మంత్రులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

-కోర్టు తీర్పు విశాఖ రాణి గారి భూములకే వర్తిస్తుందా? అమరావతి విషయంలో వర్తించదా?
-విశాఖలోని ప్రభుత్వ, ప్రైవేటు భూములను లుంగీ బ్యాచ్ దారుణంగా దోచుకున్నారు
-పరదాలు ఏర్పాటు చేసే దానికి బదులు, ముఖ్యమంత్రి స్వయంగా బురఖా ధరిస్తే మంచిది కదా?
-ప్రభాస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అండదండలు అవసరమా?
-రఘురామకృష్ణంరాజులోని, కృష్ణంరాజు ఉందని ఆహ్వానించ లేదా
-కృష్ణంరాజు మృతిచెందితే జగన్ వెళ్లలేదేం?
-ప్రభాస్ కుటుంబం కొనుగోలు చేసి స్మృతి వనాన్ని అభివృద్ధి చేసుకోలేదా?
-రోజా అందజేసిన చెక్కు ప్రాడని అనుకోవాలా?
-సిట్ నివేదిక తారుమారయ్యే ప్రమాదం
-గాలి-జగన్ కేసులకు పెద్దగా తేడాలేదు
– నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

మంత్రులైన వాళ్ళ బాబు లైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే ప్రజలు హర్షించరని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు సుతి మెత్తగా హెచ్చరించారు. అమరావతి మహిళా రైతులు కాళ్లు కందిపోయి పాదయాత్ర చేస్తుంటే, ఒళ్ళు బలిసి… అచ్చోసిన ఆంబోతుల మాదిరిగా కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాళ్లు కందిపోయిన మహిళా రైతులకు మంత్రుల సానుభూతి అక్కరలేదని… ఒళ్ళు బలిసి మాట్లాడడం మానేయాలన్నారు.

కొంతమంది మంత్రులు పశువుల్లా మాట్లాడుతున్నారన్న ఆయన… పశువులు కూడా వీళ్ళ భాషను చూసి అసహ్యించుకుంటున్నాయని విరుచుకుపడ్డారు. ఆస్తులు కోల్పోయి, కుటుంబ సభ్యులను కోల్పోయి, ప్రభుత్వం చేతిలో మోసపోయి, గత మూడున్నర ఏళ్లుగా న్యాయం కోసం దీక్షలు చేస్తూ పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నారన్నారు. తమ జీవనాధారాన్ని కోల్పోయిన అమరావతి రైతులు తమ బాధలను ప్రభుత్వం పట్టించుకోకపోతే … ప్రజలకైన తమ గోడును చెప్పుకుందామని కాలినడకన బయలుదేరిన మహిళా రైతుల బొబ్బలెక్కిన పాదాలను స్పృశించి క్షమాపణలు కోరిన , ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న మంత్రుల పాపానికి పరిహారం లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ప్రజా జీవితంలో ఉన్న మంత్రులు, ప్రజలకు దూరం కావద్దంటే, వారి వారి పరిధిలో ఉండి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. కొంతమంది తమను కాళ్లు విరగొడతామని బెదిరిస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివా రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందేనని, అమరావతి రైతుల కాళ్లు విరగ్గొడతామంటే ప్రజలు ఊరుకోరని రఘురామకృష్ణం రాజు అన్నారు.

శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక పేరిట మూడు రాజధానులు కావాలని, లేకపోతే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ ఊరు పేరు లేని పాల్, సత్యనారాయణ ల పేరిట ప్రజల సొమ్మును అడ్వర్టైజ్మెంట్ రూపంలో దండుకుంటున్న సాక్షి దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ వార్తను సాక్షి దినపత్రికలో మొదటి పేజీలో ప్రచురించారంటేనే వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక వెనుక ఎవరున్నారో ఇట్టే అర్థమవుతుందని అన్నారు. ఈ ప్రకటన వెనుక ఉన్న కుట్ర ను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చునని అన్నారు.

సత్తిబాబు మాటల వల్ల కొంతమేలే…
జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ మాటల వల్ల ఒక్కొక్కసారి మేలే జరుగుతుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఋషికొండపై ముఖ్యమంత్రి నివాస భవనాన్ని, కార్యాలయాన్ని నిర్మించుకోవద్దా? అని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, ఋషికొండకు గుండు కొట్టి ముఖ్యమంత్రి నివాస సముదాయము, కార్యాలయ భవనాలను నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు.. ఇంటర్ లో కాలేజీకి స్కూటర్ పై, డిగ్రీలో కారులో వెళ్ళిన బొత్స సత్యనారాయణ, ఋషికొండ పై నిర్మిస్తున్న భవనాల గురించి సూటిగానే చెప్పారన్నారు. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన దానికంటే, పది రెట్లు పెద్ద సైజు భవనాలనే ఋషికొండపై నిర్మిస్తున్నారని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, ఈ నిర్మాణాలు సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. సముద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడి పెద్ద పెద్ద భవనాలను నిర్మించడం దారుణమని మండిపడ్డారు.

ప్రజల సంపూర్ణ మద్దతు అమరావతి రైతులకే…
అమరావతి రైతులకే రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్దతు ఉన్నదని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన అమరావతి రైతుల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పారు. వికేంద్రీకరణకు మద్దతుగా తాము పాదయాత్రలు చేయలేమా? అని ప్రశ్నించిన మంత్రులు, ఒక్క సభ పెడితే… అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. తిరుపతిలో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సభను ఏర్పాటు చేస్తే వందమంది కూడా హాజరు కాలేదని గుర్తు చేశారు. వచ్చిన వారు కూడా సభ మధ్యలోనే వెళ్లిపోయారని పేర్కొన్నారు.

రోజువారీ కోర్టు విచారణ హాజరు కావాల్సిందే
గాలి జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులకు పెద్ద తేడా లేదన్న రఘురామకృష్ణం రాజు, ట్రాయల్స్ ప్రారంభమైతే చచ్చినట్టు కోర్టుకు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్స్ స్టార్ట్ కాకపోతే ఒకే నని వ్యాఖ్యానించారు. ట్రాయల్స్ స్టార్ట్ అయితే మాత్రం, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ కూడా పనిచేయదన్నారు. ప్రజలను రాచిరంపాన పెట్టి, కష్టాలు పెడితే… భగవంతుడు ఉన్నాడని అన్ని చూసుకుంటాడని రఘురామకృష్ణం రాజు అన్నారు. దసరా సెలవులు అనంతరం కోర్టు ప్రారంభమైన తర్వాత ఏమి జరుగుతుందో వేచి చూద్దామని చెప్పారు.

సిట్ నివేదికను బహిర్గతం చేయాలి
విశాఖ భూకుంభకోణంపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాయితీపరులైన అధికారులు డాక్టర్ విజయ్ కుమార్, అనురాధ, ఇతర సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటు చేశారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. అయితే సిట్ బృందం ఎప్పుడో తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిందని, అయితే ఇప్పటివరకు ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనీ బయటపెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే డాక్టర్ విజయ్ కుమార్, అనురాధ, ఇతర సభ్యులతో కూడిన సిట్ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన నివేదికను బహిర్గతం చేయాలన్నారు.

విశాఖలోని కబ్జా గురైన ప్రభుత్వ భూములు వివరాలను పొందుపరుస్తూ, వాటిని తిరిగి ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకోవాలన్న విషయాన్ని కూలంకషంగా వివరిస్తూ సిట్ బృందం తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసిందన్నారు. అయితే ప్రభుత్వ గద్దలు ఆ నివేదికను బయట పెట్టకుండా తొక్కి పెట్టారని విమర్శించారు. నిన్న , మొన్నటి వరకు విశాఖలో ఉన్న పాలెగాడు ప్రభుత్వ భూములను కబ్జా చేసి, తమ ఆధీనంలో ఉంచుకున్న వారిని బెదిరించి తన పేరిట రాయించుకున్నట్లు తెలిసిందన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై కేసులు ఉండవని చెప్పి, వారు కబ్జా చేసినందుకు అయిన ఖర్చులు చెల్లించి, భూములను తమ పేరిట బదిలీ చేయించుకున్నారని రఘురామ అన్నారు.

వేలకోట్ల రూపాయల విలువ చేసే, వేల ఎకరాల భూములను కొల్లగొట్టారన్న ఆయన, అందుకే విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. డాక్టర్ విజయ్ కుమార్, అనురాధ నేతృత్వంలోని సిట్ నివేదికను బయటపెట్టాలని విశాఖవాసులు డిమాండ్ చేయడంతో పాటు, పదవీ విరమణ పొందిన నిజాయితీపరులైన ఆ ఇద్దరు అధికారుల చేతనే సిట్ నివేదిక వివరాలను వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. లేకపోతే సిట్ నివేదిక తారుమారయ్యే ప్రమాదం ఉందని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖ లో రాణి గారి ఆస్తి 16 ఎకరాల భూమిని, అయితే గతంలో ఆమెతో ఒప్పందం చేసుకున్న వారికి కాకుండా, ఇతరులకు ఆ భూమి దక్కడం పరిశీలిస్తే, దీని వెనుకనున్న మతలబు ఏమిటో ఇట్టే అర్థమవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 22 ఏ ఎత్తివేయకుండా కొనసాగించడం ద్వారా, రాణి గారి భూములను పరిరక్షించేందుకు కృషి చేశారన్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాణి గారితో తొలుత ఒప్పందాన్ని కుదుర్చుకున్న వ్యక్తులను బెదిరించి, బలవంతంగా కొంతమంది వ్యక్తులు డీల్ కుదుర్చుకున్నారని చెప్పారు. డీల్ కుదుర్చుకున్న వారికి డెబ్బై శాతం, రాణి గారితో ఒప్పందాన్ని కుదుర్చుకున్న వారికి 30 శాతమని వాటాలు పంచుకొని రాణి గారి భూములను కొట్టేసే ప్రయత్నాలను చేస్తున్నారన్నారు.

ఇక ఎప్పుడు కోర్టు తీర్పులను గౌరవించే వారి మాదిరిగా ఇప్పుడు, కోర్టు తీర్పు మేరకు 22a ను ఎత్తివేయాలని కోరుతూ కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు . కోర్టు తీర్పు విశాఖ రాణి గారి భూములకే వర్తిస్తుందా?అమరావతి విషయములో వర్తించదా?? అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. భూ కేటాయింపులలో ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. విశాఖలోని ప్రభుత్వ, ప్రైవేటు భూములను లుంగీ బ్యాచ్ దారుణంగా దోచుకున్నారన్నారు. విశాఖలో అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా కొద్దిమంది గొడవలు సృష్టించాలని చూసినా, అమరావతి రైతుల పాదయాత్రకు మాత్రం విశాఖ వాసుల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తమ పార్టీ కార్యకర్త మాదిరిగా తయారయ్యారని విమర్శించారు. ఇక నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీరు మరీ అధ్వానమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిందాబాద్… వైసిపి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసి, ఆయన సంతకాలను పెడుతుంటే పక్కనే ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు విస్తు పోయారన్నారు.

రోడ్డు వేయరు… వేసుకుంటే కేసులా?
రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్లను పునరుద్ధరించారని, ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్లను పునర్నిర్మించుకుంటే కేసులు పెడతారా? అంటూ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. వినాయక చవితి సందర్భంగా వేలం పాట లో లడ్డు ను విక్రయించి, వచ్చిన సొమ్ముతో గ్రామ ప్రధాన రహదారి గోతులను పూడ్చుకున్న తాడినాడ గ్రామస్తుడైన బాబుపై ఐపీసీ 427 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం రోడ్లు వేయదు… వేసుకుంటే కేసులు పెడుతుందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

ఎమ్మెల్యేలకు, ఎంపీలకు గౌరవం ఇవ్వండి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సముచిత గౌరవం ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. వారేమి మీ కట్టు బానిసలు కాదని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోతే వారు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల్లో ఉంటూ గెలిచిన వారిని, తన బొమ్మ పెట్టుకుని గెలిచారని అంటారని… ప్రజల్లోకి మాత్రం ముఖ్యమంత్రి ఎందుకని వెళ్ళారంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రోడ్డు పైకి రావాలంటే భారీ కేడ్లు , పరదాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి అయిందని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రోడ్డుపైకి వచ్చినప్పుడు పరదాలు ఏర్పాటు చేసే దానికి బదులు, ముఖ్యమంత్రి స్వయంగా బురఖా ధరిస్తే మంచిది కదా అంటూ రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి సామాజిక వర్గ వ్యక్తి తనకు ఫోన్ చేసి సలహా ఇచ్చారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. తమ పార్టీలో ముసలం పుట్టినట్టుగా పలువురు నాయకులు చర్చించుకుంటున్నారన్న రఘురామ, ఎమ్మెల్యేలను పనికిమాలిన సన్నాసుల మాదిరిగా ట్రీట్ చేస్తే వారు తిరుగుబాటు చేయక ఏం చేస్తారని ప్రశ్నించారు. కుప్పంలో ఇటీవల ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బటన్ నొక్కి ప్రజలకు నిధులు అందజేసినట్లు చెప్పారని గుర్తు చేశారు. కానీ మంత్రి రోజా సెల్వమణి లబ్ధిదారులకు చెక్ అందజేయడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే ముఖ్యమంత్రి బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా నిధులు విడుదల కాలేదని భావించాలా?, లేకపోతే రోజా సెల్వమణి అందజేసిన చెక్కు ప్రాడని అనుకోవాలా అంటూ రఘురామకృష్ణం రాజు సందేహాన్ని వ్యక్తం చేశారు.

కృష్ణంరాజు కుటుంబానికి అండదండలా?… ఇదెక్కడి విడ్డూరం?
సినీ నటుడు దివంగత కృష్ణంరాజు కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటానని చెప్పమన్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా.ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. సినీ నటుడు కృష్ణంరాజు, హీరో ప్రభాస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అండదండలు అవసరమా? అంటూ ప్రశ్నించారు. కృష్ణంరాజు మరణిస్తే ఆయన పార్దివ దేహాన్ని చివరి చూపు కూడా చూడడానికివెళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రేమ ఒలకబోయడం వెనక, రాజుల ఓట్లు గంపగుత్తగా వస్తాయన్న రాజకీయ ఎత్తుగడే కారణమై ఉంటుందని అన్నారు.

ఇటీవల విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన విషయం తెలిసిందే నని అన్నారు. బిజెపి లో కొనసాగుతున్న కృష్ణంరాజును, ఆ కార్యక్రమానికి ఎందుకని ఆహ్వానించలేదని ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజులోని, కృష్ణంరాజు ఉందని ఆహ్వానించ లేదా అంటూ మండిపడ్డారు. కృష్ణంరాజు సంస్మరణ సభ సందర్భంగా 60 వేలమంది ప్రజలు హాజరైతే, వారికి వివిధ రకాల మాంసాహార వంటకాల తో భోజనాలు వడ్డించారని పేర్కొన్న ఆయన, ఆ వంటకాలకే ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చయి ఉంటుందన్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం సముద్రపు ఒడ్డున రెండు ఎకరాల్లో కృష్ణంరాజు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిందన్నారు. సముద్రపు ఒడ్డున 10 లక్షల రూపాయల విలువ కూడా చేయని రెండు ఎకరాల భూమిని, భోజనాల కోసమే ఆరేడు కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రభాస్ కుటుంబం కొనుగోలు చేసి స్మృతి వనాన్ని అభివృద్ధి చేసుకోలేదా అంటూ ప్రశ్నించారు.

Leave a Reply