– జవ్వాది కొండల్లో మూడు రోజుల అనుభవం
– ఊహించని కవరేజ్ తో సాక్షి మెయిన్ మొదటి పేజీలో ఎర్రచందనం అక్రమ రవాణా మూలాలపై ప్రత్యేక కథనం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ఓఎస్డీ స్వర్గీయ డాలర్ శేషాద్రి మామ తో నాకున్న అనుభవం గురించి 2021 నవంబరు 30 వ తేదీ సోషల్ మీడియాలో నేను రాసిన గతస్మృతులు నాలోని జర్నలిస్టును నిద్రలేపాయా అనే ఆలోచనలో పడేశాయి.అప్పటికప్పుడు నాలో కలిగిన భావోద్వేగాలకు జర్నలిస్టు పెద్దలు, మిత్రులు, బంధువర్గం నుంచి వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నేనంటే అస్సలు గిట్టని వారు కూడా కొందరు ఫోన్ చేసి బాగా రాశావని అభినందించారు.
ఒక జర్నలిస్టు తన గత అనుభవం గురించి రాసిన వ్యాసానికి ఇంత స్పందన వస్తుందనే విషయం నేను ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారి.ఈ స్పందన నా అనుభవం తాలూకు మరో స్మృతికి అక్షర రూపం ఇవ్వడానికి ప్రేరణ కలిగించిందని చెప్పడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
అది 2012వ సంవత్సరం. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని శేషాచల అడవుల నుంచి పెద్ద మోతాదులో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా అవుతున్న సంఘటనలపై ప్రతి రోజు పత్రికల్లో వార్తలు కనిపించేవి. పోలీసులు, అటవీ అధికారులు రోజూ వందలాదిమంది తమిళ కూలీలను అరెస్టు చూపిస్తున్నారు. అడవుల్లోని ఎర్రచందనం చెట్లు నరికే కూలీలు పోలీసులు, అటవీశాఖ అధికారులపై దాడులకు తెగబడ్డ సంఘటనలు కూడా పత్రికల్లో తరచూ కనిపించేవి. ఇంత భయానక పరిస్థితుల్లో కూడా ప్రత్యేకంగా బస్సులు లేదా ఇతర వాహనాలు ఏర్పాటు చేసుకుని వందలాదిమంది తమిళ కూలీలు అడవిలోకి ఎలా చొరబడకలుగుతున్నారు?
ఇంతకీ వీరు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు? వీరిని ఎవరు తెస్తున్నారు? ఎర్రచందనం కొల్లగొడుతున్న బడా స్మగ్లర్లు ఎవరు? వీరికి పోలీసులు, అటవీశాఖ నుంచి ఏ రకమైన సహకారం అందుతోంది? అడవి నుంచి ఎర్రచందనం దుంగలు ఎక్కడికి ఎలా తరలిస్తున్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలు నా మదిలో ఆలోచనలు రేకెత్తించాయి. అప్పటి మా ఎడిషన్ ఇంచార్జ్ శ్రీ రామాంజనేయులు సర్ తో ఈ సవాలక్ష సందేహాల గురించి చర్చించాను. ఈ సబ్జక్టు మీద తూతూ మంత్రంగా, ఆవు కథలా కాకుండా లోతైన పరిశోధన చేసి స్టోరీ రాస్తే పేలిపోతుంది నగేష్ అని ఆయన సలహా ఇచ్చారు. ఫన్ డే ( సాక్షి ఆదివారం పుస్తకం) కు పంపుదాం. నేను ఎడిటర్ గారు, రాం అన్నయ్య ( ఫన్ డే ఎడిటర్ ) తో మాట్లాడతాను అని భుజం తట్టారు.
మొత్తం మీద స్టోరీ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నాను. నాకు తమిళం కొంచెం కొంచెం మాత్రమే వచ్చు. అవతలి వారు మాట్లాడే విషయం కొంత మేరకు అర్ధం అవుతుంది. కానీ స్పష్టమైన సమాధానం ఇచ్చే సీన్ లేదు. వెల్లూరు, తిరువన్నామలై జిల్లాల్లోని అతి ఎత్తైన, దట్టమైన అటవీ ప్రాంతం లోని జవ్వాది కొండ ప్రాంతాలకు వెళ్ళాలి ? ఎలా..ఎలా?
మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెప్పినట్లు నా సన్నిహితులు, సాక్షి తమిళనాడు ఇంచార్జ్ శ్రీ నందగోపాల్ గారితో ఈ విషయం గురించి మాట్లాడి ఏదైనా మార్గం చూపించాలని అడిగాను. మన వెల్లూరు రిపోర్టర్ దొరై రాజ్ కు చెబుతాను సర్..మీరు అతనికి తెలుసు..అతను తమిళం బాగా మాట్లాడగలడు. జవ్వాది హిల్స్ ప్రాంతాలతో పరిచయాలు కూడా ఉన్నాయి అని ఒక మార్గం చూపించారు.
చెన్నై లోనే సాక్షి స్టాఫర్ గా పని చేస్తున్న మిత్రుడు,నేను ఆప్యాయంగా నవాబు అని పిలిచే అస్మతీన్ తో కూడా మాట్లాడాను. వెల్లూరు దొరై ఉన్నాడు కదా సర్..అతనితో నేను కూడా చెబుతాను. మనోడే మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకుని పోయి తీసుకుని వస్తాడు. అయినా అక్కడ జాగ్రత్తగా డీల్ చేయండి సర్..వాళ్ళు రాక్షసులు అని సలహా కూడా ఇచ్చాడు. నందగోపాల్ గారు , అస్మతీన్ ఇద్దరూ వెల్లూరు విలేకరి దొరై రాజ్ తో మాట్లాడి నా మొబైల్ నంబర్ అతనికి ఇచ్చారు. అతని నంబర్ నాకు పంపారు.
ఆరోజు రాత్రి 9 గంటలకు అనుకుంటా దొరై నాకు ఫోన్ చేశాడు. విషయం చెప్పాను. ఆ అడవి లోని పల్లెలు నాకు బాగా తెలుసు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు రండి సర్ నేను చూసుకుంటాను అని అప్పటిదాకా నాలో ఉన్న టెన్షన్ ఒక్క మాటతో దూరం చేశాడు. దొరై భరోసాతో ఈ స్టోరీ చేసి తీరాలనే పట్టుదల నాలో మరింత పెరిగింది. ఎడిటర్ శ్రీ మురళి సర్ , నెట్ వర్క్ ఇంచార్జ్ శ్రీ మంచాల శ్రీనివాస రావు సర్ తో మాట్లాడి వారి అనుమతితో జవ్వాది కొండల అటవీ గ్రామాల ప్రయాణానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నాను.
ఎప్పుడు వస్తున్నాననే విషయం చెప్పడానికి దొరై కి ఫోన్ చేశాను. నేను, ఫోటో గ్రాఫర్ సుబ్బు వస్తున్నామని చెప్పాను. పెద్ద కెమెరా పట్టుకుని ఎక్కువ మంది వెళితే ఇబ్బంది కావచ్చు సర్..నా దగ్గర చిన్న కెమెరా ఉంది. ఫోటోలు బాగానే వస్తాయి.. మీరు ఒక్కరే వచ్చేయండి.. కారు కూడా వెల్లూరు నుంచే తీసుకుని వెళదాం. వెల్లూరు రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మనల్ని ఎవరూ అనుమానించరు అని సలహా ఇచ్చాడు. 2012 జులై 25 వ తేదీ ఉదయం తిరుపతి నుంచి బస్సులో బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు వెల్లూరు చేరుకున్నాను.
బస్టాండ్ లో కారుతో సహా అప్పటికే సిద్ధంగా ఉన్న దొరై నన్ను రిసీవ్ చేసుకుని, వెల్లూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న మంచి హోటల్ కు తీసుకుని వెళ్ళాడు. హడావుడిగా భోజనం చేసి మధ్యాహ్నం 1 గంట సమయంలో కారులో జవ్వాది హిల్స్ అటవీ గ్రామాలకు ప్రయాణం ప్రారంభించాము. 3గంటల సమయానికి దట్టమైన అడవిలో ఉన్న ఎత్తైన కొండ ప్రాంతానికి చేరుకున్నాము. 50 నుంచి 100 గడపలు ఉన్న కొన్ని ఊళ్ళు లోయల్లో ఉంటే. మరికొన్ని ఊళ్ళు రోడ్డుకు ఆనుకుని కనిపించాయి. ఆ గ్రామాలు, అక్కడి మనుషులను చూడగానే అక్కడి నుంచి వందలమంది యువకులు, నడివయస్కులు అడవిలో ఎర్రచందనం చెట్లు నరకడానికి ఎందుకు వస్తున్నారో నాకు ఇట్టే అర్థమైంది.
అక్కడి వారికి చదువు లేదు. అడవిలో వ్యవసాయం, అడవుల్లోని భారీ వృక్షాలను నరకడం తప్ప మరో బతుకు దెరువు లేదనే వాస్తవం గుర్తించడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. వీరి దెబ్బకు తమిళనాడు,కేరళ రాష్ట్రాల అడవుల్లోని భారీ శ్రీగంధం చెట్లు లెక్కలేనన్ని నేలకూలాయనే విషయం అక్కడి వారి మాటలను బట్టి అర్థమైంది. నేను అడగాలనుకున్నది తెలుగులో దొరై కి చెబితే అతను వారిని తమిళంలో అడుగుతాడు. వారి సమాధానాలు దాదాపు నాకు అర్థం అయ్యాయి. అర్థం కానివి ఏమైనా ఉంటే దొరై నాకు స్పష్టంగా విడమరిచి చెప్పాడు.
ఈ అడవిలోని గ్రామాలను చుట్టేసి ఎక్కువ మందితో మాట్లాడి నాకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకోవడం ఒక్క పూటలో సాధ్యమయ్యే పని కాదని అర్థమైంది. రెండు, మూడు రోజులైనా సరే మొత్తం గ్రామాలు చుట్టేయాలని నిర్ణయించుకుని ఇదే విషయం దొరై కి చెబితే ఓకే సర్. నేనున్నానుగా ర్రాత్రి కి వెల్లూరు కు పోదాం మళ్లీ పొద్దున్నే వద్దాం అని తన అంగీకారం తెలిపాడు. రాత్రి 7 గంటల వరకు అటవీ గ్రామాల్లో తిరిగి అనేకమంది తో మాట్లాడాము. ఫోటో లకు ఒప్పుకున్న వారిని దొరై తన కెమెరాలో బంధించాడు. రాత్రి సుమారు 10 గంటలకు వెల్లూరు చేరుకుని చిన్న లాడ్జిలో ( పేరు గుర్తు లేదు) బస చేశాను. ఉదయాన్నే 9 గంటలకంతా దొరై నా దగ్గరికి వచ్చాడు.
ముందు రోజు అనుభవం తో టిఫిన్ కాస్త గట్టిగా లాగించి స్నాక్స్ తీసుకుని మళ్ళీ ప్రయాణం ప్రారంభించాము. కొండ ల్లోని లోతైన ప్రాంతాల్లోని గ్రామాల్లో తిరుగుతూ సమాచారం సేకరించడంతో పాటు అక్కడి ప్రకృతిని అందాలను బాగా ఆస్వాదించాను. నేను తెలుగులో మాట్లాడటం, దొరై వారికి తమిళంలో తర్జుమా చేయడం చూసి అక్కడి వారికి నేను తమిళనాడు వాసిని కాదని అర్థమైంది. కొందరు మీరు ఆంధ్రా పోలీసులా అని అనుమానించారు. చాలామంది మాతో మాట్లాడటానికి భయపడి దూరంగా వెళితే, ఇంకొందరు ఇక్కడ మీకేం పని, మావాళ్ళను, మా ఊళ్ళను ఫోటోలు ఎందుకు తీస్తున్నారని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పేరుతో ఏర్పడిన * వీరప్పనూర్** లో టీ అంగళ్ళు, కొన్ని గుడిసెల్లో వీరప్పన్ ఫోటోలు పెట్టుకున్న దృశ్యాలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. బయటి ప్రపంచానికి అతను పేరు మోసిన గంధపు చెక్కలు, ఏనుగు దంతాల దొంగ.ఆ గ్రామానికి మాత్రం వీరుడు. చాలా మందికి అనేక రకాల సహాయం చేశాడని అక్కడి వారు చెబితే, అందుకే అతని ఫోటోలు పెట్టుకున్నారనే విషయం గ్రహించాను.
ఈ గ్రామాల్లోని యువకులు, నడి వయస్కులు బ్యాటరీతో పని చేసే భారీ రంపాలను ఉపయోగించి ఏ మాత్రం శబ్దం లేకుండా ఎంత భారీ వృక్షాల నైనా నేల కూల్చే విద్య బాగా తెలిసిన వారు. ఒక్కసారి కమిట్ అయి అడవిలోకి పోతే పని పూర్తి చేసే వరకు అడుగు వెనక్కు వేయని ధైర్య వంతులు. పోలీసుల మీద దాడులు చేయడానికి ఏ మాత్రం భయపడని నైజం వీరిది. కళ్లెదుటే తమ వారు చనిపోయినా, పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపినా ఏ మాత్రం భయపడని మొండి ధైర్యం వీరి సొంతం.వీరిలోని ఈ ప్రత్యేక లక్షణాలు గుర్తించే ఎర్రచందనం దొంగలు వీరికి కిలో కు ఇంతమొత్తం ఇస్తామని ఒప్పందం చేసుకుని శేషాచలం అడవుల్లోని అరుదైన ఎర్రచందనం వృక్షాలను నరికించి అక్రమ రవాణా చేస్తున్నారని గుర్తించాను. అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినా వారు ఇష్టపడలేదు.
రెండో రోజు రాత్రి మళ్లీ వెల్లూరు చేరుకుని సేమ్ లాడ్జిలో బస.. మరునాడు ఉదయం 9 గంటలకు దొరై రావడం 10 గంటలకు బయల్దేరి జవ్వాది హిల్స్ వెనుక భాగంలో ఉన్న అటవీ గ్రామాలకు వెళ్ళి మధ్యాహ్నం వరకు కలియ తిరిగాము. ఇక చాలబ్బా విషయం అర్థమైంది. కావాల్సినంత సమాచారం దొరికింది. నేను తిరుపతికి వెళతాను అని చెప్పి తిరుగు ప్రయాణమై రాత్రి 7గంటల కు చిత్తూరు కు చేరుకున్నాను.
ఎర్రచందనం అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేయడానికి, జవ్వాది కొండల నుంచి తమిళ కూలీలు శేషాచలం అడవుల్లోకి రాకుండా వారికి అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్న చిత్తూరు జిల్లా పోలీసు అధికారి శ్రీ
కాంతి రాణా టాటా (ఇప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్) తో కూడా కొంత సేపు మాట్లాడితే మరింత సమాచారం దొరకొచ్చని అనుకున్నాను. బస్సులో ఉండగానే సాక్షి చిత్తూరు క్రైమ్ రిపోర్టర్, మిత్రుడు లోకనాథం కు ఫోన్ చేసి విషయం చెప్పాను. నేను బస్సు దిగే సమయానికి సిద్ధంగా ఉన్న లోకనాథం తన టూ వీలర్ మీద ఎస్ పి బంగ్లాకు తీసుకుని వెళ్ళాడు.
అప్పటికి సమయం రాత్రి దాదాపుగా 7- 30 గంటలు అనుకుంటా.. ముందుగానే అనుమతి తీసుకుని ఉన్నందువల్ల ఎస్పీ గారు వెంటనే తన చాంబర్ లోనికి పిలిచారు. సుమారు గంటన్నర పాటు మేము మాట్లాడుకున్నాము. నేను అడవిలో తిరిగి సంపాదించిన సమాచారం, నా అనుభవాలు, అభిప్రాయాలు ఆయనతో పంచుకున్నాను.
స్మగ్లర్లు అడవిలోకి కూలీలను తీసుకుని రావడం నుంచి ఎర్రచందనం అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసే వరకు జరిగే తతంగాన్ని మొత్తం ఆయన నాకు సినిమా చూపించినట్లు చెప్పారు. షిప్పింగ్ హార్బర్లల్లో ఎర్రగడ్డలు (ఉల్లిపాయలు) నింపి కస్టమ్స్ అధికారులు సీల్ వేసిన కంటైనర్ల లోకి ఎర్రచందనం ముక్కలు ఎలా లోడ్ చేస్తారనే విషయాలు ఆధారాలతో సహా చాలా చక్కగా నాకు అర్థమయ్యేలా చెప్పారు. పక్కా సమాచారం తో ఇలాంటి కొన్ని కంటైనర్లను రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా ఓపెన్ చేయించిన అనుభవం ఆయనది.
తమిళనాడు నుంచి కూలీలు శేషాచలం అడవుల్లోకి రాకుండా వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన వల్ల ఎంతమేరకు ఉపయోగం ఉంటుందన్నది మాట్లాడుకున్నాము. అయితే తమిళనాడు పోలీసుల నుంచి మన పోలీసులకు 100% సహకారం మాత్రం ఆశించలేము. ఈ అక్రమ రవాణాకు అక్కడి కొన్నిరాజకీయాలు కూడా ముడి పడి ఉండటం ఇందుకు ఇంకో కారణం.మొత్తం మీద శ్రీ కాంతి రాణా టాటా తో నా మీటింగ్ అయ్యి నేను లోకనాథం బయటకు వచ్చేప్పటికి చిత్తూరు స్టాఫర్, నా మిత్రుడు అరవింద్ ( ఈ మధ్యే ఆయన కన్ను మూశారు) విష్ణు భవన్ కు పిలుచుకుని వెళ్ళి మంచి భోజనం పెట్టించి బస్టాండ్ లో తిరుపతి బస్సు ఎక్కించారు. రాత్రి 12-30 గంటల సమయంలో తిరుపతి కి చేరుకున్నాను.
మరుసటి రోజు
(28 -7-2012) ఉదయం అటవీశాఖ డిఎఫ్ఓ శ్రీ చక్ర పాణి గారితో మాట్లాడి, మధ్యాహ్నం 2 గంటలకు కంప్యూటర్ ముందు కూర్చుంటే సాయంత్రం 5 గంటలకు స్టోరీ కంపోజ్ చేయడం పూర్తి అయ్యి డెస్క్ కు పంపి ఎడిషన్ ఇంచార్జ్ శ్రీ రామాంజనేయులు సర్ కు విషయం చెప్పాను. ఎడిటర్ శ్రీ మురళి సర్ కు, నెట్ వర్క్ ఇంచార్జ్ శ్రీ మంచాల శ్రీనివాసరావు సర్ కు టాస్క్ పూర్తి అయ్యిందని, స్టోరీ పంపామని చెప్పాను.
స్టోరీకి రామాంజనేయులు సర్ మరిన్ని మెరుగులు దిద్ది ఆదివారం బుక్కు ( ఫన్ డే) ఎడిటర్ రాం అన్నయ్య కు పంపారు. ఫన్ డే లో ఈ స్టోరీ వేయడం కుదరదని ఆయన వెనక్కు పంపారట. ఆ స్టోరీ వెనుక ఉన్న కష్టం గుర్తించిన ఎడిటర్ శ్రీ మురళి గారు మనం రేపు మెయిన్ పేజీ బ్యానర్ చేద్దామని సెంట్రల్ డెస్క్ కు స్టోరీ పంపారు.
30-7-2012 ఉదయాన్నే 6 గంటలకు వెల్లూరు రిపోర్టర్ దొరై ఫోన్ చేసి నిద్ర లేపాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే “” థాంక్యూ ” సర్ అని గబ గబ రెండు మూడు సార్లు చెప్పాడు. ఎందుకు దొరై అని అడిగితే ఎర్రచందనం స్టోరీలో నా పేరు కూడా పెట్టారు కదా సర్ అని తెగ సంబర పడ్డాడు. పేపర్లో అతని పేరు రావడం మొదటి సారి.అదీ మెయిన్ మొదటి పేజీలో రావడం అతనికి మరింత ఆనందం కలిగించింది. స్టోరీ రాయడం లో నా కష్టం ఎంత ఉందో దొరై కష్టం కూడా అంతే ఉంది. అందుకే నా పేరుతో పాటు దొరై పేరు కూడా పెట్టి పంపాను.
దొరై ఫోన్ పెట్టేయగానే బయటకు వెళ్ళి పేపర్ తీసుకుని చూస్తే మొదటి పేజీలో దాదాపు సగం, రెండవ పేజీ లో ముప్పావు పేజీలో నా స్టోరీ కనిపించింది. అదేంటి మనం ఫన్ డే కి అనుకున్నాం కదా మెయిన్ లో
పెట్టారెందుకబ్బా అని ఆలోచనలో పడ్డాను. 10 గంటల పైన హైదరాబాద్ పెద్దలతో మాట్లాడితే ముందు రోజు జరిగిన విషయం తెలిసింది.
మెయిన్ మొదటి పేజీ బ్యానర్ లో ” వీరప్పనూరు నుంచి ఎస్ నగేష్ /వేలూరు రిపోర్టర్ దొరైరాజ్ ” అని పేర్లు పెట్టి ఇంత బాగా స్టోరీ ప్రచురించినందుకు నాకు సంతోషం కలిగింది. స్టోరీలో అన్ని కోణాలతో పాటు అడవిలో నుంచి ఒక లారీ, అంబులెన్స్, ఐషర్, సుమో, కారు లో ఎర్రచందనం అక్రమ రవాణా చేసే
స్మగ్లర్లు పోలీసులకు, ఆటవీశాఖకు, ఆదారిలో వచ్చే చెక్ పోస్టు లకు ఫిక్స్డ్ మామూళ్లు ఎంత నిర్ణయించారనే వివరాలతో ప్రచురితమైన కథనం చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు సాక్షి మిత్రులు, చెన్నై బ్యూరో ఇంచార్జ్ శ్రీ నంద గోపాల్ గారు అభినందనలు తెలియజేశారు. స్టోరీ సూపర్ గా పేలింది నగేష్ అని మా మహర్షి సర్ మెచ్చుకున్నారు.
అప్పటి ఈనాడు తిరుపతి బ్యూరో ఇంచార్జ్ శ్రీ వివి రావు గారు,మా గురువు, సీనియర్ రిపోర్టర్ ” ఏం నాగేశ్వ ర్రావ్” అని పూర్తి పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి శ్రీ పివి రవికుమార్ గారు ( 1992 లో కడప లో ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో ఆయన వద్ద నేను కంట్రిబ్యూటర్ గా పని చేశాను) మంచి స్టోరీ రాశావని మెచ్చుకున్నారు. సాక్షి తో ఇప్పటికీ నాకున్న అనుబంధంలో ఇదో పెద్ద అనుభవం. అయితే ఇందులో చిన్న అసంతృప్తి ఏమిటంటే ఎంతో విలువైన సమాచారం ఆధారాలతో సహా నాకు ఇచ్చిన ఎస్పీ శ్రీ కాంతి రాణా టాటా గారి ఫోటో, ఆయన అభిప్రాయాల గురించి రాసిన ఒక పేరా మాత్రమే ముద్రించలేదు. ఆ తరువాత ఒక సారి నేను శ్రీ కాంతి రాణా టాటా గారిని కలిసినప్పుడు ఇదే మాట ఆయన నన్ను అడిగారు. ఆయనకు సారీ చెప్పడానికి కూడా నాకు ముఖం చెల్లలేదు. నిజంగా ఆయన ఫోటో, ఆయన చెప్పిన నాలుగు మాటలు అచ్చు వేసి ఉంటే స్టోరీకి మరింత బలం వచ్చేది. అయినా ఇక చేయగలిగిందేమీ లేదు కదా..ఈ స్టోరీ ప్రచురితమైన కొంతకాలానికి హైదరాబాద్ లో జరిగిన బ్యూరో ఇంచార్జ్ ల సమావేశంలో సాక్షి చైర్ పర్సన్, నేను ఎంతగానో అభిమానించే శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి వై ఎస్ భారతి గారు నన్ను అభినందించడం నాకు మరింత సంతోషం కలిగించింది. నా ఈ అనుభవాన్ని చాట భారతంలా రాస్తే , చదివే వారికి బోర్ కొట్టకుండా ఉండేలా ఎడిటింగ్ చేసిన నా శ్రీమతి అన్న పూర్ణకు ధన్యవాదాలు.
ఈ స్టోరీ కి వచ్చిన స్పందన నాతో వీరప్పన్ భార్య శ్రీమతి ముత్తు లక్ష్మి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేయించగలిగింది. అప్పట్లో కుప్పం సాక్షి ఆర్ సి ఇంచార్జ్ గా పనిచేసిన మిత్రుడు శ్రీ వెంకటేష్ బాబు, నా మిత్రుడు వెంకీ సహకారంతో చేసిన ఆ ఇంటర్వ్యూ అనుభవాలు మరోసారి వివరిస్తాను.