Suryaa.co.in

Andhra Pradesh

కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయకుంటే ప్రజా ఉద్యమం..

– న్యాయమూర్తులు స్పందించాలి- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
– అంటరానితనంపై రాజకీయ మేలి ముసుగు- టీడీపీ జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య
– 5 ఏళ్లుగా జైల్లో ఉంచటం దారుణం- జనసేన రాష్ట్ర నాయకులు పోతిన మహేష్‌
– కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలని కోరుతూ రౌండ్‌టేబుల్‌ సమావేశం

విజయవాడ:- కోడికత్తి శ్రీను అలియాస్‌ జనపల్లి శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేయటంతోపాటు తగిన న్యాయం చేయకుంటే ప్రజాఉద్యమం తప్పదని వక్తలు అన్నారు. కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సమతా సైనిక్‌ దళ్‌, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.

స్థానిక దాసరి భవన్‌లో బుధవారం జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఒక వ్యక్తి ఐదేళ్లుగా జైల్‌లో ఉంటే వామపక్షాలు, కొన్ని ప్రజాసంఘాలు మాత్రమే స్పందించటం శోచనీయం అన్నారు. చట్టప్రకారం ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండాలో హైకోర్టు న్యాయవాదులు చెప్పాలని కోరారు. న్యాయం కోసం దీక్ష చేయటం తప్పా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్‌ను కోర్టుకు రావాలని ఎందుకు ప్రశ్నించటం లేదని, ఒక్క హైకోర్టు న్యాయమూర్తి కూడా మాట్లాడటం లేదని సందేహం వ్యక్తం చేశారు.

జగన్‌ దగ్గర డబ్బులు ఉన్న కారణంగానే ఎవరూ మాట్లాడటం లేదన్నారు. దేశంలో పేదలకు న్యాయం జరగటం లేదన్నారు. ప్రొఫెసర్‌ సాయిబాబును కూడా జైల్‌లో ఇలానే ఉంచారని తెలిపారు. పోలీసులు విచారణ సరిగా చేయలేదనే కారణంతో ఎన్‌ఐఏకు అప్పగించారని తెలిపారు. కోడికత్తి శ్రీనుకు న్యాయం చేసే విషయంలో న్యాయమూర్తులు స్పందించాలని కోరారు.

టీడీపీ జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ దేశ న్యాయవ్యవస్థలో హత్యకేసులో 5ఏళ్లు జైలు శిక్షపడిన దాఖలాలు లేవన్నారు. అంటరానితనం కారణంగానే కోడికత్తి శ్రీను ఐదు సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంటరానితనంపై రాజకీయ మేలి ముసుగు కప్పబడిరదన్నారు. జగన్‌ కుట్రలో కోడికత్తి శ్రీను ఒక పావుగా ఉన్నాడని చెప్పారు.

ఈ కేసులు ప్రథమ ముద్దాయి జగన్‌ అవుతారని, కేసు దర్యాప్తును సక్రమంగా చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు చేయించాడని ఆరోపించి సానుభూతి పొంది జగన్‌ అధికారంలోకి వచ్చారని తెలిపారు. కోడికత్తి శ్రీను విషయంలో వైసీపీలో ఉన్న దళిత నాయకులు కూడా స్పందించటం లేదన్నారు.

జనసేన రాష్ట్ర నాయకులు పోతిన మహేష్‌ మాట్లాడుతూ గొడ్డలితో నరికిన వారికి బెయిల్‌ వచ్చిందని, వ్యక్తి చంపి డోర్‌ డెలివరీ చేసిన నాయకుడికి బెయిల్‌ వచ్చిందని, 13 సీబీఐ, 3 ఈడీ కేసులు వ్యక్తికి బెయిల్‌ వచ్చిందని కత్తితో గుచ్చినందుకు దళిత వ్యక్తి ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడని ఎద్దేవ చేశారు.

సామాన్యుడికి బెయిల్‌ రాకపోతే సామాజిక న్యాయం ఎక్కడ ఉందని జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి దళిత జేఏసీ నాయకులు పోతుల బాల కోటయ్య మాట్లాడుతూ దళితులను జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలు దళిత, గిరిజన వర్గాలను కలుపుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్‌ షుబ్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై అనేక అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని చెప్పారు. చిన్న గాయానికి 9 కుట్టు పడ్డాయని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడుతూ కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలని జాతీయ ఎస్సీ కమీషన్‌, మానవ హక్కుల కమీషన్‌, రాష్ట్ర గవర్నర్‌ దృష్టి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

సమావేశం అనంతరం కొన్ని తీర్మానాలు ఆమోదించారు. ఈ నెల 26 అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అన్యాయాలను ఎండగట్టడం, కోడికత్తి శ్రీనుకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద నిరసన, వామపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంట్‌లో ప్రస్తావించటం. అప్పటికీ కోడికత్తి శ్రీనుకు బెయిల్‌ రాకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వటం జరుగుతుందని నిర్వాహకులు వివరించారు.

కార్యక్రమంలో ఆర్‌ఎస్‌పీ నాయకులు వరప్రసాద్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, దళిత సేన నాయకులు చింతా వెంకటేశ్వర్లు, సమతా సైనిక్‌ దళ్‌ మహిళా అధ్యక్షులు శ్వేత, కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు, జనసేన రాష్ట్ర నాయకులు పెద్దపూడి విజయ్‌, మాలమహానాడు నాయకులు గోళ్ల అరుణ్‌కుమార్‌, గోదా జాన్‌పాల్‌లతో పాటు 20 దళిత సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE