Suryaa.co.in

Andhra Pradesh

డిసెంబర్ 5న సాగునీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్

– రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు కొత్త షెడ్యూలు సిద్ధం

విజయవాడ: రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు కొత్త షెడ్యూలును సిద్ధం చేశారు. శాసనసభ సమావేశాలు జరుగుతుండటంతో గతంలో అనుకున్న షెడ్యూలు వాయిదాపడింది. తాజాగా డిసెంబరు 5న ఉమ్మడి 13 జిల్లాల్లో సాగునీటి వినియోగదారుల సంఘాలకు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీని ప్రకారం డిసెంబరు 8న సాగునీటి సంఘాల ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నిక, సంఘాల అధ్యక్షుల, ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తవుతుంది.

డిసెంబరు 11న జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులను ఎన్నుకుంటారు. మధ్యతరహా, భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టు కమిటీల ఛైర్మన్ల ఎన్నిక డిసెంబరు 14న ఉంటుంది.

రాష్ట్రంలో మొత్తం 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలు ఉండగా భారీ నీటి పారుదలలో 1,755 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 21,060 ప్రాదేశిక నియోజకవర్గాలు, మధ్యతరహాలో 266 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 3,192 ప్రాదేశిక నియోజవర్గాలు, చిన్ననీటి పారుదలలో 4,128 సాగునీటి వినియగదారుల సంఘాలు, 24,768 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి.

రాష్ట్రం మొత్తం మీద 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు, వాటి కింద 71,11,712 ఎకరాల ఆయకట్టు వుంది. భారీ ప్రాజెక్టుల్లో 18 ప్రాజెక్టు కమిటీలు, మధ్య తరహాలో 35 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు డిసెంబరు 14 లోపు పూర్తవుతాయి

LEAVE A RESPONSE