– హిట్లర్ అహంకారం, గోబెల్స్ అబద్దం కలబోస్తే నరేంద్ర మోడీ
– క్రికెట్ అనుభవం లేని అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యాడు?
– అనురాగ్ ఠాకూర్, దేవేంద్ర ఫడ్నవీస్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, పంకజ్ సింగ్, పూనమ్ మహాజన్, ప్రీతమ్ ముండే, తదితరులు వంశ పారంపర్య రాజకీయాల నుండి వచ్చినవారు కాదా?
– కర్ణాటకలో JDS, మహారాష్ట్రలో NCP అజిత్ పవార్‌తో, BJP ఎందుకు చేతులు కలిపింది?
– ఫ్యాక్ట్ చెకర్ అనే న్యూస్ పోర్టల్, 43 ముఖ్యమైన జాతీయ ప్రాముఖ్యత కలిగిన సందర్భాల్లో ప్రధాని మోదీ అబద్ధం చెప్పారని నిరూపించింది
– ఏపీ పునర్వ్యవస్థీకరణ సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారు?
-బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్
“నియంత హిట్లర్, బూటకపు ప్రచారాల గోబెల్స్ ఆత్మలు ప్రధాని నరేంద్ర మోదీని ఆవహించాయి. ఆ అహంకారం, విద్వేషంతోనే ప్రధాని మోదీ బీఆర్ఎస్ పై విషం కక్కారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ బూటకపు, ద్వేషపూరిత ప్రచారాలకు గురికాకుండా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి”: బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత నీచంగా, దిగజారి మాట్లాడుతున్నారని, పూర్తిగా అబద్ధాలకోరుగా మారారని ప్రధాని నరేంద్ర మోదీపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ మద్దత్తు కోరుతూ సీఎం కేసీఆర్ తనను అభ్యర్థించారని, ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, బీఆర్‌ఎస్‌కు బీజేపీ పొత్తు అవసరం లేదని, సాక్ష్యాలతో డాక్టర్ శ్రవణ్ వివరించారు. అనేక ముఖ్యమైన అంశాలు, సమస్యలపై ప్రధాని అబద్ధాలు చెప్పడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన డాక్టర్ శ్రవణ్, నరేంద్ర మోదీ ‘లైయేంద్ర మోదీ’గా మారారని దుయ్యబట్టారు.
“ప్రధానమంత్రి మోడీ పచ్చి అబద్ధాలకోరుగా మారడం దురదృష్టకరం. GHMC ఎన్నికల సమయంలో కేసీఆర్ BJP మద్దతును అభ్యర్థించారని ఆయన పేర్కొన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. GHMC ఎన్నికల్లో BRS 56 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకోగా, మా మిత్రపక్షం AIMIM 44 గెలుచుకుంది. మరోవైపు బీజేపీ గెలిచింది కేవలం 48 సీట్లు. బీఆర్‌ఎస్‌కు ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కూడా ఉంది. బీఆర్‌ఎస్ సొంతంగా మేయర్‌ని ఎన్నుకునేంత బలం ఉన్నపుడు, కేసీఆర్ వెళ్లి ప్రధాని మోదీని ఎందుకు అభ్యర్థిస్తారు?
ఉర్దూలో ‘నకల్ భీ అకల్ సే మర్నా’ అనే సామెత ఉంది. అంటే అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి. ఇంత పచ్చి అబద్ధంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పట్టుబడ్డారు,” అని డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసి తన మాటలు నిజమని నిరూపించుకోవాలని, ప్రధాని మోదీకి డాక్టర్ శ్రవణ్ సవాల్ విసిరారు.
“ప్రధాని మోడీ ‘పరివార్ వాద్’ గురించి మాట్లాడారు. బీజేపీ నిజంగా వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకమైతే, ఏ మాత్రం క్రికెట్ అనుభవం లేని అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యాడు? బీజేపీ పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్న అనురాగ్ ఠాకూర్, దేవేంద్ర ఫడ్నవీస్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, పంకజ్ సింగ్, పూనమ్ మహాజన్, ప్రీతమ్ ముండే, తదితరులు వంశ పారంపర్య రాజకీయాల నుండి వచ్చినవారు కాదా?
ప్రధాని మోడీ వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకమైతే, కర్ణాటకలో JDS, మహారాష్ట్రలో NCP అజిత్ పవార్‌తో, BJP ఎందుకు చేతులు కలిపింది? గతంలో శిరోమణి అకాలీదళ్, టీడీపీతో బీజేపీ పొత్తు ఎందుకు పెట్టుకుంది? ప్రధాని స్థాయి వ్యక్తి వాస్తవాలు మరిచి మాట్లాడడం దురదృష్టకరం. ఇతర రాజకీయ వారసుల్లా కాకుండ, కేటీఆర్, కవితలు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుని, ప్రజల పక్షాన పోరాడి, తెలంగాణ ప్రజలచే ఎన్నుకోబడ్డారు. వారికి ప్రజల ఆమోదం, ఆశీర్వాదాలు ఉన్నాయి,” అని డాక్టర్ శ్రవణ్ ప్రధాని మోదీ ‘పరివార్వాద్’ ఆరోపణలను తిప్పికొట్టారు.
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసి తన మాటలు నిజమని నిరూపించుకోవాలని, ప్రధాని మోదీకి డాక్టర్ శ్రవణ్ సవాల్ విసిరారు. “మన ప్రధాని అబద్ధాలకోరు అని నిరూపించడం బాధాకరం. తన విద్యార్హత గురించి అబద్ధాలు చెబుతాడు, వృత్తి గురించి అబద్ధాలు చెబుతాడు, తన ప్రయాణాల గురించి అబద్ధాలు చెబుతాడు. ప్రతి విషయం లో అబద్ధాలు చెప్తాడు. ఇది కేవలం ప్రధాని మోదీకే కాదు మొత్తం 140 కోట్ల భారతీయలకు అవమానం.
తెలంగాణా ఏర్పాటు మరియు అభివృద్ధి కోసం తన జీవితాన్నిఅంకితం చేసిన సీఎం కేసీఆర్ వంటి దార్శనికత, కష్టపడి పనిచేసే నాయకుడి ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రధాని మోదీ చెప్పిన అబద్ధాలను బట్టబయలు చేయవలసిన బాధ్యత నాపై ఉంది. ఫ్యాక్ట్ చెకర్ అనే న్యూస్ పోర్టల్, 43 ముఖ్యమైన జాతీయ ప్రాముఖ్యత కలిగిన సందర్భాల్లో ప్రధాని మోదీ అబద్ధం చెప్పారని నిరూపించింది. ప్రఖ్యాత వార్తా సంస్థ ది ప్రింట్ ప్రధాని మోదీ అబద్ధాల నుండి ఎలా తప్పించుకుంటారనే దాని గురించి సవివరమైన కథనాన్ని అందించింది. దాదాపు అన్ని ప్రధాన జాతీయ మరియు అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రధాని మోదీ అబద్ధాలను డాక్యుమెంట్ చేశాయి.
పినారయి విజయన్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ వంటి శక్తివంతమైన నేతలు, సీఎంలు కూడా గతంలో ప్రధాని అబద్ధాలను బయటపెట్టారు. ఈ పరిణామాలన్నీ చూస్తే, నరేంద్ర మోదీ ‘లైయేంద్ర’ మోడీగా మారారు అనిపిస్తోంది,” అని డాక్టర్ శ్రవణ్ ఎద్దేవా చేసారు.
క్రూరమైన నియంత హిట్లర్, బూటకపు ప్రచారాల గోబెల్స్ ఆత్మలు ప్రధాని నరేంద్ర మోదీని ఆవహించాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ బూటకపు, ద్వేషపూరిత ప్రచారాలకు గురికాకుండా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ శ్రవణ్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
“తెలంగాణకు మేలు చేస్తున్నట్లుగా నిజామాబాద్‌లో పసుపు బోర్డును ప్రధాని మోదీ ప్రకటించారు. ట్రైబల్ యూనివర్శిటీని కూడా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ 10 ఏళ్లలో ఏం చేస్తున్నారు? ఏపీ పునర్వ్యవస్థీకరణ సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారు? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారు? అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ప్రజల కళ్లు గప్పే ప్రకటనలు చేసి, నిరాధార ఆరోపణలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారు. తెలంగాణ ప్రజలు త్వరలోనే బీజేపీకి గుణపాఠం చెబుతారు,” అని డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.