Suryaa.co.in

Andhra Pradesh

చాప కింద నీరులా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత

-ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకతకు సలహాదారులు ,సంఘనేతలే కారణం
-దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది
-సంఘ నేతలు ముఖ్యమంత్రికి కాదు,ఉద్యోగులకు బంటులా ఉండాలి
-ఎస్పీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత చాపకింద నీరులా విస్తరిస్తుందని ఎస్పీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. అమరావతిలో విలేకరులతో సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి, వ్యతిరేకత పెరగటానికి కొందరు ప్రభుత్వ సలహాదారులు ,ప్రధాన ఉద్యోగ సంఘాల నేతలే కారణమని అన్నారు.

సీఎంఓ లో తరచూ ముఖ్యమంత్రిని కలిసే కొందరు ఉద్యోగ సంఘ నాయకులు,సలహాదారులు ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రికి అబద్ధాలు చెబుతూ అభూత కల్పనలు ద్వారా అంతా బాగానే ఉందంటూ చెప్పటమే ఈ పరిస్థితి కి కారణమన్నారు.

ఉద్యోగులు,ఉద్యోగ సంఘ నాయకులు సమస్యలపై తమ సంతృప్తిని,అభిప్రాయాల ను సామాజిక మాధ్యమాలలో వెలిబుచ్చిన ఉద్యోగులపై , కొందరు ఉద్యోగ సంఘ నేతలే సిఐడి కి ఫిర్యాదు చేయడం, సమస్యలపై నిరసనలు చేస్తుంటే కొందరు సంఘ నేతలు వాటిని నీరుకార్చేలా, వ్యవహరించడం ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చారని, ఎలాంటి ఆందోళన చేయొద్దని మభ్యపెట్టడం,తమ ఉనికి, ఆధిపత్యం కోసం అటు ముఖ్యమంత్రికి ఇటు ఉద్యోగులకు ఎవరికి చెప్పే మాటలు వారికి చెప్పటం లాంటి అంశాలు ఈ వ్యతిరేకతకు కారణమని వివరించారు.

ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులకి బంటు గా ఉండాలి తప్ప ముఖ్యమంత్రి కాదనే విషయం సంఘ నేతలు గ్రహించాలన్నారు. దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను తీవ్రంగా బాధించిందన్నారు. ఆ ఘటనలను ఏ ముఖ్య ఉద్యోగ సంఘము ఖండించకపోవడం తీవ్ర బాధాకరమన్నారు.ఎస్సీ ఉద్యోగులపై సంఘ నేతలకు ఉన్న వివక్ష వల్లే ఎవరూ నోరు మెదపలేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్ లు ఇవ్వకుండా కొందరు అధికారులు,ఉద్యోగ సంఘ నేతలు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగ సంఘ నాయకులకు నిజంగా ముఖ్యమంత్రిపై ప్రేమ ఉంటే ఉద్యోగుల సమస్యలు, ఆకాంక్షలపై ఆయనకు ఉన్నది ఉన్నట్లు నిజాలు చెప్పాలని సంఘం నాయకులు,సలహాదారు లకు సూచించారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదని తక్షణమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌనం వీడి పరిష్కరించాల్సిన ఉద్యోగుల ప్రధాన సమస్యలపై శ్వేతపత్రం విడుదల చేసి తక్షణమే వాటిని పరిష్కరించేలా విధానపర నిర్ణయం తీసుకోవాలని కోరారు.

LEAVE A RESPONSE