Suryaa.co.in

Features

నియో కోవ్ అనేది కొత్త వైరస్ కాదు..నేటి సమాజపు కొత్త పోకడ

– ప్రజల విపరీత మనస్తత్వానికి సూచిక

ఇది గబ్బిలాల్లో వుంది. మనుషులకు సోకలేదు. సోకవచ్చు అనేది wuhan శాస్త్రవేత్త ఊహ మాత్రమే. ఈ అధ్యయనం పీర్ రివ్యూ కాలేదు. కేవలం మైక్రోస్కోప్ కింద చూసి వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పలేము. ఓమిక్రాన్ ను చూసి వామ్మో ఇన్ని మ్యుటేషన్ లా ? ఇది సోకితే అంతే సంగతులు అన్నారు. చివరకు ఏమి జరిగింది?

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు క్లిక్ జర్నలిజం నడుస్తోంది. కొలంబియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం లో తేలింది ఏమిటంటే హెడ్డింగ్ ఎంత నెగటివ్ గా ఉంటే ప్రజలు అంతగా వాటి వైపు ఆకర్షితులు అవుతారు. కేవలం హెడ్డింగ్ మాత్రం చదివి దాన్ని షేర్ చేసేస్తారు. వెబ్ సైట్ కు వ్యూస్ వస్తాయి.

Neo-కోవ్ పై నిన్నటి ది ఒక శాస్త్రవేత్త ప్రతిపాదన మాత్రమే. గతం లో ఎన్నో వందల సార్లు ఎన్నో వందల వైరస్ ల గురించి ఇలాంటి అద్యయనాలు జరిగాయి. “గబ్బిలాల్లోని వైరస్ పై అధ్యయనం “అని హెడ్డింగ్ ఉంటే నిన్నటి వార్తను ఎవడూ పట్టించుకొనే వాడు కాదు. “ముగ్గురిలో ఒకడు చస్తాడు “ అనేటప్పటికీ అది వైరల్ అయ్యింది. దేశ వ్యాప్తంగా కొన్ని వేల వెబ్సైట్ కొన్ని కోట్ల షేర్ లు .. నెట్ బిజినెస్ కు ఇదే మూలం. ఏదో ఒక సంచలనం కావలి. దాన్ని అందరూ తెగ షేర్ చేసుకోవాలి. వ్యూస్ పెరగాలి. ఒక ఊహాజనిత వార్త కు ఇంత ప్రచారం , ఇన్ని కోట్ల వ్యూస్ వచ్చాయి అంటే ఇది , సమాజపు కొత్త పోకడను తెలియచేస్తుంది. జర్నలిజం కు పట్టిన చీడను ఇది ఎత్తిచూపుతుంది.

కాకి నల్లగా ఉందంటే అది వార్త యెట్లా అవుతుంది ? తెల్ల కాకి .. గాడిద ఎగిరింది అనేది హాట్ న్యూస్ అనేది నిన్నటి స్థితి. బూతులు , చంపేస్తా , నరికేస్తా , కొరికేస్తా , చచ్చి పోతారు , ఎవడూ మిగలడు, శవాల గుట్టలు , రక్తపు సముద్రాలూ , చేతబడులు , నరమాంస భక్షణ , స్మగ్లర్ ల జీవితాలు , పీక కొయ్యడాలు.. ఇప్పుడు ట్రెండ్. కొత్త పోకడ .

రాజకీయాల మొదలు కొని సినిమాల దాకా ఇదే పధ్ధతి. వీటినే జనాలు చూస్తారు. క్లిక్ చేస్తారు. షేర్ చేస్తారు. వీటి గురించే మాట్లాడుకొంటారు. ప్రజలు తాము ఏమి కోరితే అదే దొరుకుతుంది. అదే బిజినెస్ కు … కొత్త రకం బిజినెస్ కు మూల సూత్రం.

నియో కోవ్ అనేది కొత్త వైరస్ కాదు. నేటి సమాజపు కొత్త పోకడ. ప్రజల విపరీత మనస్తత్వానికి సూచిక.
నెగటివ్ ఆలోచనలతో నెగటివ్ న్యూస్ తో నెగటివ్ దృశ్యాలతో బ్రెయిన్ ను బాంబర్డ్ చేస్తే రోగాలు వస్తాయి. ఇమ్మ్యూనిటి నాశనం అయిపోతుంది. స్ట్రెస్ పెరుగుతుంది. బ్లడ్ లో క్లోట్స్ వస్తాయి. గుండెపోటు , మెదడు పోటు ఎక్కువయి పోతాయి.మేలుకోండి.

వినదగు నెవ్వరు చెప్పిన , వినినంతనే వేగపడక వివరింప తగున్.. ఇంగిత జ్ఞానం వాడాలి. హెడ్డింగ్ చూసి షేర్ చెయ్యడం కాదు. ఆలోచించాలి. సంచలనం కోసం వెదుకు లాడకు . అదొక perversion. అదొక మెంటల్ డిసార్డర్.
ఒక పెగ్.. నెల దాటితే రెండు పెగ్ లు .. సంవత్సరానికి హాఫ్ బాటిల్ దిగితే కానీ కిక్ ఎక్కదు. ఇదీ అంతే. హింస .. బూతు .. భయం ఇవన్నీ dosage లు దాటేశాయి. నిజజీవితం లోకి ప్రవేశించేశాయి.
నేరాలు ఘోరాలు దాటి అఘోరాల వైపు సమాజ పయనం.
సెన్షేషన్ దశ దాటి అందరి చావు వైపు గా మ్యుటేట్ అయిన జర్నలిజం.
నేటి నెట్ ప్రపంచం .. అథోజగత్తుకు షార్ట్ కట్ !
ముందు మీరు మారండి. నెగటివ్ మాటల్ని దృశ్యాలను సినిమా ల ను , భయపెట్టే వార్తలను బహిష్కరించండి. వాటిని చూడొద్దు. వాటి గురించి మాట్లాడొద్దు. వినొద్దు. ఇదే నేటి సమాజానికి కావలసిన మూడు కొత్త కోతులు.
ధర్మో రక్షతి రక్షితః .. ధర్మం అంటే సమాజ హితం. దాన్ని చూడండి. అంటే మంచినే చూద్దాము. మంచి మాటలే మాట్లాడుదాము . మంచినే విందాము. పాజిటివ్ ఆలోచనలు నేడు అందరికీ అవసరం.
సర్వేజనా సుఖినోభవంతు

– వాసిరెడ్డి అమర్నాథ్

LEAVE A RESPONSE