Suryaa.co.in

Andhra Pradesh

చేసిందేమీ లేక చంద్రబాబుపై జగన్ అవాకులు, చవాకులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకు ఏం చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. కుప్పం ప్రజలు చంద్రబాబును 35 ఏళ్లు ఓట్లువేసి గెలిపించారంటే ఎంత అభివృద్ధి చేశారన్నది అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యక్తికి, ఆయన వయసుకు కూడా కనీస గౌరవం ఇవ్వకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి కుప్పం పర్యటనలో మాట్లాటడం సబబుకాదు. టీడీపీ హయాంలోనే కుప్పం ప్రాంతానికి నీళ్లు వచ్చే విధంగా 90 శాతం హంద్రీ-నీవా పనులు పూర్తిచేశారు. మిగిలిన పదిశాతం పనులు పూర్తి చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది.

కుప్పంకే కాదు.. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నాడు ఎమ్మెల్సీగా ఉన్న సతీష్ రెడ్డి పులివెందులకు నీళ్లిస్తేనే గడ్డం తీస్తానని శపధం చేసి.. నీళ్లు ఇచ్చిన తర్వాత కృతజ్ఞతగా చంద్రబాబు కాళ్లుమొక్కారు. వైఎస్ఆర్‍, జగన్ చేయలేని పని చంద్రబాబు చేశారని బహిరంగసభలో సతీష్ రెడ్డి ఆనాడు చెప్పారు. పులివెందులకు నీళ్లు ఎవరిచ్చారో సతీష్ రెడ్డిని అడిగి తెలుసుకోండి. ఈరోజు ముఖ్యమంత్రి కుప్పం వెళ్లి చంద్రబాబుపై అవాకులు, చవాకులు మాట్లాడటం సిగ్గుచేటు.

హత్యారాజకీయాలు చేస్తున్నది జగన్ రెడ్డే.. వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిలెవరో ప్రజలకు తెలుసు. తల్లి, చెల్లి ఈరోజు జగన్ గురించి ఎందుకు అసహ్యంగా మాట్లాడుతున్నారు? వివేకా కుమార్తె వైఎస్ సునీత జగన్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి. షర్మిల జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానం గురించి పబ్లిక్‍గా మాట్లాడుతున్నారు. ఎవరు.. ఎలాంటివాళ్లో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేశారు.

క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, స్విమ్స్, పద్మావతి మహిళా యూనివర్సిటీ, అరవింద ఐ ఇనిస్టిట్యూట్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను చంద్రబాబునాయుడు జిల్లాకు తెచ్చారు. మీరు కడప జిల్లాకు చేసిన ఒక్క అభివృద్ధి పనిని చెప్పగలరా? సొంత చిన్నాయన హత్య కేసును ఐదేళ్లుగా తేల్చలేకపోయారు. మీ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు కుప్పం వచ్చి చంద్రబాబుపై నిందలేస్తున్నారు. వైసీపీ హయాంలో పీలేరు నియోజకవర్గానికి గానీ, చిత్తూరు జిల్లాకు గాని మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ చేసిందేమీ లేదు. మదనపల్లి-చిత్తూరు హైవే 2017లో మంజూరైంది.

పీలేరు, కలికిరి, వాయులపాడులో వంద పడకల ఆస్పత్రులు టీడీపీ హయాంలో మంజూరయ్యాయి. హంద్రీనీవా ద్వారా పీలేరు నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు నీరిచ్చే అడవిపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్, చంద్రబాబు హయాంలో పూర్తిచేశారు. అడవిపల్లి ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన సీఎం జగన్‍కు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదు. సంక్షేమంపై సీఎం జగన్‍కు, మంత్రి పెద్దిరెడ్డికి అంత నమ్మకముంటే ఈరోజు చీరలు, బట్టలు ఇచ్చి సభకు రప్పించాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ప్రజల రక్తం తాగి వేలకోట్ల రూపాయలు లూటీ చేశారు. ఇసుక, మైన్స్, భూములు, మద్యం పేరుతో దోచుకొని ఆ డబ్బుతో ఇప్పుడు చీరలు, బట్టలు పంచుతున్నారు. వీటన్నింటిని గమనించిన ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మద్యపాన నిషేధం విధించాకే ఓట్లు అడుగుతానని ఎన్నికల ముందు జగన్ చెప్పారు.

ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీల భాగస్వామ్యంతో నాశిరకం మద్యం తయారు చేసే డిస్టిలరీలు నడుపుతున్నారు. జే బ్రాండ్ల మద్యం తాగి వేలాదిమంది చనిపోయారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అటువంటి జగన్ మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు.

LEAVE A RESPONSE