– వైద్యరంగంలో ముఖ్యమంత్రి సాధించిన ఘనత ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు 1200 కోట్లు బకాయిపెట్టడమే
-పెద్దపళ్లెంలో పెడుతున్నాను అన్నట్టు ఆరోగ్యశ్రీ పరిధి, చికిత్స వ్యయం పెంచానని జగన్ గొప్పులు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో పేదలకు ఒరిగింది శూన్యం
-నెట్ వర్క్ ఆసుపత్రులు లాభమనుకునే చికిత్సలు, సర్జరీలు మాత్రమే చేస్తుండటంతో పేదలకు వచ్చే సాధారణ జబ్బులకు వైద్యం అందడంలేదు
-ఆ విధంగా చేసిన చికిత్సలకు సంబంధించే ప్రభుత్వం ఆసుపత్రులకు రూ.1200కోట్లు చెల్లించాల్సి ఉంది
-ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు… ప్రభుత్వం పంతాలతో సామాన్యప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి
టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
జగన్ రెడ్డి హాయాంలో దెబ్బతిన్న వ్యవస్థల్లో ప్రధానమైంది వైద్యారోగ్య శాఖ అని, ఆరోగ్యశ్రీ పరిధితోపాటు, చికిత్సల వ్యయం పెంచానని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి మాటలు, పెద్దపళ్లెంలో భోజనం పెడుతున్నాననే సామెతలా ఉన్నాయని, అంతా బాగుంటే ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు వైద్యసేవలు అందించేది లేదని బోర్డులు ఎందుకు పెట్టాయో ప్రభుత్వం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ….
“ జగన్ రెడ్డి సర్కార్ ఆరోగ్య శ్రీ సీలింగ్ లిమిట్ రూ.25లక్షలకు పెంచినా.. 2500 జబ్బులకు వైద్యం అందిస్తున్నట్టు చెబుతున్నా, ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఎందుకు బోర్డులు పెట్టాయి? తమకు రావాల్సిన రూ.1200 కోట్లను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నాయి. ప్రభు త్వం పెంచిన ఆరోగ్యశ్రీ సీలింగ్ లిమిట్ కాలేయమార్పిడి, గుండె మార్పిడి వంటి పెద్దచికిత్సలకు సరిపోతుంది.
పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా సామాన్య జబ్బులతో, ఇతర చిన్నాచితకా వ్యాధులతోనే ఎక్కువగా ఆరోగ్య శ్రీ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. కొన్నిరకాల జబ్బులకు ప్రభుత్వం నిర్ణయిచిన ధరల్ని ఆసుపత్రులు అంగీకరించే పరిస్థితిలేదు. తమకు ఉపయోగం అనిపించే, ఏ వ్యాధులకు చికిత్సచేస్తే తమకు నష్టం రాదో, అలాంటి వాటికే ఆసుపత్రులు చికిత్సలు అందించడానికి ఆసక్తిచూపుతున్నాయి. అలా అందించిన చికిత్సలకు సంబంధించే వైసీపీప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.1200 కోట్లవరకు చెల్లించాల్సి ఉంది.
ఆసుపత్రులు.. ప్రభుత్వ పంతాల మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు అందడక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. దాంతో జగన్ రెడ్డి పాలనలో నాణ్య మైన వైద్యసేవలు అందక ప్రజల ప్రాణాలు గాల్లోదీపాల్లా మారాయనేది కాదనలేని వాస్తవం.
వైద్యసేవలకు డబ్బు కట్టే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా ఆరోగ్యశ్రీ వైద్యం అందడం లేదు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ వైద్యసేవల కోసం నెలకు ఇంతని డబ్బు కడుతున్నారు. అలాంటి వారికి కూడా నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడంలేదు. ఒక ఉద్యోగి గుండెకు స్టంట్ వేయించుకుంటే రూ.2లక్ష లు ఖర్చయితే, ప్రభుత్వం దానికి అందించే రీయింబర్స్ మెంట్ సొమ్ము కేవలం రూ.40 నుంచి రూ.50వేలు మాత్రమే. మిగిలిన సొమ్ము ఉద్యోగి భరించాల్సిందే. ఉద్యోగులు అంటే ఏవో తిప్పలు పడి వైద్యం చేయించుకుంటారు, మరి రిటైరైన పెన్షనర్ల పరిస్థితి ఏమిటి?
ముఖ్యమంత్రి డబ్బాలు కొట్టుకోవడమే గానీ.. ఆసుపత్రుల యాజమాన్యాలు డబ్బులు కడితేనే వైద్యం అని ఖరాకండిగా చెప్పేస్తున్నాయి
ఆరోగ్యశ్రీ గురించి ప్రభుత్వం, ముఖ్యమంత్రి డబ్బాలు కొట్టుకోవడంతప్ప, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రజలైనా, ఉద్యోగులైనా డబ్బులు కట్టాకే వైద్యసేవలు అందిస్తామని ఆసుపత్రుల యాజమాన్యాలు ఖరా కండిగా చెబుతున్నాయి. తన తండ్రి పెట్టిన గొప్ప స్కీమ్ ఆరోగ్యశ్రీని, జగన్ రెడ్డి ఇలా నీరుగార్చడం నిజంగా బాధాకరం.
టీడీపీప్రభుత్వంలో ధరలపెరుగుదలకు అనుగుణంగా చికిత్సలకు అయ్యే వ్యయం పెంచాలని నిర్ణయం తీసుకొని, దాన్ని అమలుచేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా అంగీకరించాయి. జగన్ ప్రభుత్వంలో చేసిన వైద్యసేవలకు ఎప్పటికప్పుడు డబ్బులు రావడంలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి.
గట్టిగా ప్రశ్నించే యాజమాన్యాలపైకి ప్రభుత్వం మున్సిపల్, ఇతర విభాగాల్ని ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే కదా జగన్ రెడ్డి అందించే సంక్షేమ పథకాల ఫలితం అనుభవించేది.
హడావుడిగా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి సీట్ల అమ్మకం మొదలెట్టాడు
కేంద్రప్రభుత్వ పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ కింద అందించే నిధుల్ని కూడా వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద అందించిన సొమ్ముని జగన్ రెడ్డి పక్కదారి పట్టించడంతో, కేంద్రం నిధులు పూర్తిగా ఆపేసింది. ఈ విధమైన అనాలోచిత చర్యలతో రాష్ట్ర వైద్యరంగాన్ని జగన్ రెడ్డి దారుణంగా దెబ్బతీశాడు. జిల్లాకో మెడికల్ కాలేజీ కడుతున్నానంటూ జగన్ రెడ్డి హడావుడి గా 5 కాలేజీలు ప్రారంభించాడు.
వాటిలో కేపిటేషన్ ఫీజు పెట్టాడు. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వచ్చినా కూడా లక్షల్లో ఫీజులు కట్టేలా విధానాలు మార్చేశాడు. ఇదే రకమైన విధానమో ఆయనే చెప్పాలి. ఇలాంటి పనులు చేస్తూ మెడికల్ కాలేజీలు తెచ్చినట్టు చాటింపు వేసు కుంటున్నాడు.
గతప్రభుత్వ బకాయిలు కడుతున్నట్టు చెప్పుకునే జగన్ రెడ్డి, పేదల వైద్యసేవల కోసం రూ.1200కోట్లు ఎందుకు చెల్లించడంలేదు?
ఫ్యామిలీ డాక్టరని..అదని..ఇదని కోతలు కోశాడు. నిజంగా ఫ్యామిలీ డాక్టర్ అంటే ఒక్కో కుటుంబానికి ఒక్కో వైద్యుడుఉండాలి. రాష్ట్రంలో బీపీఎల్ కింద ఉన్న కుటుంబాలెన్ని.. ఆయా కుటుంబాలకు సేవలందించడానికి తగినంత మంది వైద్యులున్నారా అంటే సమాధానంలేదు. 108-04 వాహానాలు తానే తీసుకొచ్చి నట్టు విజయవాడలో వాటిని ప్రారంభిస్తూ కుయ్..కుయ్ అని అరుస్తూ గొప్పలు చెప్పాడు.
ఇప్పుడు ఆ వాహానాలు ఎక్కడా సేవలు అందించే పరిస్థితిలేదు. 108-104 సిబ్బందికి జీతాల్లేవు. అలానే చంద్రబాబు తీసుకొచ్చిన ఫీడర్ అంబులెన్సు లు, తల్లీబిడ్డా ఎక్స్ ప్రెస్ లను నిరుపయోగంగా మార్చాడు. చివరకు వైద్య ఆరోగ్య రంగంలో జగన్ రెడ్డి సాధించింది ఏమిటయ్యా అంటే నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.1200కోట్లు బకాయి పెట్టడం. గతప్రభుత్వ బకాయిలు తాను కడుతున్నట్టు భారీగా ప్రకటనలిస్తూ, ప్రచారం చేసుకునే జగన్ రెడ్డి ఇన్నేళ్లలో పెట్టిన బకాయిల్ని ఏ ప్రభుత్వం చెల్లించాలి?
కాంట్రాక్టర్లు.. ఉద్యోగులు.. ఆసుపత్రులు సహా వివిధ విభాగాలకు పెట్టిన బకాయిలన్నీ రాబోయే ప్రభుత్వమే కట్టాలి. తాను ఎలాగూ ఏమీ చేయలేడని జగన్ రెడ్డికి కూడా అర్థమైంది. కనీసం ప్రజల్ని కాపాడే ఆరోగ్య శ్రీ చికిత్సలు అయినా సక్రమంగా అందేలా చూడాలి. తక్షణమే నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ.1200 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించి, ప్రజల కు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.
తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసగించడంలో జగన్ రెడ్డి సిద్ధహస్తుడు అనడానికి ఆరోగ్యశ్రీ గురించి చెప్పిన మాటలే నిదర్శనం
రూ.1000 లు దాటిన ప్రతి చికిత్సకు ప్రజలు రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదని జగన్ చెప్పాడు… రూ.25 లక్షలకు వైద్య ఖర్చుల పరిమితి పెంచానన్నాడు. అవన్నీ పచ్చి అబద్ధాలని ఇప్పుడు జరుగుతున్నది చూస్తే అర్థమవు తుంది. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసగించడంలో జగన్ రెడ్డి సిద్ధహస్తుడని చెప్పడానికి ఆరోగ్యశ్రీ గురించి చెప్పిన మాటలే నిదర్శనం.” అని అశోక్ బాబు స్పష్టం చేశారు.