Suryaa.co.in

Editorial

ప్రెస్ అకాడెమీని వదలని పెద్ద గద్దలు

– సీపీఐ కోటాలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి?
– మా కోటాలో వద్దంటున్న సీపీఐ సీనియర్లు
– సీపీఐలో ప్రెస్ అకాడెమీ చీలిక
– సీపీఐకి ఒక ఎమ్మెల్సీ, రెండు చైర్మన్ పదవుల హామీ
– అకాడెమీ చైర్మన్ మా కోటాలో వద్దంటున్న సీపీఐ సీనియర్లు
– అది ఇచ్చి ఇంకో పోస్టుకు కాంగ్రెస్ ఎగనామం పెడుతుందన్న అనుమానం
– ఎప్పుడూ వారికేనా అంటున్న జర్నలిస్టులు
– తెలంగాణ ఉద్యమంలో లేని వారికి పదవులా?
– చైర్మన్ పదవి యూనియన్ లీడర్లకు వద్దని డిమాండ్
– యూనియన్ లీడర్లకు ఇస్తే అది యూనియన్ ఆఫీసే
– జర్నలిస్టులు ప్రభుత్వానికి దూరమవుతారని హెచ్చరిక
– తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్ ఎవరికి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

పాలకులు ఎవరైనా దానిపై వారిదే హవా. ముఖ్యమంత్రుల వద్ద యూనియన్ లీడర్ల కార్డు వాడతారు. మంత్రుల దగ్గరైతే లీడర్ల బిల్డప్పులు ఇంకొంచెం ఎక్కువ. ఇక చిన్నా చితకా పొలిటీషయన్ల వద్ద బిల్డప్పుల సంగతి చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ వాళ్లే గాడ్‌ఫాదర్లన్నది వారి భ్రమ.

కింది స్థాయి జర్నలిస్టులు, జిల్లా-గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టుల దృష్టిలో సదరు యూనియన్ లీడర్లు పెద్ద హీరోలు. వాళ్లు ఆయా జిల్లాలకు వెళితే రాజభోగాలు. మా సార్లు వస్తున్నారంటూ.. ఆయా జిల్లాల్లో జరిగే యూనియన్ సభలకు ఎమ్మెల్యేలు, మంత్రులు, మరో మహారాజ పోషకులను పట్టుకుని స్పాన్సర్‌షిప్పు లాగిస్తారు. వారిని సదరు నేతాశ్రీలు అలాంటి భ్రమల్లో ఉంచారు మరి.

పోనీ ఎవరినయినా మీడియా సంస్థల యాజమాన్యాలు జర్నలిస్టులను ఉద్యోగం నుంచి తొలగిస్తే.. తమ కోసం పనిచేసిన వారికి, మళ్లీ ఉద్యోగం అందులోనే ఉద్యోగం ఇప్పించే సత్తా ఉందా అంటే అదీ లేదు. ఇవేమీ తెలియని పిచ్చి జర్నలిస్టులు, వీళ్లు ఇప్పించే అక్రెడిటేషన్ కార్డుల కోసం వారి మెహర్బానీల కోసం పాకులాడుతుంటారు. అది వేరే కథ.

ప్రభుత్వం ఏదైనా… పాలకుడు ఎవరైనా లీడర్ కార్డు వాడి, సొంత పనులు చేసుకోవడం వారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ నైపుణ్యం. పాలకులు తాము చెప్పింది వింటే సరే. లేకపోతే ఇంకో జేబులో దాచిపెట్టిన, పోరాటాల కార్డు బయటకు తీస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి కోసం మళ్లీ అదే జరుగుతోంది.

తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి కోసం.. జర్నలిస్టులను ఉద్ధరించే సంఘానికి చెందిన ఓ పెద్దాయన రంగంలోకి దిగారు. ఇప్పటికే కర్చీఫ్ వేశారు. ఆయన గతంలో కూడా ఆ పదవిలో పనిచేశారు. అప్పుడు కూడా జర్నలిస్టులకు చేసిందేమీ లేదు. బాగానే ఉంది. అయితే సదరు నేత సీపీఐ కోటాలో చేస్తున్న ప్రయత్నాలే, ఆ పార్టీలో చిచ్చు పెట్టాయట. నిజానికి కాంగ్రెస్‌తో పొత్తున్న సీపీఐకి.. ఎన్నికల ముందు కాంగ్రెస్ కొన్ని హామీలిచ్చింది. ఒక ఎమ్మెల్సీ, రెండు నామినేటెడ్ చైర్మన్ పదవులిస్తామని భరోసా ఇచ్చారట.

అయితే సదరు జర్నలిస్టు నేతాశ్రీ.. ఆ రెండు కార్పొరేషన్ చైర్మన్ల కోటాలో, తనకు ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి కోరుతున్నారట. ఇదే ఇప్పుడు సీపీఐలో చిచ్చుకు దారితీసింది. ‘ప్రెస్ అకాడెమీ చైర్మన్ ఇచ్చాం కాబట్టి, ఇక మీకు ఒకటే చైర్మన్ ఇస్తామని కాంగ్రెస్ మెలికపెట్టే ప్రమాదం ఉంద’న్నది వారి అసలు భయం.

చాడా వెంకటరెడ్డి, అజీజ్‌పాషా వంటి ఇద్దరు ముగ్గురు లీడర్లకు ఎమ్మెల్సీ, చైర్మన్ పదవులొచ్చే అవకాశాలున్నాయి. మరి అలాంటప్పుడు జర్నలిస్టు కోటాలో ప్రెస్ అకాడెమీ తీసుకుంటే, తమకు వచ్చే ఆ ఒక చైర్మన్ పదవికి చిల్లు పడుతుందన్నది కామ్రేడ్ల అసలు భయం.

పోనీ.. సదరు జర్నలిస్టు నేతాశ్రీ ఏమైనా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా అంటే అదీ లేదు. ఉద్యమానికి దూరంగా ఉన్న మహానేత. మరి ఉద్యమంలో పనిచేయని వారికి, మాజీ మంత్రి హరీష్‌రావుకు సన్నిహితులైన నేతాశ్రీలకు చైర్మన్ పదవి ఎలా ఇస్తారన్నది జర్నలిస్టుల ప్రశ్న. గత ప్రభుత్వంతో చాలాకాలం పాటు సన్నిహితంగా మెలిగిన వారికి, చైర్మన్ పదవి ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అదీగాక అసలు జర్నలిస్టు యూనియన్ లీడర్లకు చైర్మన్ పదవులిస్తే, దాని లక్ష్యం దెబ్బతింటుందని సీనియర్ జర్నలిస్టులు స్పష్టం చేస్తున్నారు. ‘‘యూనియన్ లీడర్లకు కాకుండా సీనియర్లకు చైర్మన్ పదవులివ్వాలని మేం కొన్నేళ్లుగా సూచిస్తున్నాం. అయినా ప్రభుత్వాలు వినడం లేదు. యూనియన్ లీడర్లకు చైర్మన్ పదవులిస్తే, వాళ్లు సహజంగా వారి యూనియన్ కోసమే పనిచేస్తారు. మిగిలిన వారి గురించి ఆలోచించరు. ప్రెస్ అకాడెమీ కాస్తా యూనియన్ ఆఫీసయిపోతుంది. ప్రభుత్వ పథకాలు కూడా తమ యూనియన్‌లో ఉన్న వారికే వర్తించేలా చూస్తారు. దానివల్ల యావత్ జర్నలిస్టు సమాజం, ప్రభుత్వానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. పాలకులు ఈ లాజిక్కును అర్ధం చేసుకోవడం లేదు. నిన్నటి ఎన్నికల ముందు కూడా ఇదే జరిగింది’’ అని ఓ సీనియర్ జర్నలిస్టు విశ్లేషించారు.

కాగా ప్రెస్ అకాడెమీ చైర్మన్ రేసులో.. సీపీఐ కార్డు వాడుతున్న సీనియర్ జర్నలిస్టు ప్రయత్నాలపై, సీనియర్ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ పదవి తటస్థంగా-తమకు అనుకూలంగా ఉన్నవారికే ఇవ్వాలన్నది వారి వాదన. యూనియన్లతో సంబంధం లేని వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా, కాంగ్రెస్ కొత్త సంస్కృతికి తెరలేపాలని సూచిస్తున్నారు. ఏకాభిప్రాయంతోనే ైప్రెస్ అకాడెమీ చెర్మన్ పదవి ఎంపిక పూర్తి చేయాలని పలువురు మంత్రులు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A RESPONSE