బీజేపీకి 10 అసెంబ్లీ..8 ఎంపీ సీట్లు?

– ఖరారైన పొత్తు?
– అమిత్‌షా, నద్దాతో బాబు-పవన్ భేటీ
– గెలిచే గుర్రాలకే సీట్లు
– వైసీపీ లాభపడకుండా ముందు జాగ్రత్త
– ఎన్డీఏ భేటీకి బాబు
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ-బీజేపీ పొత్తు తుది అంకానికి చేరుకుంది. కేంద్రహోంమంత్రి అమిత్‌షా పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేనాధితి పవన్ కల్యాణ్ .. తొలుత అమిత్‌షాతోపాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నద్దాతో భేటీ అయ్యారు. వీరి భేటీతో టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరడం ఖరారయింది.

కాగా బీజేపీకి 8 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. అయితే గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని, లేకపోతే వైసీపీ లాభపడుతుందన్న బాబు విశ్లేషణను, అమిత్‌షా-నద్దా అంగీకరించినట్లు సమాచారం. దానితోపాటు.. టీడీపీ-జనసేన ఓటు బదిలీ అయ్యే అభ్యర్ధులనే నిలపాలని ఇరువురి మధ్య అంగీకారం కుదిరినట్లు చెబుతున్నారు.

మొదటి నుంచీ టీడీపీని వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలకు సీట్లు ఇచ్చినా, అక్కడ ఓటు బదిలీ కాకపోయే ఉభయులకూ నష్టమని ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దానితో బీజేపీకి సీట్లు దక్కినా, అది పరోక్షంగా వైసీపీకి లాభిస్తుంది కాబట్టి, క్షేత్రస్థాయి వాస్తవాలపై కసరత్తు చేయాలని నిర్ణయించారు.

కాగా బీజేపీ విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, అరకు, హిందూపురం, తిరుపతి పార్లమెంటు స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరి, సత్యకుమార్, సుజనాచౌదరి, రఘురామకృష్ణంరాజు, గీత కచ్చితంగా పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే తాజాగా విజయవాడ నుంచి పొట్లూరి వరప్రసాద్‌కు అగ్రనేతల ఆశీస్సులున్నాయన్న ప్రచార నేపథ్యంలో, విజయవాడ సీటుపై ఉ్కతంఠ నెలకొంది. పీవీపీ ఇంకా వైసీపీకి రాజీనామా చేయకపోవడం, జగన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండటమే దానికి కారణం.

కాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు హిందూపురం కాకపోతే, రాజంపేట దక్కే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజానికి ఆయన గత కొద్ది నెలల నుంచి హిందూపురంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. రాజంపేట నుంచి సత్యకుమార్‌కు సీటు దక్కితే ఆయనకు మద్దతునిచ్చేందకు, బలిజలు సిద్ధంగానే ఉన్నారు. రాజంపేట నియోజకవర్గంలో బలిజల సంఖ్యాబలమే ఎక్కువ. అక్కడ ముస్లిం ఓట్లతోపాటు, బలిజల ఓట్లు ఎక్కువగా ఉండటం, కమ్మ సామాజికవర్గ సంఖ్య కూడా అధికంగా ఉండటంతో, వివాదరహితుడైన సత్యకుమార్ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

ఇక కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి పేరు విజయవాడ ఎంపీకి ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవేళ ఆయన అభ్యర్ధి అయితే, టీడీపీకి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అయితే ఏదైనా అవాంతరాలు త లెత్తితే ఆయనకు, ఏలూరు సీటు ఇవ్వవచ్చంటున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నారు.

అయితే కాకినాడ నుంచి బీజేపీ మాజీ అద్యక్షుడు సోమువీర్రాజు పేరు వినిపిస్తున్నా, సొంత పార్టీలోనే ఆయన తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలోనే బీజేపీ అభ్యర్ధులను గెలిపించుకోలేపోయారని, జిల్లాలో పార్టీ అభ్యర్ధులను అన్ని స్థానాల్లో నిలబెట్టలేకపోయారన్న విమర్శలు ఆయనపై వినిపిస్తున్నాయి. విఫల అధ్యక్షుడిగా ఆయనకు పేరుంది. ఆయనకు గతంలో ఏపీ సంఘటనా మంత్రిగా పనిచేసిన ఒక ప్రముఖుడి ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయనకు సీటు ఇచ్చినప్పటికీ, టీడీపీ-జనసేన ఓటు బదిలీ కాదని రెండు పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇక రాజంపేటలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే, బీసీ నేత సత్యకుమార్ సరైన అభ్యర్ధి అని బీజేపీ-టీడీపీ-జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సిట్టింగ్ ఎంపి మిధున్‌రెడ్డిని ఢీకొనడం కిరణ్‌తో కాదని టీడీపీ-బీజేపీ-జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరి ఇంతకాలమైనప్పటికీ, ఎలాంటి కార్యక్రమాలకూ హాజరుకాలేదని గుర్తు చేస్తున్నారు. అరకు సీటు గీతకు దాదాపు ఖరారయిందంటున్నారు.

ఇక నర్సాపురం సీటు బీజేపీ ఖాతాలోనే వెళుతుందని చెబుతున్నారు. ఆ ప్రకారంగా సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, బీజేపీ అభ్యర్థిగా తెరపైకి రావచ్చంటున్నారు. కాగా అసెంబ్లీలో10 చోట్ల గెలిచే అభ్యర్ధులను నిలపాలని, అక్కడ ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీ లాభపడకూడదని బాబు, బీజేపీ నాయకత్వానికి సూచించినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా ఏలూరు సీటును కేంద్రమాజీమంత్రి కావూరి సాంబశివరావు తనయుడు ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఏలూరుకు పురందేశ్విరి ప్రోత్సాంంతో తపన చౌదరి సీటు ఆశిస్తున్నట్లు చె బుతున్నారు. ఒకవే ళ ఏలూరు కుదరకపోతే కైకలూరు సీటు ఇవ్వాలని త పన చౌదరి అడుగుతున్నట్లు సమాచారం.

Leave a Reply