వైసీపీపై ఇంట్రెస్ట్‌ లేదు

– టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ
– క్లారిటీ ఇచ్చిన కుమారుడు గిరిబాబు

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలుగుదశం పార్టీ లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. బుధవారం రోజు ముద్రగడతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్‌ చర్చలు జరిపితే.. ఈ రోజు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ.. ముద్రగడతో సమావేశం అయ్యారు. ఇక, కలిసి పనిచేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు కూడా ఇచ్చారు. అంతేకాదు.. రెండు, మూడు రోజుల్లో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం కూడా సాగుతోన్న తరుణంలో.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి బాబు.. టీడీపీ, జనసేన ఏ పార్టీలోకి అయినా వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లడానికి నాన్న (ముద్రగడ పద్మనాభం) ఇంట్రెస్ట్ చూపడం లేదన్నారు ముద్రగడ గిరిబాబు.. నాన్న, నేను.. ఇద్దరం పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాం, ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురంలో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందని తన మనసులో మాట బయటపెట్టిన ఆయన.. మరిన్ని చర్చలు జరుగుతాయన్నారు.

గతంలోనే చెప్పినట్టు ఈసారి కచ్చితంగా పోటీలో ఉంటాం.. త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. అన్నింటికి సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం.. టీడీపీ లేదా జనసేనలో చేరడం.. పోటీ చేయడం ఖాయం అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు ముద్రగడ గిరిబాబు.

Leave a Reply