Suryaa.co.in

Andhra Pradesh

జగన్ సర్కారు పాలన తప్పుల తడక.. అభివృద్ధిలో నత్తనడక

-నిధుల మళ్లింపులో జగన్‌కు సాటెవరూ లేరు
-రోడ్లు ఘోరం.. అభివృద్ధి హీనం
-ఇచ్చిన ఇళ్లే కట్టలేని విఫల నేత జగన్
-ఏపీపై మోదీకి ఉన్న ప్రేమ జగన్‌కు ఏదీ?
-అంకెలు అబద్ధాలు చెప్పవు కదా?
-బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

మోదీ ప్రభుత్వం ఇస్తున్న లక్షల కోట్ల నిధులను జగన్ సర్కార్ అక్రమంగా ఎలా మళ్లిస్తోంది? రాష్ట్రంలో మానవమాత్రుడనన్న వాడు కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా రహదారులు ఎంత దరిద్రంగా తయారయ్యాయి? రకరకాల మాఫియాలు రాష్ట్రంలో ఎలా రాజ్యమేలుతూ, ప్రజల సొమ్మును ఏ విధంగా కబళిస్తున్నాయి? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే.. ఒకే ఒక్క కేంద్ర ప్రభుత్వ పథకం ఎలా అమలవుతున్నదో పరిశీలిస్తే చాలు.

జగన్ సర్కార్ హయాంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను ఎడా పెడా ఎలా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారో చెప్పడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ క్రింద నత్త నడక నడుస్తున్న ఇళ్ల నిర్మాణమేకారణం. కేంద్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి ఇంతవరకూ రూ.4032 కోట్లు విడుదల చేయగా, ఆ మొత్తంలో నుండి జగన్ ప్రభుత్వం కేవలం రూ.2556 కోట్లే విడుదల చేసింది. అంటే రూ. 1476 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని స్పష్టమవుతోంది.

అంతేకాక తన వాటా క్రింద చెల్లించాల్సిన రూ.1389 కోట్ల లో జగన్ సర్కార్ కేవలం రూ. 504 కోట్లే విడుదల చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద అనుకున్న ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగాలంటేap-developఈ ఏడాది రూ. 2361 కోట్లు వెంటనే విడుదల చేయాలని గృహనిర్మాణ విభాగంఅధికారులు ఇటీవల జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ నే నేరుగా దేబిరించాల్సిరావడం దయనీయమైన విషయం.

ఇప్పటి వరకూ లబ్దిదారులకు చెల్లించాల్సిన రూ. 324 కోట్ల తోపాటు రూ. 755 కోట్ల మేరకు చెల్లింపులు పెండింగ్ లోపడిపోయాయి. ఇదేమయ్యా అని అడిగితే వనరులు లేవని రాష్ట్రం చేతులు ఎత్తేసింది. ఈ నెల అక్టోబర్ 25 నాటికి కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు 20,75,773 ఇళ్లను మంజూరు చేస్తే ఇంతవరకు కట్టింది6,27,048 ఇళ్లు మాత్రమే. మిగతా 14,48,725 ఇళ్లు ఎప్పుడు పూర్తవాలి?

దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) – ఏపీ టిడ్కో క్రింద అత్యధిక నిధులు అంటే 57 శాతం నిధులు లభిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ . అయినప్పటికీ నిధులు లేకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణం నత్తనడక సాగుతోందని గృహనిర్మాణ శాఖ అధికారులు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖాన చెప్పినా ఆయనకు సిగ్గు వచ్చినట్లు కనపడడం లేదు.

అంతకంటే దారుణమేమంటే రాష్ట్రమంతటా రహదారులు దారుణంగా దెబ్బతిన్నందువల్ల వివిధ ప్రాంతాలకు ఇళ్ల నిర్మాణ సామగ్రి తరలించడం కూడా కష్టమవుతోందని అధికారులు ఆయనకు నిర్మొహమాటంగా చెప్పారు. ఇంకా దుర్మార్గమేమంటే వివిధ డిపోలలో ఇసుక కొరత ఉన్నదని,అనేక చోట్ల ఇసుక నిల్వలే లేవని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పాల్సి రావడం.

కేంద్రం మంజూరు చేసిన నిధులను మళ్లించడం వల్ల ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోతున్నామని అధికారులు జగన్ కు చెప్పడం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులకు ఒక నిదర్శనం. వివిధ పథకాలకు కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన లక్షల కోట్లు ఇదే విధంగా జగన్ సర్కార్ మళ్లిస్తూ ఎప్పటికప్పుడూ పబ్బం గడుపుకుంటూ వస్తోందని స్పష్టమవుతోంది.

ఏపీలో రహదారులు దరిద్రంగా ఉన్నందువల్లే తాము పనిచేయలేకపోతున్నామని అధికారులు వాపోవడం జగన్ సర్కార్ అసమర్థ పరిపాలనకు రెండో నిదర్శనం. రహదారులు దరిద్రంగా ఉంటే రవాణా సౌకర్యాలు కల్పించడం, మౌలిక సదుపాయాల నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది? పెట్టుబడులు ఎలా వస్తాయి? నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ దుష్పరిపాలనకు ఇది తార్కాణం కాదా?

ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకే దొరకడం లేదని ప్రభుత్వాధికారులే ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవడం ఏపీలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో పనిచేస్తోందో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి ప్రత్యక్ష అండతో కనీసం పది మంది మంత్రులు, 70 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపిలు ఈ మాఫియాను నడిపిస్తున్నారని ఆరోపణలున్నాయి.

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలందరికీ ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యసాధన కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఈ లక్ష్యానికి తూట్లు పెడుతోంది, అనేక కేంద్ర పథకాల అమలుకు మోదీ సర్కార్ విడుదల చేసిన నిధులను మళ్లించడం, మోదీ పేరు కనీసం ప్రస్తావించకుండా కట్టిన ఇళ్లను జగనన్న కాలనీలుగా చెప్పుకుంటూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడం జగన్ సర్కార్ దుర్మార్గానికి పరాకాష్ట.

ఆయన అవినీతి, మాఫియా, దుష్పరిపాలనకు అంతం పాడకపోతే రానున్న రోజులు మరింత దారుణంగా తయారవుతాయనడానికి .. ఒక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు జరుగుతున్న తీరు తెన్నులే ప్రత్యక్ష సాక్ష్యం.

LEAVE A RESPONSE