చిన్నపిల్లల చిక్కీలను కూడా వదలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి!

• రూ.200కోట్ల విలువైన పప్పుచెక్క టెండర్ లోనూ నయా స్కామ్ కు తెరలేపిన జగన్ సర్కార్
• * టెండరు నిబంధనలు మార్చి మరీ అస్మదీయులకు దోచిపెట్టే ప్రయత్నం*
• కేంద్రప్రభుత్వ భాగస్వామ్య సంస్థలను డిస్ క్వాలిఫై చేసి మరీ అనుయాయులకు అప్పగింత
• జీతాల కోతపై ఉద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే కోట్లు దిగమింగడం కోసం పప్పుచెక్కలో స్కాంకు పాల్పడ్డారు
• తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకరుల సమావేశం వివరాలు:
జగన్ రెడ్డి సర్కారులో దాదాపు మూడు సంవత్సరాలుగా అనేకరకాల స్కామ్ లు చూశాం, ఇసుక, మద్యం, మైనింగ్ స్కామ్ లు గమనించాం. బాక్సైట్, గ్రానైట్, ల్యాండ్ స్కామ్ లలో వేలకోట్లు దోచేశారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో దేనినీ వదిలిపెట్టలేదు. తాజాగా చిన్నపిల్లలకు అందజేసే చిక్కీ (పప్పు చెక్క) సరఫరాకు సంబంధించి విడుదల చేసిన రూ.200 కోట్లరూపాయల విలువైన టెండర్లలో కూడా నయా స్కామ్ కు తెరలేపారు. భారీఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన విధానాన్ని బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇప్పటివరకు ఆధారాలతో సహా చూపాం. డాక్యుమెంటరీ ఆధారాలతో స్కామ్ లను బయటపెట్టాం. ఒక ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏవిధంగా దోచుకుంటాడో జగన్ రెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ.ఇది కూడా చదవండి: ఆ ఆరు కంపెనీలకు ‘చిక్కి’న టెండర్

తాజాగా జరిగిన ఈ చిక్కీ స్కామ్ చూశాక మరీ ఇంత నీచానికి దిగజారతారా అని బాధ కలిగింది. కొన్ని విషయాల్లో కొద్దిగా ఆలోచన చేస్తాం, అందులో కొన్ని సెంటిమెంట్ తో కూడిన అంశాలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది విద్యార్థులు స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్నారు. వారికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వందల,వేల కోట్లరూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా విద్య,వైద్యం అనే అంశాలు తమ ప్రాధమిక బాధ్యతగా భావించి ఇతోధికంగా ఖర్చుచేస్తారు.

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వేల కోట్లరూపాయలు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ఖర్చుచేస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య పెంచడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. చంద్రబాబునాయుడు గారి హయాంలో మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేకమైన దృష్టి సారించి అనేక పౌష్టిక పదార్థాలతో అప్పగించి నాణ్యమైన భోజనం అందించేవారు. అక్షయపాత్ర వంటి ప్రఖ్యాత సేవాసంస్థలను కూడా ఈ పథకంలో భాగస్వాములను చేసి నాణ్యమైన ఆహారాన్ని అందించే ప్రయత్నం చేశారు. కానీ, నేటి జగన్ సర్కార్ పిల్లలకు సంబంధించిన అటువంటి పథకంలో కూడా డబ్బు కాజేయాలని చూడటం అత్యంత బాధాకరం.

నేటి వరకు వివిధరకాల స్కాముల్లో వేలకోట్లు దిగమింగిన జగన్ రెడ్డి సర్కారు… వారానికి మూడుసార్లు విద్యార్థులకు ఇచ్చే చిక్కీ (పప్పుచెక్క)లో కూడా కక్కుర్తి పడింది. ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుందా…ఆధారాలతో సహా మాట్లాడుతున్నా. ఏమిటీ ఈ పనులు? పప్పుచెక్కలో కూడా కక్కుర్తి పడటం ఏమిటి? బుద్ది,జ్జానం ఉండాలి కదా ఈ ప్రభుత్వానికి. చిక్కీ సరఫరాకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13జిల్లాల్లో 2021-22 సంవత్సరానికి 198 కోట్లు బడ్జెట్ ను కేటాయించారు.

ఈ భారీ మొత్తం చూశాక జగనన్న కన్ను చిక్కీపై పడింది. వెనువెంటనే టెండరు నిబంధనలను మార్చి ఆరు అస్మదీయ కంపెనీలతో సిండికేట్ ఏర్పాటుచేసి టెండరు కొల్లగొట్టారు. దీనికి ఆధారంగా 2020-21, 2021-22 టెండరు డాక్యుమెంట్లు మీ ముందుంచుతున్నాను. ఏరకంగా నిబంధనలు మార్చి అనుకూల కంపెనీలకు టెండరు ఏవిధంగా కట్టబెట్టారో చూడండి.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన కేంద్రీయ భండార్ (సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్), నేషనల్ కన్సూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఎన్ సిసిఎఫ్)లను టెండర్లలో డిస్ క్వాలిఫై చేసి మరీ తమకు అనుకూలురైన ఆరు కంపెనీలకు చిక్కీ టెండర్లు కట్టబెట్టారు. పాత టెండరు డాక్యుమెంట్ లో ఉన్న కీలకమైన నిబంధనలను ఏరకంగా తమకు అనుకూలంగా మార్చి కొత్త టెండరు డాక్యుమెంటు తయారుచేశారో ఇప్పుడు చూద్దాం.

ఎ). పాతటెండరు డాక్యుమెంటులో బిడ్ దాఖలు చేసే కంపెనీకి గడచిన మూడు సంవత్సరాల్లో వార్షిక టర్నోవర్ టెండరు విలువకు సరిసమానంగా కానీ, అంతకంటే ఎక్కువగానీ ఉండాలన్న నిబంధన ఉంటే… జగన్ సర్కార్ తమ కంపెనీలకు అనుకూలంగా రూపొందించిన కొత్త టెండరు డాక్యుమెంట్ లో గడచిన మూడు సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలో బిడ్ దాఖలు చేస్తున్న కంపెనీ వార్షిక టర్నోవర్ టెండరు విలువకు సరిసమానంగా కానీ, ఎక్కువ గానీ ఉంటే చాలని నిబంధనను మార్చారు. ఈ మార్పు దేనికి సంకేతం? మీరు అనుకున్న కంపెనీలకు మేలుచేసి వాటి ద్వారా కోట్లు కొల్లగొట్టడానికి చేసిన ప్రయత్నం కాదా?
బి). పాత టెండరు డాక్యుమెంట్ లో బిడ్ దాఖలు చేయుచున్న కంపెనీకి FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా), ప్రపంచవ్యాప్తంగా ఆమోదం కలిగిన HACCP (హజార్డ్ ఎనాలసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్), ISO వంటి మూడు కీలకమైన సర్టిఫికేషన్లు కనీసంగా కలిగి ఉండాలని నిబంధన ఉండగా, దానిని తుంగలో తొక్కి కేవలం ఒక్క ఎఫ్ఎస్ఎస్ఎఐ సర్టిఫికేషన్ ఉంటే చాలని కొత్త

టెండరు డాక్యుమెంటులో పొందుపర్చడం ఏమని తెలియజేస్తుంది? మీకు అనుకూలమైన కంపెనీలకు హెచ్ఎసిసిపి వంటి అంతర్జాతీయ సర్టిఫికేషన్లు పొందడం కష్టమని తొలగించారా? సమాధానం చెప్పండి.
సి). పాతటెండరు డాక్యుమెంట్ లో బిడ్ దాఖలు చేయు కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్ మెంట్లకు, ఆర్గనైజేషన్లకు, లోకల్ బాడీలకు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (పిఎస్ యు) సంస్థలకు సరఫరా చేసిన అనుభవం ఉండాలన్న నిబంధన ఉంటే కొత్త టెండరు డాక్యుమెంట్ లో ముందు ఉదహరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకే గాక ప్రైవేటు సంస్థలకు కూడా సరఫరా చేసిన అనుభవం సరిపోతుందన్న విధంగా నిబంధన మీకు అనుకూలంగా మార్చుకున్న మాట వాస్తవం కాదా? ప్రైవేటు సంస్థలకు చేసిన సరఫరా కూడా బిడ్ దాఖలు చేయడానికి చెల్లుబాటు అవుతుందన్న విధంగా నిబంధనను ఏ అస్మదీయుడి కోసం మార్చారు?
డి). పాత టెండరు డాక్యుమెంట్ లో నాలుగు ప్యాకేజిలుగా ఉన్న టెండరును కొత్త టెండరు డాక్యుమెంట్ లో ఆరు ప్యాకేజిలుగా మార్చింది మీ ఆరు కంపెనీల కోసమేనా?
ఇ). పాత టెండరు విలువ 13జిల్లాలకు కలిపి రూ.136 కోట్లు ఉంటే కొత్త టెండరు విలువ ఒక్క సంవత్సరంలోనే 62కోట్లు పెరిగి రూ.198 కోట్లకు చేరింది. ఉదాహరణకు ఉత్తరాంధ్రకు సంబంధించి రూ.24కోట్లు ఉన్న టెండరును రూ.31కోట్లకు పెంచేశారు.

టెక్నికల్ బిడ్ లో అనూహ్యాంగా కేంద్రప్రభుత్వ భాగస్వామ్యం కలిగిన సంస్థ అయిన కేంద్రీయ భండార్ ను డిస్ క్వాలిఫై చేస్తే వారు హుటాహుటిన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకు వారు సమర్పించిన అఫిడవిట్ లో తమకు రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి నివాసం, పార్లమెంటు వంటి ప్రతిష్టాత్మకమైన సముదాయాలకు సరఫరా చేసిన అనుభవం ఉందని తెలిపింది. అటువంటి తమకు రాష్ట్రంలో చిక్కీ సరఫరా చేయుటకు తగిన అనుభవం లేదంటూ డిస్ క్వాలిఫై చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. తాము మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇదే చిక్కీ సరఫరాకు సంబంధించిన టెండరు దక్కించుకొని ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సరఫరా చేస్తున్నామని, రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖకు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.

మధ్యాహ్న భోజన పథకానికి 60శాతం కేంద్రమే నిధులు అందిస్తుందని (పిఎం పోషణ) అన్న పేరుగల ఈ పథకాన్ని రాష్ట్రంలో జగనన్న గోరుముద్దగా మార్చుకున్నారని తెలియజేశారు. 29-9-2021న టెండరు విడుదల చేసి 12-10-2021 బిడ్ దాఖలుకు ఆఖరుతేదీగా నిర్ణయించారని, 1-12-2021న ఈ-ప్రొక్యూర్ మెంట్ వెబ్ సైట్ లో తమను “నాట్ క్వాలిఫైడ్” గా పేర్కొని డిస్ క్వాలిఫై చేసినట్లు తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యామని పేర్కొన్నారు. చిక్కీ సరఫరాకు సంబంధించి రాష్ట్రాన్ని ఆరు ప్యాకేజిలుగా విభజించి ఆరు కంపెనీలను సిండికేట్ గా ఏర్పాటుచేసి టెండరు ప్రక్రియను హైజాక్ చేశారని తెలియజేశారు. విక్టరీ బజార్, మారుతీ ఆగ్రోస్, బాలజీ గ్రౌండ్ నట్ ఆయిల్స్ లిమిటెడ్, శ్రీ సాంబశివ డైరీ ప్రోడక్ట్స్, సన్వారియా స్వీట్స్ ప్రైవేట్ లిమిటెట్, ఎం. ఫర్ మిల్లెట్స్ (హైదరాబాద్) అనే ఈ ఆరుకంపెనీలతో సిండికేట్ ఏర్పాటుచేసి ఆ కంపెనీలకు అనుకూలంగా టెండరు డాక్యుమెంట్ లో నిబంధనలను మార్చి కేంద్రప్రభుత్వ భాగస్వామ్య సంస్థలైన కేంద్రీయ భండార్, NCCF లను డిస్ క్వాలిఫై చేయడం జరిగింది.

సిండికేట్ కంపెనీ అయిన మారుతీ ఆగ్రోస్ కంపెనీ 30-9-2020న జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నట్లు అధికారిక జిఎస్టీ రికార్డుల్లో ఉన్నది. టెండరు డాక్యుమెంటులో బిడ్ దాఖలు చేయుచున్న కంపెనీ గడచిన మూడు సంవత్సరాల జిఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయాలని నిబంధన ఉండగా, మరి సెప్టెంబర్ 2020న మాత్రమే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్న మారుతీ ఆగ్రోస్ కంపెనీ టెక్నికల్ ఎవాల్యుయేషన్ లో ఏరకంగా క్వాలిఫై అయిందో రాష్ట్రప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇదే మారుతీ ఆగ్రోస్ కంపెనీ చిక్కీ ఉత్పత్తి కర్మాగారానికి సంబంధించిన ఫ్యాక్టరీ లైసెన్సు కూడా తీసుకున్నది 2021లో మాత్రమేనని తెలియవస్తున్నది.

మరి ఆ రకంగా మూడుసంవత్సరాల జిఎస్టీ నిబంధనను ఉల్లంఘించిన మారుతీ ఆగ్రోస్ కంపెనీకి టెండరు ఏవిధంగా కట్టబెడతారు? అదేవిధంగా బాలాజీ గ్రౌండ్ నట్ ఆయిల్ కంపెనీకి కూడా చిక్కీ ఉత్పాదనలో ఎటువంటి అనుభవం లేదు. అయినా వారిని కూడా టెండరులో క్వాలిఫై చేసి ఒక ప్యాకేజిని కట్టబెట్టారు. ఆరుకంపెనీలు టెండరులో పోటీపడితే ఒక్కొక ప్యాకేజి ఒక్కొక కంపెనీ ఎలా దక్కించుకున్నాయి? రివర్స్ టెండరింగ్ లో ఎల్ 1 గా నిలచిన కంపెనీ కోట్ చేసిన ధర బయటకు వస్తుంది కాబట్టి అంతకంటే తక్కువకు ధర కోట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సునాయాసంగా సిండికేట్ గా ఏర్పడే అవకాశముంది. కాబట్టి పకడ్బందీగా ప్లాన్ చేసి సిండికేట్ ఫాం చేసి దోచుకుతున్నారు. చిన్నపిల్లలకు ఇచ్చే చిక్కీలోనూ ఇంతనీచమా?

మధ్యాహ్న భోజన పథకం అమలుచేసే డిపార్ట్ మెంట్ కు బిఎం ధివాన్ డైరక్టర్ గా, ఎ.సుబ్బారెడ్డిలను అడిషనల్ డైరక్టర్లుగా నియమించి ప్రాజెక్ట్ అమలు బాధ్యతను కట్టబెట్టారు. వారి సహకారంతోనే పప్పుచెక్క స్కాంకు తెరలేపారు. కేంద్రీయ భండార్ వారు న్యాయపోరాటానికి దిగితే వారిని భయపెట్టి విత్ డ్రా చేయించారు. కేంద్రప్రభుత్వ సంస్థ ఎందుకు అర్హత సాధించలేకపోయింది. మధ్యప్రదేశ్ లో కూడా కేంద్రీయ భండార్ సరఫరా చేస్తోంది. రాష్ట్రపతి భవన్, ప్రధాన మంత్రి నివాసం, పార్లమెంటుకు సరఫరా చేసిన అనుభవం రాష్ట్రానికి పనికిరాలేదా? కేవలం మీకు అనుకూలమైన సంస్థలకు టెండరు దోచిపెట్టడానికి మాత్రమే కేంద్ర సంస్థలను డిస్ క్వాలిఫై చేశారు. ముందుగానే ఒక పథకం ప్రకారం 200కోట్ల దోపిడీకి స్కెచ్ వేసి అమలుచేశారు.

గతంలో ఇటువంటి స్కామ్ ఉత్తరాదిన బయటపడితే మంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు మంత్రి ఆదిమూలపు రాజీనామా చేస్తారా? కేంద్రప్రభుత్వ నిధులతో అమలవుతున్న ఈ పథకంలో జరిగిన అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండు కేంద్రప్రభుత్వ సంస్థలను డిస్ క్వాలిఫై చేసిన ఘటనపై విచారణ జరిపించాలి. తాజాగా పిలచిన టెండర్లను రద్దుచేసి పాత నిబంధనల ప్రకారం టెండరు పిలవాలని కోరుతున్నా. ఒకవైపు ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టినందుకు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు పప్పుచెక్కల్లో కూడా కోట్లు తినేస్తున్నారు. తెచ్చిన అప్పులను ఈవిధంగా దిగమింగుతుంటే ఇక జీతాలు ఏం ఇస్తారు? ఈ దోపిడీని రాష్ట్ర ప్రజానీకం గమనించాలి.

Leave a Reply