శహభాష్.. రేవంత్!

( మార్తి నుబ్రహ్మణ్యం)

ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కలవడంపై బీఆర్‌ఎస్ చేస్తున్న రచ్చ ఇంకా ఆగలేదు. ఒకప్పుడు మోదీ అడగకపోయినా ఎగబడి పార్లమెంటులో బిల్లులను ఆమోదించిన గులాబీదళాలు.. ఇప్పుడు అదే ప్రధానిని ఒక సీఎం కలవడంపై గత్తర చేయడమే వింత. మోదీకి శాలువా కప్పి సగం సాగిలబడిన కాళేశ్వరరావు, ఇప్పుడు ఆ స్థానంలో నిలబడ్డ రేవంత్ కలవడాన్ని పరిహసించడం రోత. తాను చేస్తే సంసారం.. ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అంటే ఎలా? ప్రపంచాన్ని తన కళ్లతో చూడాలన్న కాళేశ్వరరావు సిద్ధాంతం బీఆర్‌ఎస్‌భవన్ వరకూ వర్తిస్తుంది గానీ, ఇతరులూ ఆయన కళ్లతో చూడాలంటే కుదరదుకదా?

స్టేట్‌మెంట్లు మార్చని వాడు పొలిటీషియన్ కాదు పొమ్మంటాడు గిరీశం కన్యాశులక్కంలో. గతంలో ఆధునిక గిరీశం కాళేశ్వరరావు ఒక సందర్భంలో చంద్రబాబునుద్దేశించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘అంటే చంద్రబాబుకు మోదీ నచ్చితే మనమంతా ఆయన వెనక నిలబడి మోదీకి జై కొట్టాలా? ఆయనకు నచ్చకపోతే మనం కూడా నై అనాలా? మొన్నటిదాకా మోదీ సంకలో కూర్చుంది ఎవరండి? చంద్రబాబు అంత డర్జీ పొలిటీషియన్ ఎవరూ లేరు’ అని వ్యాఖ్యానించారు.

గతంలో ఇదే మోదీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తే, ఆయన తరఫున కాళేశ్వరరావు సభలో వకాల్తా పుచ్చుకున్నారు. ప్రధానిని గౌరవించాలని ప్రవచించారు. ఆ తర్వాత ఇద్దరికీ చెడిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన మోదీని కలవకుండా ముఖం చాటేసి మంత్రి తలసానిని పంపించారు. మరి ధర్మప్రభువుల ప్రవచనాల ప్రకారం .. కాళేశ్వరరావు ఇప్పుడు చేస్తున్నదీ అదే కదా అన్నది బుద్ధిజీవుల ప్రశ్న. కాళేశ్వరరావులో ఒకసారి కృష్ణశాస్త్రి, చలం, శ్రీశ్రీ దర్శనమిస్తుంటారంతే!

ఇది ఫెడరల్ వ్యవస్థ అని గతంలో ఇదే గులాబీదళాలు గావుకేకలు పెట్టినట్లు గుర్తు. రాష్ట్రం కోసం మోదీని కలిస్తే తప్పేంటని ప్రవచించిన గులాబీదళాలు, ఇప్పుడు అదే పని రేవంత్ చేస్తే గావుకేకలు పెట్టడమే వింత. నిజానికి తెలంగాణకు వచ్చిన ప్రధానిని రేవంత్ నాలుగుగోడల మధ్య కలవలేదు. చెవులో గుసగుసలు పెట్టలేదు. రేవంత్ అన్నట్లు.. బాజాప్తా బహిరంగంగానే కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇచ్చారు.

ఇందులో తప్పుపట్టడానికి ఏముంది? ప్రధానిని ఒక సీఎం కలవడమే నేరమైతే.. గతంలో అలాంటి నేరాలు డజన్ల సార్లు చేసిన కాళేశ్వరరావుది కూడా నేరమేనా? అన్నది ప్రశ్న. గుజరాత్ మాదిరిగా తెలంగాణను అభివృద్ధి చేయాలని, విభజన సమస్యలు పరిష్కరించాలనే కదా రేవంత్ అడిగింది? అందులో నేరమేమిటో తెలివైన గులాబీదండు సెలవిస్తే మంచిది. గతంలో బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి కేటీఆర్ మోదీని కలసి దండం పెట్టి దండేసినప్పుడు.. కాళేశ్వరరావుగారి ముద్దుల తనయ కవిత తన పార్టీ పరివారంతో వెళ్లి, ప్రధానితో సెల్ఫీ తీసుకోవడం తప్పయితే.. ఇప్పుడు రేవంత్ చేసింది కూడా తప్పే! కాదంటారా?

ఒకవేళ యుపీఏ-ఎన్డీఏకు పొసగదు కాబట్టి.. ఓ వైపు మోదీపై కాంగ్రెస్ యుద్ధం చేస్తుంటే, కాంగ్రెస్ సీఎం రేవంత్ వెళ్లి మోదీని కలవడం ఏమిటన్న ‘అరతిక్కల’ తెలివితేటలు, గులాబీల ప్రశ్నలో ధ్వనిస్తే.. అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ప్రభుత్వాలు-పార్టీలు వేర్వేరు. అసలు మోదీని రేవంత్ కలిస్తే పెడబొబ్బలు పెట్టాల్సింది కమలదళాలు. గులాబీదళాలు కాదు! ఓవైపు తాము రేవంత్‌ను విమర్శిస్తుంటే, మరోవైపు మోదీ ఆయనతో ఎలా భేటీ అవుతారని ప్రశ్నించాల్సింది బీజేపీ నేతలు. కానీ వారికి బుద్ధి-బుర్ర, మెడపై తల ఉన్నందుకే.. వారిద్దరి భేటీని స్వాగతించారు. రేవంత్ ఇలాంటి సత్సంప్రాయాన్ని కొనసాగించాలని సూచించారు. కందకులేని దురద కత్తికెందుకు?

నిజంగా రేవంత్ ఒక పాలకుడిగా మాదిరిగానే వ్యవహరించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై పార్టీల ప్రభావం పడితే, ఎవరికి నష్టమో తెలియనంత అమాయకుడు కాదు రేవంత్. కేసీఆర్ పదేళ్లు అప్పులతో విధ్వంసం చేసిన ఖజానాను నింపడం మాట అటుంచి, కనీసం అందులో పావుశాతం నిధులు కూడా నింపడం రేవంత్‌కు కష్టమేనన్నది, మనం మనుషులం అన్నంత నిజం. ఈ పరిస్థితిలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తే, నష్టపోయేది రాష్ట్రమేనన్న సోయి రేవంత్‌కు ఉంది.

ఆరు హామీలకు నిధులు లేకపోతే పరువు పోయేది కాంగ్రెస్‌కే తప్ప రేవంత్‌కు కాదు. జనం రేవంతును చూసే కాంగ్రెస్‌ను గెలిపించినప్పటికీ, మూల్యం చెల్లించుకోవలసింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. మెడపై తల ఉన్న ఎవరైనా మోదీతో భేటీని, ఆ కోణంలోనే చూడాలి. పనులు చేయకపోతే ప్రశ్నిస్తామన్న రేవంత్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. కేంద్రానికి రాష్ట్రాల నుంచి వెళ్లే పన్నులనే, కేంద్రం తిరిగి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. అంటే మన సొమ్ము తీసుకుని, మళ్లీ మనకే ఇస్తోందన్నమాట. కాబట్టి ఇందులో దేబిరించడాలు ఏమీ ఉండవు.

హరీష్‌రావు సీనియరే కాదు. సీరియస్ నాయకుడు కూడా. అలాంటి నాయకుడు గత కొద్దిరోజుల నుంచి తెలంగాణలో ప్రజాస్వామ్యం-పత్రికాస్వామ్యం-పత్రికాస్వేచ్ఛ వంటి భారీ పదాలు వాడటం కామెడీ. పదేళ్ల కాళేశ్వరరావు పాలనలో ప్రజాస్వామ్యంతోపాటు పత్రికాస్వామ్యం జమిలిగా పరిఢవిల్లిందని, హరీష్ చెప్పిన గొప్పలకు నవ్వురాని వాడికి మనసులేనట్టే లెక్క. తెలంగాణలో పదేళ్లు ప్రజాస్వామ్యం తెగ వర్ధిల్లిందట. దానిని చూసి స్వేచ్ఛగా ఎగిరే పావురం కూడా సిగ్గుతో ఈర్ష్యపడిందట. గద్దర్ లాంటి వాళ్లు కాళేశ్వరరావు ప్రగతిభవన్‌కు, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సచివాలయానికి స్వేచ్ఛగా వెళ్లేవారట.

కాళేశ్వరరావు ప్రెస్‌మీట్‌లో జర్నలిస్టులు స్వేచ్ఛగా ప్రశ్నలడిగితే, ఆయన సగౌరవంగా సమాధానాలిచ్చేవారట. ధర్నాలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ కల్పించిన ఏకైక సర్కారు తమదేనట. ఇక జర్నలిస్టులు సచివాలయంలోకి ఇంటి అల్లుళ్ల లెక్క , ఏ ఫ్లోరుకైనా స్వేచ్ఛగా తెగతిరిగేవారట. అలాంటి స్వేచ్ఛను జర్నలిస్టులు తమ జీవితకాలంలో ఎప్పుడూ అనుభవించలేదట. అసలు నోబెల్‌పురస్కారం కాళేశ్వరరావు సర్కారుకు రావలసిందిగానీ కొద్దిలో మిస్సయిందట.

నిజమే. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే వారిని, పదడుగుల గొయ్యిలో పాతరేస్తామని ఇదే కాళేశ్వరరావు వరంగల్ గడ్డపై చెప్పినప్పుడు… తమను విమర్శించే జర్నలిస్టులకు స్థలాలు ఎందుకివ్వాలని ఇదే కాళేశ్వరరావు, మీడియా సాక్షిగా బెదిరించిన గులాబీ పాలనలో జర్నలిజం స్వేచ్ఛావాయువులతో పనిచేసింది. బహుశా సెక్రటేరియేట్‌లో జర్నలిస్టులు స్వేచ్ఛగా తిరిగింది.. కాళేశ్వరరావు సొంత మీడియా అన్నది హరీష్ కు తెలియకపోవడమే వింత.

రేవంత్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ముగ్గురు పక్కన ఉంటున్నారన్న బీఆర్‌ఎస్ విమర్శను తేలిగ్గా తీసుకోలేం. అంటే రేవంత్‌పై నమ్మకం లేకనే ముగ్గురిని ఢిల్లీకి పంపిస్తున్నారన్నది గులాబీదళాల కవి భావన. దీన్ని పూర్తిగా కొట్టిపారేయకూడదు. పైగా ఇవి జనాల్లో అనుమానం పెంచే వ్యాఖ్యలు. ఎందుకంటే గతంలో ఎంతోమంది కాంగ్రెస్ సీఎంలు ఢిల్లీకి ఒంటరిగానే వెళ్లేవారు. వెంట మంత్రులను తీసుకువెళ్లిన దాఖలాలు లేవు.

నిజానికి అలాంటి మంచి సంప్రదాయం ప్రవేశపెట్టినందుకు రేవంత్‌ను అభినందించాలి. వెంట ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కూడా రేవంత్ వెంట కనిపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ సంస్కృతికి భిన్నం. కానీ క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్టే ఆడాలి. ఫుట్‌బాల్ ఆడకూడదు. మనం ఉన్న కాలాన్ని కొలమానంగా తీసుకోవలసిందే. ఈ విమర్శలకు తె రదించాల్సిన బాధ్యత రేవంత్‌దే. ఎందుకంటే ఈ విమర్శలు ఆయన విశ్వసనీయతకు సంబంధించినది కాబట్టి!

సామాజిక న్యాయం.. సామాజిక తెలంగాణ వంటి నినాదాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు దానికి సరైన నిర్వచనం ఇవ్వడం లేదన్నది ఆ పార్టీ సీనియర్ల వ్యాఖ్య. ప్రధాన పదవులు, టికెట్లు రెడ్డి వర్గానికే దక్కుతున్నాయన్న అసంతృప్తిని కొట్టివేయలేం. రేవంత్ ప్రతి ప్రకటనలో సింహభాగం రెడ్ల పేర్లే వినిపిస్తుండటం, పార్టీకి మంచిదికాదన్నది సీనియర్ల సలహా. నిధుల దుబారా గురించి ఇప్పటికి చాలాసార్లు వాపోయిన రేవంత్, సర్కారుపై భారం పడే అవసరం లేని నియామకాలు చేస్తున్నారన్న అభిప్రాయం, సామాన్య-మధ్యతరగతి-మేధావి వర్గాల్లో మొదలయింది. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రానికి ఇలాంటి అనవసర నియామకాలు అవసరమా? లక్షల జీతాలు, కార్లు, ప్రభుత్వ భవనాలు ఎవరికి మేలు చేస్తాయి?

గతంలో సలహాదారుల నియామకాలపై విమర్శలు ఎక్కుపెట్టిన రేవంత్, ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటి? అసలు అప్పులపాలైన రాష్ట్రానికి సలహాదారులు ఎందుకు? పోనీ వారేమైనా ఏ రంగాల్లోనయినా నిష్ణాతులా అంటే అదీకాదు.తనతో ఉన్న వారికి న్యాయం చేయడంలో తప్పులేదు. అది నాయకుడి లక్షణం కూడా.

కానీ వారికి ఖజానా నుంచి జీతాలు, భత్యాలివ్వడం వెక్కిరిస్తున్న ఖజానాపై అదనపు భారమే కదా? రేవంత్ వ్యవహారం కోడలిని తిట్టిన అత్త తెడ్డునాకిందన్న సామెతలా ఉందన్నది ఆయన అభిమానుల ఆవేదన. ఆ ప్రకారంగా గతంలో కాళేశ్వరరావు చేసిన నియామకాలు తప్పయితే, ఇప్పుడు రేవంత్ చేస్తున్నదీ తప్పే కదా?

Leave a Reply