Suryaa.co.in

Telangana

సచివాలయంలో వంద రోజుల కంటి వెలుగు సంబురం

– కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు హరీశ్ రావు,ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్.
-100 పనిదినాల్లో కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తి
– 40.59 లక్షల మందికి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తింపు
-22.51 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
-18.08 లక్షల మందికి ప్రెక్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ
– మొత్తంగా ఇప్పటికే 24 జిల్లాల్లో పూర్తయిన స్క్రీనింగ్

వంద రోజుల కంటి వెలుగు సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్,TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ తో కలిసి కేక్ కట్ చేశారు. పథకం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేయడం పట్ల మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఆశా వర్కర్లకు కేక్ కట్ చేసి తినిపించి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కంటి వెలుగు విజయవంతంగా నిర్వహించేందుకు పాల్పంచుకున్న వైద్యారోగ్య శాఖ సహా సహకరించిన ఇతర శాఖలు, ప్రజా ప్రతినిధులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అలోచనతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘కంటి వెలుగు’ కార్యక్రమం ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకొని, లక్ష్యానికి మించి కంటి పరీక్షలు చేయడం జరిగిందన్నారు.

నివారింపదగిన, అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మందికి కంటి వెలుగును ప్రసాదించిందన్నారు. ఎవరూ అడగక ముందే ఈ పథకం ప్రారంభించి, మానవత్వాన్ని చాటుకున్న గొప్ప మనసు సీఎం గారిది అన్నారు. గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి, ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదన్నారు.

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు చేసారు. ఇందులో దృష్టి లోపం ఉన్న 40.59 లక్షల మందికి అంటే 25.1 శాతం మందికి గ్లాసెస్ పంపిణీ చేయడం జరగింది. ఇందులో 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందించారు. 18.08 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటికే 24 జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయింది. మిగిలిన 9 జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తి నీ కొనసాగిస్తూ కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యల పై ప్రజలు దృష్టి పెట్టాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నందున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గత జనవరి 18 నుంచి వంద రోజుల కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

స్క్రీనింగ్ పూర్తి చేసిన తర్వాత వెంటనే రీడింగ్ గ్లాసెస్, నాలుగు వారాల్లోగా ప్రిస్కిప్షన్ గ్లాసెస్ తప్పకుండా అందేలా చూశారు. క్యాంపుల నిర్వహణ ప్రణాళికతో నిర్వహించారు. కంటి వెలుగు పూర్తయిన జిల్లాలో సిబ్బందిని తిరిగి తమ రెగ్యులర్ విధులకు పంపిస్తూ మిగిలిన జిల్లాలలో సిబ్బందికి అవసరమైన భోజన, వసతి, వాహన సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు.

డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆపీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, కంటి వైద్యులు, సూపర్వైజర్లు, ఏన్ఎలు, ఆశాలు, డీఈవోలు సహా, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేశారు.

సచివాలయంలో నిర్వహించిన వంద రోజుల కంటి వెలుగు సంబరాలలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్,TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ తో పాటు వైద్యారోగ్య శాఖ సెక్రెటరీ రిజ్వి, హెల్త్ కమిషనర్ శ్వేత మహంతి, డి హెచ్ శ్రీనివాసరావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, టిఎస్ఎంఎస్ ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ స్వరాజ్య లక్ష్మి, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా ఏఎన్ఎంలు పాల్గొన్నారు. సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలిపారు

 

LEAVE A RESPONSE