ఖజానాలో డబ్బు లేకనే పంపిణీ చేయలేదు

-వృద్ధుల పెన్షన్లతో రాజకీయం నీతిమాలిన చర్య
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
-జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఖాయం: జి.వి.ఆంజనేయులు

వృద్ధుల పెన్షన్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని చూడటం జగన్‌ మానుకోవాలని, ఇది నీతిమాలిన చర్య అని మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, ఎమ్మెల్సీ చిరంజీవి తదిదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అవాస్తవాలు, అబద్ధాలతో 2019లో గద్దె నెక్కిన జగన్‌ ఇప్పుడు 2024లో మళ్లీ అవే అబద్ధాలు, మోసాలతో మళ్లీ అధికారం దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

అందులో భాగంగానే పెన్షన్ల పంపిణీ ని టీడీపీ అడ్డుకుందని దుష్ప్రచారం చేస్తోందని, కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విజ్ఞులు కాబట్టి అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకున్నారన్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వరాదని ఎన్నికల కమిషన్‌ చెబితే సచివాలయం, ఇతర వ్యవస్థలతో పంపిణీ చేయాలి కానీ ఇవ్వట్లేదన్నారు. ఇందుకు కారణం ఖజానా ఖాళీ అవడమే అసలు విషయమన్నారు. అసలు ఇంతవరకు పెన్షన్‌ అకౌంట్‌లో డబ్బులు ఎందుకు వెయ్యలేదో సమాధానం చెప్పాల న్నారు.

జి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ జగన్‌ కల్లబొల్లి కబుర్లు చెప్పడం మానేసి ముందు పెన్షన్లను ఇళ్ల దగ్గరే పంపిణీ చేయించాలని డిమాండ్‌ కోరారు. వాలంటీర్లు 98 శాతం వైసీపీ ఏజంట్లు కాబట్టి ఈసీ గుర్తించి వారిని పెన్షన్ల పంపిణీకి దూరం ఉంచిందని హితవుపలికారు. అయితే జగన్‌ పంచాయతీ కార్యదర్శులను, వీఆర్వో, సచివాలయ సిబ్బందిని వినియోగించి ఎప్పటిలాగే పెన్షన్ల పంపిణీ చేయవచ్చని, అలా చేయకుండా టీడీపీపై దుష్ప్రచారం చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. 200 ఉన్న పెన్షన్‌ను చంద్రబాబు పది రెట్లు పెంచి 2000 చేశారన్నారు. రేపు అధికారంలోకి రాగానే 4 వేలకు పెంచుతారని చెప్పారు. అలాగే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్‌ ఇవ్వను న్నట్లు తెలిపారు. మరోవైపు నమ్మిన వాళ్లందరి గొంతుకోసిన జగన్‌ను రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిరచి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.

ఎమ్మెల్సీ చిరంజీవి మాట్లాడుతూ జగన్‌ పదేపదే అబద్ధాలు చెబుతూ పింఛన్లు ఎగ్గొడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. వాలంటీర్లకు ధీటుగా లక్షా 25 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఉన్నా పంపిణీ చేయించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు పంపిణీ చేయడానికి ఖజానా డబ్బులేదనే విషయాన్ని ఒప్పుకోకుండా ఏదేదో మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు హయాంలో పెన్షన్లు వరుసగా రెండు నెలలు తీసుకోకున్నా తరువాత నెల వాటిని కలిపి ఇచ్చేవారని ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అందుకే ప్రజలు హేతుబద్దంగా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్టీ నేత దారూ నాయక్‌ తదిదరులు పాల్గొన్నారు.

Leave a Reply