– చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తాడా?
– నేను ఆడవారి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇస్తే జగన్ రెడ్డి ఓటీఎస్ తెచ్చాడు
– టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు
– టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
-హాజరైన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
-మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలకు సన్మానం
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళా రక్షణను గాలికొదిలేసిన ఈ ముఖ్యమంత్రికి మహిళా దినోత్సవం జరుపుకునే హక్కులేదని, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తాడా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….తెలుగు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకు గుర్తింపు లేదు కాబట్టి, మహిళలను గౌరవించాలి కాబట్టి ఒక ఉద్యమ స్పూర్తితో ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం. రాజకీయాల్లో మహిళలకు మొదటిసారి గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మన పార్టీ జెండా పసుపు. పసుపు శుభానికి సంకేతం. శుభప్రదమైన కార్యక్రమం మొదలు పెట్టేముందు ప్రతి మహిళా పసుపు వాడుతుంది.
ఆడ, మగ సమానమే అని మహిళలకు ఆస్తిలో సమానహక్కు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. ఆయన తెచ్చిన సంస్కరణలే నేడు దేశమంతా అమలు చేస్తున్నారు. ఆడపిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో తిరుపతిలో మహిళా విశ్వ విద్యాలయం స్థాపించారు. మహిళల విద్యోన్నతికి దోహదం చేశారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు మహిళలు పెద్దగా ఇంటి నుంచి బయటకు వచ్చిందే లేదు.
మనం వచ్చాకే స్థానిక సంస్థల్లో 8 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం. చట్టసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చేవరకూ పోరాడతాం. మహిళల ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాం. ప్రతి ఇంటికీ ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే. ఇంటిలో తాళం మీ దగ్గరే ఉంటుందికదా. ఇంటికి చక్కదిద్దే మహిళలకు దేన్నయినా చక్కదిద్దే శక్తి ఉంది. ఆ ఆలోచనతోనే డ్వాక్రా స్థాపించాను. డ్వాక్రా ఏర్పాటుపై చాలామంది వెటకారంగా నవ్వారు. డ్వాక్రా స్థాపనతో 90 లక్షలమంది మహిళలు ఒక గొడుగు కిందకు వచ్చారు. పొదుపు ఉద్యమం పెరిగి సంచలనమైంది. డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారు.
బిల్ క్లింటన్ మన దేశం వస్తే డ్వాక్రా మహిళలను ఆయన పక్కన కూర్చోబెట్టాం. డ్వాక్రా సంఘాలను వేరే రాష్ట్రాలే కాదు ఇతర దేశాలకూ పంపించాము. డ్వాక్రా మహిళలు తయారుచేసిన వస్తువులు విదేశాల్లో ప్రదర్శించారు. వారంతా అక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు. అప్పట్లో ఆడవాళ్లు బ్యాంకుకు వెళ్లేవారు కాదు. మహిళలు ధైర్యంగా చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు నిర్వహించే శక్తిని నేను అందించాను.
కొందరు ఆడబిడ్డలు వారు చదువుకోవడంతో పాటు భర్త, పిల్లలకు చదువు నేర్పారు. గ్రామానికి నాయకత్వం వహించేలా మహిళలను తీర్చిదిద్దాం. సమస్యలపై పోరాటం చేసే స్పూర్తి నింపాం. నేను తెచ్చిన డ్వాక్రా సంఘాలను ఎవరూ ఏమీ చేలేకపోయారు. ఆడబిడ్డలకు కాలేజీల్లో, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు తెచ్చాం. టీచర్ ఉద్యోగాల్లో 40 శాతం ఇచ్చాం. చక్కగా చదువుకున్న ఆడబిడ్డలు మగవారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆడవారికే రివర్స్ లో కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా మహిళలు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తే మగవారు వెనకబడిపోతున్నారని చాలామంది వాపోయారు. ఎవరి టాలెంట్ వారిది కదా. పసుపు –కుంకుమ కింద ఒక్కో కుటుంబానికి రూ. 20 వేలు ఇచ్చాం. ఒక అన్నగా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇచ్చాను. నేను ఆడవారి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇస్తే జగన్ రెడ్డి ఓటీఎస్ తెచ్చాడు. ఓటీఎస్ తెచ్చి బలవంతంగా డబ్బు వసూలు చేస్తానంటున్నాడు. నువ్వెవరు వసూలు చేయడానికి? పేదలకు ఇళ్లు ఎన్టీఆర్, నేను ఇచ్చాం.
ఆడవాళ్లు తిరగబడితే జగన్ పారిపోతాడు. డబ్బు కట్టమని బెదిరిస్తే ఖబడ్దార్. అమరావతి రైతులే మీకు ఆదర్శం. అమరావతి మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని విజయం సాధించారు. మహిళా దినోత్సవం చేసే అర్హత జగన్ రెడ్డికి లేదు. మూడేళ్లుగా బాదుడే బాదుడు. ఇంటి ఖర్చులు బాగా పెరిగాయి. మహిళలు ఇబ్బంది పడుతున్నారు. జగన్ రెడ్డి ఇచ్చేది గోరంత-చెప్పేది కొండంత. ప్రతి కుటుంబం ఆదాయం తగ్గింది. అప్పులు పెరిగాయి. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మహిళా దినోత్సవం జరిపే అర్హత ఎక్కడిది నీకు? కరెంటు చార్జీలు పెరిగాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు, ఇంటిపన్ను, ఆర్టీసీ పన్నులు పెరిగాయి. చెత్త మీద పన్ను వేసే ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అంటారా లేదా? మరుగుదొడ్లపై పన్ను వేయడమేంటి? జుట్టుపైన కూడా పన్ను వేస్తాడేమో. సత్యహరిశ్చంద్రుడు పోతూ పోతూ తననే పెట్టినట్టు జగన్ రెడ్డి ఫీలవుతున్నాడు. ఊరూరు తిరిగి అబద్ధాలు చెప్పాడు. మద్యపాన నిషేదం చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? కొత్త బ్రాండ్లు తెచ్చాడు.. ఎవరికీ ఇలాంటి ఆలోచన రాదు. ప్రెసిడెంట్ , స్పెషల్ స్టేటస్, అమరావతి మెడల్స్ పేరుతో సొంత బ్రాండ్లు తెచ్చాడు. ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేశాడు. కల్తీ మద్యంతో వందలమంది చనిపోయారు. మద్యంపైన వచ్చే ఆదాయం చూపి మళ్లీ అప్పులు తెచ్చాడు. పిల్లలను బాగా చదివించి మటన్, చికెన్ షాపుల్లో పెట్టాలా?
మనం ఐటీ ఉద్యోగం ఇస్తే జగన్ ఏమిచ్చాడు? మరుగుదొడ్ల దగ్గర డబ్బులు వసూలు చేసే ఉద్యోగం ఇచ్చాడు. అబద్ధాల కోరు జగన్ రెడ్డి . అతను చెప్పిన అబద్ధాలన్నీ ప్రింట్ చేసి చూపిస్తాం. అమ్మఒడి -నాన్న బుడ్డి రెండూ కలిపితే ఎంత దోస్తున్నాడో, ఎంత ఇస్తున్నాడో తెలుస్తుంది. విద్యా దీవెన పేరుతో హడావుడి చేస్తున్నాడు. పేద విద్యార్థులకు రూ .15 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపాం. తనిచ్చిన రూ. 15,000 వేల గురించి 15 వేల సార్లు చెప్పుకుంటాడు. అతడు నొక్కే బటన్ ఆగిపోయింది. మాట తప్పాడు-మడమ తిప్పాడు.
అంగన్ వాడీ , ఆశా వర్కర్ల జీతాలు పెంచింది మనం. జీవో కూడా చూపిస్తే.. నేనే పెంచానని జగన్ అబద్ధాలు చెబుతున్నాడు. మూడేళ్ల వైసీపీ పాలనలో 1500కు పైగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగాయి. నా హయాంలో దాచేపల్లిలో చిన్న పాపపై అత్యాచారం జరిగింది. నేను కఠిన చర్యలు తీసుకుంటాననే భయంతో నిందితుడు చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. సీఎం ఇంటి పక్కన మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదంటే సిగ్గుగా లేదా? మీకు బాధ్యత లేదా? టీడీపీ హయాంలో తప్పు చేసిన వాడు తప్పించుకోలేదు. విశాఖలో శ్రీలక్ష్మి, విజయవాడలో తేజస్విని, నరసరావుపేట అనూష, అనంతపురంలో స్నేహలత, పులివెందులలో నాగమ్మ, నెల్లూరులో దారుణం జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు.
ఎక్కడైనా దిశా చట్టం అమలవుతోందా? తప్పు చేస్తే 24 గంటల్లో చర్యలు తీసుకుంటానని అసెంబ్లీలో గొప్పలు చెప్పాడు. దిశా చట్టం తేలేదు కానీ పోలీస్ స్టేషన్ ప్రారంభించాడు. నేనిచ్చిన పోలీస్ స్టేషన్ కు, పోలీస్ వాహనాలకు రంగులు వేశాడు. రాజమండ్రిలో బాలికను గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన దగ్గర
వదిలేస్తే పట్టించుకోలేదు. నడిరోడ్డుపై మహిళలు అర్ధరాత్రి స్వేచ్చగా తిరిగితేనే నిజమైన స్వాతంత్ర్యం అని గాంధీజీ చెప్పారు. రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు. గుంటూరు జిల్లాలో భర్త ఎదుటే భార్యను మానభంగం చేశారంటే వైసీపీ నేతలకు సిగ్గు అనిపించలేదా? పులివెందులలో దళిత మహిళపై అత్యాచారాం జరిగితే టీడీపీ బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకున్నాను.
బాబాయ్ ని హత్య చేయించి నాపై తోశారు. నారాసుర రక్తచరిత్ర అని నాపై సాక్షి ద్వారా విషం చిమ్మారు. నీ చెల్లెళ్లకు న్యాయం చేయలేని నువ్వు రాష్ట్ర మహిళలకు న్యాయం చేస్తావా? జగన్ వదిలిన బాణం గురి తప్పింది. తల్లికి అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంట. బాబాయ్ ని చంపినందుకు నీ చెల్లికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున క్షమాపణ చెబితే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. హత్యలు చేసే వారు ముఖ్యమంత్రిగా ఉండాలా ? హత్యా రాజకీయాలు చేసే వాళ్లు మంత్రులుగా ఉండాలా?
బాబాయ్ గుండెపోటుతో చనిపోయినట్టు సాక్షిలో చెప్పి డ్రామా ఆడారు.. ఒక్కో వాంగ్మూలం బయటకు వస్తుంటే భయానకంగా ఉంది. ఇంతటి క్రైమ్ సీన్ ఎక్కడా ఉండదు. పుస్తకాల్లో చదవని, సినిమాల్లో చూడని విధంగా చంపేసి సీబీఐపైన కూడా దాడి చేస్తున్నారు. రాజకీయం చేయాలని చూస్తున్న ముఖ్యమంత్రిని ఏమనాలి? రేపో , ఎల్లుండో ఎన్నికలకు కూడా పోవాలనుకుంటున్నాడు. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో భయపడి ఎన్నికలకు వెళ్లిపోదామనే ఆలోచన చేస్తున్నాడు. జగన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఒక్క చాన్స్ ముగిసిపోవడం ఖాయం. 2020లో కర్నూలు జిల్లాలో హజీరా బేగంను హత్య చేసినా న్యాయం జరగలేదు. ఇంటి జాగా ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం, 10 లక్షలు డబ్బు ఇస్తామని బాధితురాలి తల్లిని ప్రభుత్వం మభ్యపెట్టినా ఆమె తలొగ్గలేదు. కూతురిని చంపినవారిని ఉరికంభం ఎక్కించాలని ఆమె కోరుకుంటున్నారు. శభాష్. ఆ తల్లిని అభినందిస్తున్నా. పిల్లలు చనిపోతే కొందరు రాజీ పడ్డారు. వారిని నేను తప్పుపట్టడంలేదు. అసెంబ్లీలో జరుగుతున్న ఘటనలు బాధిస్తున్నాయి.
జగన్ రెడ్డి వయసు నా అనుభవమంత లేదు. అతడు పక్కా క్రిమినల్, బిజినెస్ మెన్. ప్రజలను ఎలా మోసం చేయాలనే ఆలోచనే చేస్తాడు. ఈ ప్రభుత్వం అన్యాయంగా పించన్లు తొలగిస్తోంది. వారందరికీ టీడీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి పెన్షన్లు ఇస్తుంది. పించన్ తొలగించడంపై నిలదీసిన రమణమ్మను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. జగన్ రెడ్డి ప్రభుత్వం మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఇష్టానుసారం రాయిస్తున్నారు.
నా భార్య ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడలేదు. కానీ ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు బట్టారు. మానసికంగా కుంగదీసే పరిస్థితి తీసుకొచ్చారు. అసెంబ్లీలో కౌరవసభ పోయి గౌరవసభ వచ్చే వరకూ అడుగుపెట్టనని నేను శపథం చేశాను. క్షేత్రస్థాయిలో గెలిచాకే సభలో అడుగుపెడతాను. శ్రీకాకుళం జిల్లాలో వెంకటరావు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించారు. వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ లు ఈ ఘటనకు కారణం కాదా? వెంకట్రావు ఇద్దరు పిల్లలను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివిస్తాం. వారి కుటుంబానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం చేస్తాం.
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్ద అన్నలూరు గ్రామంలో వెంకటసుబ్బమ్మను పోలీసుల సాయంతో వైసీపీ నేతలు చీర లాగేశారు. భూమి కబ్జా అడ్డుకున్నందుకు ఈ దురాగతానికి ఒడిగట్టారు. మహిళా దినోత్సవం రోజునా ఇవే దారుణాలు. వైసీపీ నేతలు చెప్పేవి బడాయి మాటలు. చేసేవి చెత్త పనులు. అమరావతి మహిళా రైతులే మనకు ఆదర్శం. మహిళలకు అన్ని రంగాల్లో హక్కులు వచ్చేవరకూ పోరాడాలి. మీలో స్పూర్తి రావాలి. పోరాట పటిమ పెంచుకోవాలి. వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో తెలుగు మహిళ బాగా పనిచేస్తోంది. నారీ సంకల్ప దీక్ష బ్రహ్మాండంగా చేశారు. మన పార్టీ కార్యాలయం, నెల్లూరు, రాజమండ్రి లో కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. ఈ చైతన్యాన్ని కొనసాగించాలి. అన్ని రంగాల్లో 50 శాతం మహిళా భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నాను.
మహిళా దినోత్సవ వేడుకలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ, టీడీపీ అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, సహా పలువురు మహిళా నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు సన్మానం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో అశువులు బాసిన మహిళల చిత్రపటాలను నేతలు నివాళులర్పించారు.