Suryaa.co.in

Andhra Pradesh

పేదవాడికి అన్నం పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్

– టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులర్పించిన మంత్రులు, నాయకులు, కార్యకర్తలు
– రక్తదానం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి వేడుకలను ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మంత్రులు, నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ… ‘‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నమ్మి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతేనని తెలిపారు. రూ.2కే కిలోబియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఇళ్లు లేని పేదవారికి పక్కా ఇళ్లు, పేద రైతులకు ఉచిత కరెంటు అందించిన ఘనత ఎన్టీఆర్ దే అన్నారు.

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ మూలాన ఉన్న తెలుగువారికైనా ‘అన్న’ అనే పదం వినబడితే చాలు నందమూరి తారక రామారావు స్ఫురణకు వస్తారని. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. సామాన్యుడుకి సగం ధరకే జనతా వస్త్రాలు కట్టబెట్టిన అసమాన్యుడు. అట్టడుగు వర్గాలవారికి పక్కా ఇళ్ళు కట్టించిన ప్రజా నాయకుడు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ.. నినాదంతో దేశానికి సంక్షేమ పథకాల మార్గదర్శనం చేసిన దార్శనీకుడు. తెలుగు సినీరంగంలో అగ్రశ్రేణి నటుడుగా.. దర్శకునిగా.. నిర్మాతగా ప్రజా హృదయాలను గెలుచుకున్న ఎన్టీఆర్‌ రాజకీయాలలోను రాజీలేని తనదైన ముద్ర వేశారని కొనియాడారు. భౌతికంగా మనకు దూరమైనా.. తెలుగుజాతి గుండెల్లో చిరంజీవిగా కొలువయ్యారని అన్నారు.

ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, దువ్వారపు రామారావు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్, బ్రహ్మం చౌదరి, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, మహిళ నాయకురాలు వందనాదేవి, టీడీపీ సీనియర్ నాయకులు ఏవి రమణ, హసన్ బాష, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.పి.సాహెబ్, మీడియా కో ఆర్టినేడర్ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొని ఘన నివాళ్లు అర్పించారు.

LEAVE A RESPONSE