-నడిరోడ్డుపై కన్నతల్లి ఒడిలో చెల్లి మృతి చెందటం కలిచి వేసింది
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన
జగన్ మోసపు రెడ్డి మాటలు అందాల సుమిత్రని తిరిగి తీసుకురాగలవా? ముఖ్యమంత్రి కపట ప్రకటనలు గిరిజన విద్యార్థినికి ప్రాణం పోయగలవా? అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీఎంని ప్రశ్నించారు.
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ఆశ్రమపాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుమిత్ర నడిరోడ్డుపై కన్నతల్లి ఒడిలోనే మృతి చెందిందనే సమాచారం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ నిద్రావస్థలో వున్నాయని,దీనికి నడిరోడ్డుపై, నిస్సహాయంగా
కన్నతల్లి ఒడిలోనే ప్రాణాలు వదిలిన పదవ తరగతి గిరిజన విద్యార్థిని అందాల సుమిత్ర విషాదాంతమే సాక్ష్యమని పేర్కొన్నారు.
ఈ ప్రశ్నలకి బదులేది?
మారేడుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చావడికోట పంచాయతీ చెక్కవాడ గ్రామానికి చెందిన అందాల సుమిత్రకి జ్వరం వస్తే కనీస వైద్యం చేయించకుండా ఇంటికి పంపించేసిన ఆశ్రమపాఠశాల సిబ్బందిని ఏమనాలి? అని ప్రశ్నించారు.
బోదలూరు పీహెచ్సీ నుంచి మారేడుమిల్లి, అక్కడి నుంచి రంపచోడవరం, అక్కడి నుంచి రాజమండ్రి…ఆ తరువాత కాకినాడ ప్రభుత్వ వైద్యశాలలకు తరలించి మెరుగైన వైద్యం చేయకుండా, నయం కాకుండానే ఇంటికి పంపేసిన ప్రభుత్వ ఆస్పత్రులు తీరు ఘోరంగా వుందని మండిపడ్డారు.
ఏం చేయాలో పాలుపోని స్థితిలో మారేడుమిల్లి నుంచి చెక్కవాడ వెళ్లేందుకు నిరీక్షిస్తూ, తల్లి ఒడిలోనే కన్నుమూసిన సుమిత్ర బంగారు భవిష్యత్తుని చిదిమేసింది ఈ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు.
బంగారు భవిష్యత్తుని చిదిమేసింది వార్డు సచివాలయ, గిరిజసంక్షేమ విద్యా, వైద్యశాఖలది కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయ్యా ముఖ్యమంత్రి గారూ! మీరు నాడు- నేడులో పాఠశాలలో కల్పించిన సౌకర్యాలు, సదుపాయాలు ఏవీ?
ఆశ్రమ పాఠశాలల్లో పిల్లల్ని మేనమామగా కాపాడటానికి పెట్టిన సిబ్బంది ఏమయ్యారు? అని ప్రశ్నించారు.
ఏ రోగానికైనా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అంటూ మీరు చేసిన ప్రకటనలు బోదలూరు పీహెచ్సీ నుంచి కాకినాడ జనరల్ ఆస్పత్రి వరకూ ఎక్కడా సుమిత్ర ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నించలేదు ఎందుకంటూ నిలదీశారు.
అన్ని సేవలూ డోర్ డెలివరీ చేస్తాడని మీరు పెట్టిన వాలంటీర్ ఎక్కడికి పోయాడని, వార్డు సచివాలయంలో హెల్త్ సెక్రటరీకి సుమిత్ర అనారోగ్యం సంగతి ఎందుకు తెలియలేదని మండిపడ్డారు.
మీరు జెండా ఊపిన 104 వైద్య పరీక్షల వాహనాలు సుమిత్ర పల్లె వైపే ఎందుకు వెళ్లలేకపోయాయి?
చివరికి సుమిత్ర చనిపోతే..మృతదేహాన్ని తరలించేందుకు మీరు రంగులు మార్చి ఆరంభించిన అంబులెన్సూ అందుబాటులోకి రాలేదు? అనేది సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇది ఒక్క సుమిత్ర ఆత్మఘోష కాదు…గిరిపుత్రుల గుండె ఘోష..రాష్ట్ర ప్రజల ఆక్రందన…
ఈ ప్రశ్నలకి సమాధానం ఇచ్చే దమ్ము నీ సర్కారుకి ఉందా? అని ప్రశ్నించారు.
151 సీట్లు, 49 శాతం ఓట్లు వచ్చాయని సంబరం కాదు…ప్రజల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం ఎందుకు?
నడిరోడ్డుపై అభాగ్యుల్లా గిరిబిడ్డలు ప్రాణాలు విడుస్తుంటే…ఇక్కడ ప్రజాప్రభుత్వం ఉందని అంటే ఎవరైనా నమ్మగలరా? అంటూ నారా లోకేష్ ఆ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.