Suryaa.co.in

Political News

మోడీ పనితీరుకు నవీన్ పట్నాయక్ మార్కులు

– 8/10 ఇచ్చిన ఒడిశా సీఎం

మనకు శతృవైనా.. మంచిపని చేస్తే ప్రశంసించాలి. ఒకవేళ అతడు పై స్థాయికి ఎదిగితే కచ్చితంగా అభినందించాల్సిందే. సగటు మనిషి యొక్క ఆలోచనా విధానం ఇలాగే ఉండాలి. అలాంటప్పుడే.. ఎదిగిన అతడు, మెచ్చుకున్న ఇతడూ.. ఇద్దరూ గొప్పవాళ్లవుతారు.

ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పనితీరును వేనోళ్ల పొగిడారు. వాస్తవానికి వాళ్లిద్దరూ శతృవులేం కాదు. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. కానీ.. ప్రధాని మోడీ పనితీరును చూసి నవీన్ పట్నాయక్ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, మోడీ అవలంభిస్తున్న విధానాలపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించారు.

నవీన్ పట్నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందంటూ ఏమీ లేదు. దేశంలోనే అతి ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన రికార్డ్ ఆయన సొంతం. అది ఏ పార్టీ అయినా.. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో అయినా.. సరిహద్దు రాష్ట్రాలతో అయినా ఎలాంటి విభేదాలు లేకుండా పాలన చేస్తున్న ఏకైక సీఎంగా ఖ్యాతికెక్కారు. ఇక అటు రాష్ట్రంలోనూ, ఇటు దేశంలోనూ ఆయనకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. పెద్దగా న్యూస్ లో లేకపోయినా.. దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఆయనే నెంబర్ వన్. అలాంటి వ్యక్తి.. ప్రధానమంత్రి మోడీని ప్రశంసలతో ముంచెత్తారు.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ నిర్వహించిన ఒడిశా లిటరేచర్ ఫెస్టివల్‌లో.. ఇంటరాక్టివ్ సెషన్‌లో సీఎం నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. వివిధ రంగాల్లో మోడీ పనితీరుకు తాను 10 మార్కులకు గానూ.. 8 మార్కులు వేస్తున్నట్లుగా చెప్పారు. అంతేకాదు.. ఇటీవల దేశం గర్వించదగ్గ పరిణామాలపై ఆయన వివరిస్తూ.. ప్రతీ అంశాన్ని స్పృశించారు. ప్రధాని మోడీ విదేశాంగ విధానంతో పాటు దేశంలో అవినీతి నిర్మూలనలో మంచి పనితీరు కనబరుస్తున్నారని అన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.

ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ.. తమ పార్టీ ఎప్పుడూ మహిళా సాధికారతకు మద్దతు ఇస్తుందన్నారు. తమ తండ్రి, మాజీ సీఎం బిజూ పట్నాయక్ హయాంలో పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ శాతాన్ని 50 కి పెంచామని వివరించారు. ఇక కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మాట్లాడుతూ.. కేంద్రంలో తమకు సత్సంబంధాలున్నాయని, సహజంగానే మన రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నామని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం భాగస్వామి కావడమే ముఖ్యమని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఒడిశా ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తుందని వివరించారు.

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE