విద్యార్థుల తరఫున నాగశ్రావణ్ పోరాటం స్ఫూర్తిదాయకం

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు
– దౌర్జన్యంగా నిరాహార దీక్ష భగ్నం చేయడంపై విమర్శలు
– విద్యార్థులను ఉగ్రవాదుల్లా చిత్రీకరించడం ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనమని ధ్వజం

విజయవాడ: విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల కోరుతూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగశ్రావణ్ కిలారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు దౌర్జన్యంగా భగ్నం చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు ఖండించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని మండిపడ్డారు.

శ్రావణ్ పోరాటం యువతరానికి ఎంతో స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. మేనమామలా చదువుల పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పిన జగన్.. విద్యార్థులను మోసం చేసి, కంస మామగా మారరని ధ్వజమెత్తారు. విద్యా దీవెన, వసతి దీవెన సహా అన్ని పథకాల్లో కోత విధించారని విమర్శించారు.

మొత్తంగా రూ.3,400 కోట్ల బకాయిలు..
గత ఐదేళ్లలో రాష్ట్రప్రభుత్వం మొత్తంగా 20 విడతల్లో విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాల్సి ఉందని అచ్చెంనాయుడు తెలిపారు. అయితే కేవలం 16 విడతల్లో మాత్రమే నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్ లో రూ.2,800 కోట్లు, పీజీ విద్యార్థులకు రూ.450 కోట్ల బకాయిలు, విద్యాదీవెనలో రూ.150 కోట్ల బకాయి పడిందని వెళ్లడించారు. మొత్తంగా విద్యార్థులకు రూ.3,400 కోట్లు రాష్ట్రప్రభుత్వం చెల్లించాలని వివరించారు.

వీటిపై విద్యార్థుల తరఫున పోరాటం చేస్తున్న నాగశ్రావణ్ ను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను ఉగ్రవాదుల్లా చిత్రీకరించి, దౌర్జన్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో యువత, విద్యార్థులే వైసీపీ పతనానికి నాంది పలుకుతారని స్పష్టం చేశారు.

Leave a Reply