తిరుమలలో 16న పార్వేట ఉత్సవం

-అదే రోజు గోదా కళ్యాణం
-శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..ఆరోజు అర్జీత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ ”తన్నీరముదు” ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబివారికి మేల్‌చాట్‌ శేషవస్త్రాన్ని సమర్పించారు.

శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీతిరుమలనంబి. వీరు సాక్షాత్తు శ్రీ భగవత్‌ రామానుజాచార్యులవారికి మేనమామ.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం జనవరి 16 వతేదీ ఘనంగా జరగనుంది. అదే రోజున గోదాపరిణయోత్సవం నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ మ‌ఠం నుంచి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్లి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

అనంత‌రం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు. ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 14న భోగితేరు, 15న మకరసంక్రాంతి
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జనవరి 14న భోగితేరు, జ‌న‌వ‌రి 15న మకరసంక్రాంతి ప‌ర్వ‌దినాలు జరుగనున్నాయి. జనవరి 14న భోగి పండుగ రోజున సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు.

జనవరి 15న మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఆల‌యం నుండి చ‌క్ర‌త్తాళ్వార్‌ను ఊరేగింపుగా క‌పిల‌తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ చ‌క్ర‌స్నానం అనంత‌రం ఆస్థానం చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజస్వామివారు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. జనవరి 16న ఉద‌యం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు.

శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని క‌పిల‌తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ ఏకాంతంగా తిరుమంజ‌నం అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు. ఆల‌యంలో సాయంత్రం 4 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ గోదాక‌ల్యాణం వేడుకగా నిర్వ‌హిస్తారు. అదేవిధంగా, జ‌న‌వ‌రి 17న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యం నుండి రేణిగుంట రోడ్డులోని పార్వేట‌మండ‌పానికి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని వేంచేపు చేస్తారు. అక్క‌డ ఆస్థానం అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు.

శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు ప్రారంభం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు.

అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపట్టారు. ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారు
శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణచేసి ఊరేగింపుగా తిరిగి శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ విధంగా ఏడు రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది.

Leave a Reply