద్రమంత్రి పదవిని చేబట్టారు.రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సంఘర్షణ కొనసాగుతూనే ఉన్నది.
ఒక అధ్యయనం ప్రకారం కొత్తతరం ఓటర్లలో 50 శాతం మంది మోదీని, బీజేపీని ఇష్టపడుతున్నారు.రాహుల్ గాంధీని, కాంగ్రెస్ ను ఇష్టపడుతున్న వారు 20 శాతం కూడా లేరు.కొత్తతరం ఓటర్లను,యువతను ఆకట్టుకునే పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవలసి ఉన్నది.దానికి తగినట్టు కార్యాచరణ ప్రణాళిక లేదు.సీపీఐ,సీపీఎం అత్యధికంగా 2004 లో లోక్‌సభ సీట్లు లభించాయి. సీపీఎం 43 స్థానాల్లోనూ,సీపీఐ 10 స్థానాల్లోనూ గెలుపొందాయి. కేరళలో మాత్రమే లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది.
55 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ కూడా క్రమంగా ‘కామ్రేడ్ల’ వలె మారిపోతుందేమోనన్న భయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్నది.1984 లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 404 లోక్ సభ స్థానాలను గెలిచింది.2014లో 44 లోక్‌సభ స్థానాలను,2019 లో 52 స్థానాలను గెలుచుకోవడం విషాదకర ఘట్టం.లెఫ్ట్ పార్టీల్లాగే కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం తగ్గిపోతుందని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అలక్ష్యం వల్ల,లేదా అహంకారం వల్ల దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయపార్టీలు అవతరించినవి. కాంగ్రెస్ తో విభేదించిన తర్వాతే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్,శరద్ పవార్ ఎన్సీపీ పార్టీలను స్థాపించాయి.కర్ణాటకలో సెక్యులర్ జనతాదళ్, తమిళనాడులో ఏఐడీఎంకే,డీఎంకే, తెలంగాణలో టిఆర్ఎస్,ఎపిలో వైసీపీ,ఢిల్లీలో ఆమ్ ఆద్మీ తదితర పార్టీలన్నీ ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్,బీజేపీల కన్నా బలంగా ఉన్నవి.
రాష్ట్రాల్లో ఉన్న నాయకత్వం పట్ల,అవినీతి ,స్వార్థంతో పనిచేసే నాయకుల పట్ల వ్యతిరేకత ఉందని, నెహ్రూ-గాంధీ కుటుంబం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు డీకే.శివకుమార్ అంటున్నారు.పైగా ‘జీ 23’ నాయకుల డిమాండ్లను తోసిపుచ్చారు. సోనియా,రాహుల్ చేతుల్లో నుంచి నాయకత్వం మారితే మొదటికే మోసం జరుగుతుందని ఆయన చెబుతున్నారు.
కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది వ్యక్తిగతంగా బలపడ్డారని, పార్టీని బలోపేతం చేయడానికి మాత్రం వారు కృషి చేయడం లేదని కూడా శివకుమార్ అంటున్నారు. ఆయన కామెంట్స్ అక్షరాలా నిజం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పట్టిన దుస్థితి కనిపిస్తూనే ఉన్నది.తెలంగాణలో రేవంత్ రెడ్డి సారధ్యంలో అంతో,ఇంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నవి.టిఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి సమరోత్సాహంతో ఉన్నవి.