భద్రత..ఏదీ నిబద్ధత?

ఓ కార్మికుడా..

నీ కష్టం చూడని
యాజమాన్యం..
నీ రక్తం పీల్చే జలగే..

నీ చెమట తడి
తెలియని బాసు..
జీవం ఉండని దినుసు..

నీ భద్రత మరిచే కర్మాగారం
విఐపి గదుల్లో నేరస్థులు కొలువుండే కారాగారం..!

నీ బ్రతుకు
ఎప్పటికీ దుర్భరం..
నువ్వు ఖాకీ దుస్తులు
ధరించిన యంత్రం..
నీ వెనక నిత్యం కుతంత్రమే..
పచ్చనోట్ల దొంతర్లపై
చలువ గదుల్లో కూర్చునే
కష్టం ఎరుగని మనిషి
బిరుదు బాసు…
ఒళ్లు పేలిపోయే వేడిలో..
నిప్పుల కొలిమిలో..
గనిలో..కార్ఖానాలో
పగలనక రేయనక
శ్రమించే నువ్వు లేబర్..
ఆ వృత్తి లగ్జరీ..
నీ పని చాకిరీ..
యంత్రాల మొహమే చూడని
బడాబాబులకు ఇన్సూరెన్స్..
నీ ప్రాణాలతో
చెలగాటమాడేందుకు లైసెన్స్
మరి..దినామంతా
దగా పడుతూ
పేనాలు ఫణంగా పెట్టి
పని చేసే నీకు
ఏదీ రక్షణ..
తగిన శిక్షణ..
నీ బతుక్కో భరోసా..
నీ కుటుంబానికి కులాసా!

ఉందిలే మంచీకాలం ముందుముందూనా..
సొతంత్రం ఒచ్చినస్పటి నుంచి వింటున్న మాట..
సినిమా పాట..
నిజమైంది లేదు..
సోషలిజం..కమ్యూనిజం.. మావోయిజం..
దేనితోనూ కాలేదు
నీ కల నిజం..
అప్పుడూ ఇప్పుడూ
గెలుస్తున్నది పెత్తందారిజం
ఎప్పుడూ పాలకులది
పెట్టుబడిదారులకు గులామనే నైజం..!

నీ క్షేమం..సంక్షేమం..
నీ భద్రత..నీ బాధ్యత..
వీటి కోసం చేసే చట్టాలు
పెద్దోళ్ళ చుట్టాలు..
నీ చుట్టూ ఎప్పుడూ
ప్రమాదాల ఘట్టాలు..
రోజూ ఎక్కడో ఒక దగ్గర
ప్రమాద ఘటనలు..
నిన్ను మింగేసే దుర్ఘటనలు..
న్యాయం కోసం పోరాడే
నీపైనే పదఘట్టనలు..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply