– VHP ఉద్యమం వల్లనే యాదాద్రిలో ఇతర మతస్తుల ప్రార్థనా మందిరాల చిత్రాలు తొలగింపు
– అన్యమత చిత్రాలపై ఆందోళన – నేటికీ VHP, బజరంగ్ దళ్ నాయకులపై కేసులు
– అంతర్జాతీయ పర్యాటక పుణ్యక్షేత్రం అంటూ ప్రచారం- అడుగడుగునా డొల్లతనం..!
– మోడీని విమర్శించు… కానీ మీరు చేసిన దాన్ని సమీక్షించుకో సీఎం సార్..!
– అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని వాదన
యాదాద్రి దేవాలయం రోజుకో విధంగా శిథిలమవుతోంది. కోర్కెలు తీర్చే కోవెల కోటి కష్టాలకు నిలవైంది. వేలాది సంవత్సరాలు మన్నే విధంగా డంగు సున్నంతో నిర్మాణాలు జరిపినట్టు అధికారులు చెప్పిన మాటలన్నీ నీటి మూట లవుతున్నాయి. గత మే నెలలో కురిసిన ఒక్క గాలివానకే దేవాలయం అస్తవ్యస్తమైన విషయం అందరికి తెలిసిందే.
అయితే ఆ తర్వాత అధికారులు మేల్కొని అన్నిచక్కబెట్టారని అనుకున్నాం. కానీ నిర్మాణంలో పూర్తిగా నాణ్యత లోపించింది. నేడు రోజుకో విధంగా నిర్మాణం దెబ్బతిని శకలాలు కింద పడే విధంగా దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దక్షిణ దిశలో స్టోన్ ఫ్లోరింగ్ కుంగింది. ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు ప్రసాద కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. దక్షిణ రాజగోపురం ప్రాంతంలో దాదాపు పది కృష్ణశిల స్టోన్ ఫ్లోరింగ్ కు పగుళ్లు వచ్చి కుంగింది. అష్టభుజి ప్రకారం మండపంలో వర్షపునీరు లీకేజీతో డంగు సున్నం బయటకు వస్తోంది.
అంటే ఆ పనులు ఎంత “గొప్ప”గా చేశారో తెలుసుకోవచ్చు. రోజుకో పరికరం ఊడిపడుతూ గుడికి వచ్చే భక్తులను భయకంపతులను చేస్తోంది నూతన మందిరం. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఎనిమిదెళ్లు కష్టపడి, దాదాపు 25 సార్లకు పైగా యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. ప్రణాళిక లోపం.. అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల నాసిరకం రాజ్యమేలింది. సహజసిద్ధమైన చెట్లు చేమలు, బండరాళ్లతో యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉండేది. ఆహ్లాదకర వాతావరణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేది.
నియమనిష్ఠలతో ఇంటిల్లిపాది తమ ఇలవేల్పు లక్ష్మీ నరసింహ స్వామిని కొలిచి భక్తులు స్వాంతన పొందేవారు. ప్రశాంతమైన మానసికత కూడగట్టుకుని మొక్కులు చెల్లించి బయలుదేరేవారు. కానీ నేడు గొప్పలకు పోయిన ప్రభుత్వం… ప్రకృతి వనంగా విలాసిల్లిన “గుట్ట”ను కాంక్రీట్ జంగిల్ గా మార్చేసి ప్రమాదపు అంచుల్లోకి నెట్టేసింది ” అని భక్తులు విమర్శలు చేస్తున్నారు. రేపటి రోజు ఏ విధమైన ముప్పు పొంచి ఉందోనని భక్తుల ఆందోళన చెందుతున్నారు.
ఇదంతా చూస్తుంటే యాదాద్రి దేవాలయ నిర్మాణంలో సీఎం కెసిఆర్ డొల్లతనం రోజుకు ఒకటి వెలుగు చూస్తోంది. “అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక పుణ్యక్షేత్రం” అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా తరతరాలుగా వస్తున్న యాదగిరిగుట్ట పేరును సైతం యాదాద్రిగా మార్చేసింది. గుట్ట పునర్నిర్మాణానికి ఏకంగా రూ 1300 కోట్లు వెచ్చించింది. కానీ నాణ్యత ప్రమాణాలు పాటించడంలో అలసత్వం వహించింది.
దీంతో అభివృద్ధి పనుల డొల్లతనం రోజుకొకటి బయటపడుతోంది. గతంలో ఈదురుగాలులకే యాదాద్రి అతలాకుతలమైంది. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఈనెల 13వ తేదీన దేవాలయంలో దక్షిణ దిశలో స్టోన్ ఫ్లోరింగ్ కుంగిపోయింది. ఆలయమంతా ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు ప్రసాద కాంప్లెక్స్ క్యూబ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. దక్షిణ రాజగోపురం ప్రాంతంలో కృష్ణ స్టోన్ ఫ్లోరింగ్ పగుళ్లు వచ్చింది. ఇది ఎప్పుడు కూలి పడుతుందోనని భక్తులు బిక్కుబిక్కుమంటున్నారు.
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ విస్తరణ పనులపై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. మందిర నిర్మాణ ప్రణాళికలు.. నమూనాలు.. డిజైన్లలో లోపాలే ఈ స్థితికి కారణంగా చెప్పవచ్చు. నీటిపారుదల వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ఆలయ నిర్మాణ పనులు నాణ్యత లేకుండా నాసిరికంగా చేయడం వల్లే వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్య కొండపైనా కింద కూడా భక్తులను ఇబ్బంది పెడుతోంది. దీనికంతటికి కాంట్రాక్టర్లు, అధికారుల బాధ్యతరాహిత్యమే కారణం. ప్రభుత్వపు పర్యవేక్షణ కొరవడంతోనే గుట్ట అస్తవ్యస్తంగా తయారైందని సాధారణ భక్తులు కూడా వాపోతున్నారు. అంతేకాదు, గతంలో వీచిన ఈదురు గాలులకు ప్రధానాలయ విమాన గోపురం పై ఉన్న సుదర్శన చక్రం ఒరిగిపోయింది. ఇలా ఒరగడం అరిష్టానికి సంకేతమని పండితులు చెబుతున్నారు.
కాంట్రాక్టర్ల కక్కుర్తి తోనే..!
ప్రపంచ స్థాయి దేవాలయం నిర్మించాలి అని సీఎం కేసీఆర్ సంకల్పించినా అధికారులు, కాంట్రాక్టర్లు కక్కుర్తికి పాల్పడ్డారు. ఇంజనీరింగ్ లోపాల వల్ల దేవాలయ నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. దిగువన మౌలిక వసతుల ఏర్పాటులో అనేక లోపాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం శిల్పాల పనుల నుంచి కొండ దిగువన నిర్మాణాల వరకు 14 మంది కాంట్రాక్టర్లు పనిచేశారు. ప్రభుత్వ పరంగా ఉన్న స్థానిక ఇంజనీర్లను కాదని కాంట్రాక్టు సంస్థల సైట్ ఇంజనీర్లతోనే పనులన్నీ చేపట్టారు. ఈ తీరుతో స్థానిక అధికారులు కూడా ఆ సహనం వ్యక్తం చేస్తున్నారు.
YTDA (యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ), (CMO) ముఖ్యమంత్రి కార్యాలయం, దేవస్థానం ఉన్నతాధికారుల అండదండలతోనే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేశారనే విషయం స్పష్టమవుతోoది. గుట్ట చుట్టూ నిర్మాణాలు చేస్తున్నప్పుడు స్థానిక ఇంజనీర్లను సంప్రదించకుండానే పనులు చేశారు. వర్షాలు కురిసినప్పుడు ఎటు నుంచి వరద వస్తుంది.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గుర్తించకపోవడంతో రోడ్లు ఎక్కడికక్కడ కోత గురవుతున్నాయి. గత మే నెలలో కురిసిన వర్షానికి ఆలయం చిత్తడిగా మారింది.
ప్రధాన ఆలయంలో పంచతల రాజగోపురం నుంచి.. ధ్వజస్తంభం వరకు వాన నీరు చేరింది. దీంతో చేసేదిలేక దేవస్థానం సిబ్బంది బకెట్లతో నీటిని ఎత్తిపోశారు. ఈ సందర్భంగా గంటల తరబడి దర్శనాలు నిలిపివేసి భక్తులకు చుక్కలు చూపెట్టారు అధికారులు. అష్టభుజ మండపాలు, ప్రాకార మండపం, లిఫ్ట్ మార్గంతో పాటు మరిన్ని స్థలాల్లో వర్షం నీరు లేకై ఆలయమంతా బురద మయమైంది. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరిపించే రీతిలో నిర్మాణం అంటూ చేసిన ప్రకటనలు వెక్కిరిస్తున్నాయి.
మొదటినుంచే వివాదం
ఆలయం పునర్నిర్మించే సమయంలోనే అధికారులు అనేక అపశ్రుతులకు పాల్పడ్డారు. ఆలయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎవరిని రానీయలేదు, మీడియాను సైతం. శిల్పాలు చెక్కే సమయంలో దేవాలయ స్తంభాలపై మసీదు, పీర్లు, చర్చి, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, కెసిఆర్ చిత్రపటాలను చెక్కారు. అంతటితో ఆగలేదు..కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లోగోలను కూడా చెక్కారు. దీంతో విశ్వహిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. హిందూ దేవాలయంపై అన్యమతస్తుల ప్రార్థనా స్థలాల చిత్రాలు, జాతీయ నాయకుల చిత్రాలు ఎందుకని నిలదీసింది.
అయితే ప్రభుత్వం తమను తాను సమర్థించుకునే విధంగా మాట్లాడుతూ.. ఇది సెక్యులర్ గుడి అని, అన్ని మతాలకు సమానమని బుకాయించింది. దీంతో విశ్వహిందూ పరిషత్ , భాజపాలు పెద్ద ఎత్తున అప్పట్లో గుట్టను ముట్టడించాయి. వేరే మతస్తుల చిత్రాలను తొలగించకపోతే మరో “కర సేవ”కు పిలుపునిస్తామని హెచ్చరించాయి. దీనికి తోడుగా గుట్టను వెరే మతస్తులకు అప్పజెప్తున్నారనే ప్రచారం కింది స్థాయి వరకు వెళ్లిపోయింది. దీంతో భక్తులందరూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పటికే వాస్తవం గ్రహించిన ముఖ్యమంత్రి అన్ని మతాల చిత్రాలను తొలగించారు. ఇది విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ విజయంగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పట్లో నాతోపాటు మరో 9 మంది విశ్వహిందూ పరిషత్ నాయకుల పై కేసులు కూడా నమోదై, ఇపటికీ కొనసాగుతునాయి కాబట్టి. ఒకవేళ VHP ఆందోళనకు దిగకపోతే నేడు దేవాలయంలో మసీదు, చర్చి, హిందూ వ్యతిరేకుల చిత్రాలు అక్కడి స్తంభాలపై చెక్కేవారు.
గుడి ప్రారంభమయ్యాక గుట్టపైకి వచ్చే భక్తులపై అధికారులు అనేక విధంగా విరుచుకుపడ్డారు. లెక్కలేని ఇబ్బందులు గురి చేశారు. గుట్టపై కారు పార్కింగ్ కు ఏకంగా 500 రూపాయలు, ఆ తర్వాత గంట గంటకు 100 రూపాయలు చొప్పున పన్ను విధించారు. దీనిపై కూడా VHP ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. అయితే దాదాపు 2000 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మందిరం పనుల్లో అనేక అవకతకులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. వాటిని సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ కూడా ఉంది. ఏది ఏమైనా హిందూ దేవాలయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం మానుకోవాలి.
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శించారు. కాశీలో నరేంద్ర మోడీ ప్రతిష్టముఖంగా ఆలయం నిర్మించి నాణ్యత విస్మరించారని ఆరోపించారు. “కాశీ అనేది పవిత్ర పుణ్యక్షేత్రం.. అక్కడ రాజకీయాలు లేకుండా హిందువుల మనోభావాలు గౌరవించే స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలి. కానీ… నట్లు, బోల్టులతో ఆలయ నిర్మించి తప్పు చేశారు. వర్షం పడితే ఆలయ గోపురం కూలింది, అది అరిష్టo”అని సీఎం ఆరోపించారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో తాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన యాదాద్రి మందిరం రోజుకు ఒక ప్రదేశంలో శిథిలానికి గురవుతోంది. చిన్నపాటి వర్షాలకి రోడ్లు కొట్టుకుపోతున్నాయి. భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షానికి ఆలయ విమాన గోపురం పై ఉన్న సుదర్శన చక్రం ఒరిగిపోయిన విషయం గుర్తు చేసుకోవాలి. రాజకీయ విమర్శల్లో భాగంగా నరేంద్ర మోడీ గారిని విమర్శించవచ్చు, కానీ కాశీలో నిర్మించిన ఆలయంలో ఎటువంటి అపశ్రుతులు దొర్ల లేదనే విషయం గమనించాలి. కాబట్టి ఇతరులను విమర్శించే ముందు తాను చేసిన పనిని సమీక్షించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
– పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్( VHP)
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010