Suryaa.co.in

Telangana

చారిత్రక ఘట్టాలకు వేదిక మన గోల్కొండ కోట

– రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో మోదీ చొరవ
– భద్రాద్రి హాల్ త్రివర్ణ పతాకంతో వెలుగులతో మెరిసిపోనుంది
– చారిత్రక గోల్కొండ కోట లైట్ & సౌండ్ షో, ఇల్యుమినేషన్ కార్యక్రమం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కాకతీయుల కాలంలో, అంటే 11వ శతాబ్దంలో దీన్ని కట్టినప్పటినుంచి.. బహమనీ సుల్తానులు, అసఫ్‌జాహీలు, మొన్నటి నిజాం కాలం వరకు.. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక మన గోల్కొండ కోట.

అందుకే నేటికీ హైదరాబాద్ సందర్శించే పర్యాటకుల టాప్ పర్యాటక స్థలాల జాబితాలో గోల్కొండ ఓ ప్రత్యేకమైన ఆకర్షణ. ఇంతటి ఘనమైన సాంస్కృతిక చరిత్ర గల గోల్కొండ కోట వివరాలను పర్యాటకులకు మరింత ఆసక్తికరమైన పద్ధతిలో, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. తెలియజేయాలనేది మా ఉద్దేశం.

అందుకే కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో.. గోల్కొండ కోటలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘లేజర్ లైట్ & సౌండ్ షో’ను సిద్ధం చేశాం. 1993లోనే ఇక్కడ లేజర్‌షో ఏర్పాటైంది. కానీ అప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా.. ప్రీ-రికార్డెడ్ సౌండ్ ట్రాక్స్, ఫిక్స్‌డ్ లైట్స్ పై ఆధారపడి పనిచేసే లేజర్‌షో నడుస్తోంది.

దీని స్థానంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. గోల్కొండ చరిత్రను మరింత గొప్పగా చూపించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై-రెజల్యూషన్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్‌లైట్స్ వంటి అధునాతన సాంకేతికత కలబోతతో వినూత్నంగా ‘సౌండ్ & లైట్ షో’ను రూపొందించింది. ఈ షో గోల్కొండ సందర్శించే పర్యాటకులను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు.

గోల్కొండ కేంద్రంగా పాలించిన రాజుల ధైర్య సాహసాలు, వారు చూపిన ప్రేమ, పాలన తీరు, చేసిన త్యాగాలు, నాటి సంపూర్ణ చరిత్ర మొదలైన వాటిని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో.. ఆకట్టుకునేలా రూపొందించారు. అంతే కాదు.. ఈ ‘షో’.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. 20వాట్ లేజర్ లైట్లు 6, మూవింగ్ హెడ్‌లైట్లు 20, 14 స్పీకర్లు, 8 సబ్ వూఫర్లు, సరౌండ్ సౌండ్ సిస్టమ్ఒక 80Kva UPS వంటి వాటితో ఈ లేజర్ షో నడుస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి ఇచ్చిన ‘పాంచ్ ప్రణ్’ పిలుపులో.. ఒకటి.. మన చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకోవడం. మన సంస్కృతి గురించి తెలియాలంటే.. దీన్ని మనం ఆచరణలో చూపించాలి. బోనాలు, బతుకమ్మ, మేడారం జాతర, అట్లతద్దె ఇలాంటి వన్నీ.. మనం పాటించినపుడే మన సంస్కృతి బతుకుతుంది, తర్వాతి తరాలకు అందుతుంది.

మన చరిత్ర తెలుసుకోవాలంటే.. ఆ చరిత్రను ప్రతిబింబించే.. ఇలాంటి చారిత్రక కట్టడాలను సంరక్షించుకోవాలి. వీటి గురించి అందరికీ తెలియజేయాలి. పాఠ్యపుస్తకాల ద్వారా కొంత తెలుస్తుంది. వివిధ ప్రాంతాలను సందర్శించినపుడు.. అక్కడ ఏర్పాటుచేసే ఇలాంటి సౌండ్ & లైట్ షోల ద్వారా మనకు స్పష్టమైన అవగాహన వస్తుంది.

ఇది చరిత్రను తెలుసుకోవడంతోపాటుగా.. ఆ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఇలాంటి ‘షో’లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మన పక్కనున్న నాందేడ్ వెళ్తే.. అక్కడున్న 300 సంవత్సరాల నాటి గురుద్వారా సమీపంలో రోజూ.. లేజర్ షో వేస్తారు. దీని ద్వారా.. గురుగోవింద్ సింగ్ చేసిన సాహసం, త్యాగాలు, వారి కుటుంబ సభ్యులు ఏం చేశారు? నాటి దేశమాన పరిస్థితులేంటి అనేది మనకు అవగాహన కలుగుతుంది.

ఇలా వేర్వేరు ప్రాంతాల్లో అక్కడి చరిత్రకు అద్దంపట్టేలా ప్రదర్శించే ‘సౌండ్ & లైట్ షో’లు పర్యాటకులను ఆకర్శిస్తాయి. మన గోల్కొండ కోట సౌండ్&లైట్ షోకూడా.. మన చరిత్రను, వారసత్వాన్ని తెలియజేస్తుంది. ఇలా.. సాంస్కృతిక, పర్యాటకం, వారసత్వ చరిత్రను తెలుసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలి.

ఇది కాకుండా.. ఇవాళ మనం.. గోల్కొండ కోటకు ఇల్యుమినేషన్‌ను కూడా ప్రారంభించుకున్నాం. రాత్రివేళల్లోనూ కోట దేదీప్యమానంగా ప్రకాశించేందుకు, అందంగా కనిపించేందుకు.. మొత్తం లక్ష చదరపు అడుగుల వైశాల్యంగల బయటి గోడలకు వెలుగులు అందించేందుకు (ఫసాడ్ ఇల్యుమినేషన్).. 1,400 LED లైట్లను అమర్చారు.

ఈ వ్యవస్థను ఎనర్జీ ఎఫిషియంట్‌గా చేసేందుకు 25 కిలోవాట్ల సోలార్ పవర్ వినియోగిస్తున్నాం. ఈ లైటింగ్ ద్వారా.. గోల్కొండ కోట బయటి గోడల ఇల్యుమినేషన్ వామ్ వైట్ రంగులో ఉంటుంది. ముఖద్వారం, భద్రాద్రి హాల్ త్రివర్ణ పతాకంతో వెలుగులతో మెరిసిపోనుంది. తెలంగాణలో సాంస్కృతిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఇందులో భాగంగా.. ప్రసాద్ స్కీమ్, స్వదేశ్ దర్శన్ వంటి పథకాల ద్వారా నిధులు కేటాయించి పనులు చేస్తున్నాం. కొన్ని పనులు పూర్తయ్యాయి.. ఇంకొన్ని పనులు నడుస్తున్నాయి.

మనం తర్వాతి తరాలకు అందించే.. విలువలు, కళలు, చ రిత్ర, సంస్కృతే నాగరికత అవుతుంది. అందుకే తెలంగాణలోనూ.. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ సంస్కృతిని పరిరక్షించేందుకు మేం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాం. వరంగల్ జిల్లాలో.. కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో మోదీ చొరవతీసుకున్నారు.

అనేక దశాబ్దాల తర్వాత వెయ్యి స్తంభాల గుడిని పునరుద్ధరిస్తున్నాం.
భద్రాచంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద భక్తులకోసం ఏర్పాట్లు చేశాం. శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని భవిష్యత్ తరాలకోసం సంరక్షిస్తున్నాం. బోనాలు, బతుకమ్మలను జాతీయ స్థాయిలో జరుపుతున్నాం.

గిరిజనుల కుంభమేళా అయిన.. సమ్మక్క-సారలమ్మ జాతరకు అన్నిరకాలుగా మద్దతును తెలియజేస్తున్నాం. ఇలా.. మన ప్రాంత, మన దేశ సాంస్కృతిక విలువలను, కళాకృతులను పరిరక్షించడంలో.. మనమంతా వీలైనంతగా కృషి చేద్దాం.

LEAVE A RESPONSE