Suryaa.co.in

Andhra Pradesh

పేర్ని నానిని సమాచార శాఖామంత్రిగా కంటే దుష్ప్రచార శాఖా మంత్రి అనడం సమంజసం

– రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి మించి జీతాల కోసం ఖర్చు చేస్తున్నామని పేర్ని నాని చెప్పడం పచ్చి అబద్దం
– వైసీపీ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నవంబర్, 2021 వరకు ఆదాయం మరియు అప్పుల రూపంలో రూ.5,89,891 కోట్లు ఖజానాకు చేరుకోగా ఉద్యోగుల జీతభత్యాల కోసం ఖర్చు చేసింది రూ. 1,51,000 కోట్లు అంటే కేవలం 25 శాతం మాత్రమే
– తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2015 లో అత్యధికంగా 43శాతం ఫిట్ మెంట్ ప్రకటించడం వల్ల ఒక్క ఆర్దిక సంవత్సరంలోనే రూ.15 వేల కోట్ల అధనపు భారం పడినా ఆర్దిక క్రమశిక్షణతో అధిగమించాం
– టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన అన్ని వర్గాల వారిని పట్టిపీడిస్తోందని, జగన్ రెడ్డి ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదని, రైతులను, వ్యాపారులను, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలను, కార్మికులు పై ఇప్పిటి వరకు రకరకాలు భారాలు మోపి కోతలకు గురిచేసి నేడు ఆ జాబితాలోకి ఉద్యోగస్తులను కూడా చేర్చారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.

శనివారం మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. వైసీపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను అన్ని రకాలుగా దుర్భరం చేసేసింది. ఈరోజు ఉద్యోగస్తులు ప్రత్యక్షంగా పడుతున్న బాధలను మనం చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడం కోసం ఉద్యమకార్యాచరణను ఏ విధంగా అమలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులను నమ్మించి మోసం చేశారు జగన్ రెడ్డి.

నాడు ప్రతిపక్షనాయకుడిగా అనేక రకాల వాగ్దానాలను ఉద్యోగులకు ఇచ్చి, నమ్మించి నట్టేట ముంచారు. మోసపోయామని తెలుగుకున్న ఉద్యోగస్తులు కడుపుమండి రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారు. ఉద్యోగులు చేస్తున్న వారి పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మదత్తు తెలియజేస్తోంది.
నిన్న పేర్ని నాని ఎప్పటిలాగే మీడియా ముందుకు వచ్చి ప్రజలకు అవాస్తవాలను వండి వార్చారు. అది చూసిన తర్వాత పేర్ని నాని గారిని సమాచార శాఖామంత్రి అనడం కంటే దుష్ప్రచార శాఖా మంత్రి అనడం సమంజసంగా ఉంటుంది. ఆయన ప్రజలకు ఏ నాడు వాస్తవాలను తెలియజేయలేదు. ఎప్పుడూ అబద్దాలతో, అవాస్తవాలతో కూడిన సమాచారాన్నే ఇస్తూ ఉంటారు. అందుకే ఆయనను దుష్ప్రచార శాఖామంత్రి అంటే బాగుంటుంది. రాష్ట్రం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, అయినా ముఖ్యమంత్రి గారు చాలా పెద్దమనసు చేసుకుని ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని డప్పాలు కొట్టుకుంటున్నారు. 27 శాతం ఐ.ఆర్ ఉంటే అందులో 4 శాతం కోతపెట్టి 23 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడాన్ని పెద్దమనసు అంటారా? 4 శాతం కోతపెట్టడాన్ని పెద్దమనసు అంటారనడానికి పేర్ని నాని సిగ్గుపడాలి.

రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగి జీతంలో రివర్స్ పీఆర్సీతో కోతపెట్టి ప్రతీ నెల రూ. 750 కోట్లు రాష్ఠ్ర ప్రభుత్వం ఆదా చేసుకోవడాన్ని ఉద్యోగస్తుల పట్ల ముఖ్యమంత్రిగారు ప్రేమ చూపడం అంటారా?. రూ.16 వేల కోట్ల రూపాయలు ఆర్ధిక లోటులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఏ విధంగా ఇచ్చిందో, ఏ వర్గం ప్రజలపై కూడా రూపాయి భారం పడకుండా, పన్నులు, ఛార్జీలు పెంచకుండా ఏ విధంగా పరిపాలన చేశామో ప్రజలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీ నెల ఒకటో తారీఖున టంచనుగా జీతాలు అందేవి.

కానీ, నేడు ఆ పరిస్తితి లేదు. ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఎప్పుడు జీతాలు పడుతాయో అని గాలిలోకి చూసే పరిస్థితి దాపురించింది. ఉద్యోగస్తుల రివర్స్ పీఆర్సీ అమలు వల్ల నేడు రూ. 10 వేల కోట్ల భారం పడుతుందని ముసలి కన్నీరు కారుస్తున్న జగన్ రెడ్డి తన లూటీ, దుబారా తగ్గించుకుంటే ఎటువంటి భారం పడదని గుర్తుంచుకోవాలి.

సిఏజీ లెక్కల ప్రకారం 2014-15 లో ఏడాదికి ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్లకు అయిన ఖర్చు 23,678 కోట్లు. ఇది చంద్రబాబు నాయుడు 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించక ముందు ఉన్న ఖర్చు. 2015-16 లో 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన తర్వాత అది రూ. 38,251 కోట్లకు చేరింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వంపై ఒక్క ఏడాదిలోనే రూ.15 వేల కోట్ల అదనపు భారం పడింది. నాడు ఉద్యోగుల కోసం దాదాపు రూ.15 వేల కోట్ల భారం తెలుగుదేశం ప్రభుత్వం భరించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా కష్టపెట్టకూడదని నాడు అన్ని వర్గాలను సంతృప్తిపరిచాం. రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించే క్రమంగా ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. కేవలం ఒక ఆర్దిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల భారం పడుతున్నా నాడు చంద్రబాబు నాయుడు వెనుకాడలేదు.

జగన్ రెడ్డిలా బీద అరుపులు అరవలేదు. నాడు విభజన సమయంలో కోవిడ్ కంటే కూడా అధిక కష్టాలు ఉన్నాయి. కోవిడ్ లో ఉన్న ఆర్దిక కష్టాల కంటే విభజన సమయంలో ఉన్న ఆర్ధిక కష్టాలే ఎక్కువ. రూ. 16 వేల కోట్ల రూపాయల ఆర్ధిక లోటుతో నాడు తీవ్ర ఆర్ధిక ఆందోళన పరిస్థితి ఉంది. కానీ, చంద్రబాబు నాయుడు తన సమర్ధతతో ఎక్కడా ఏ వర్గాన్ని కష్టపెట్టలేదు. విద్యుత్ ఛార్జీలు గానీ, రవాణా ఛార్జీలు గానీ, పన్నులు భారంగానీ ప్రజలపై మోపలేదు. పేదవాడిపై ఒక్క రూపాయి భారం వేయలేదు. అంతేకాదు, అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి సమర్ధవంతంగా అమలు చేశారు. ఈ రోజు రూ.10 వేల కోట్ల భారం గురించి మాట్లాడున్న పేర్ని నాని నాడు రూ.15 వేల కోట్ల అదనపు భారం తెలుగుదేశం ప్రభుత్వం సునాయాసంగా మోసిన సంగతి తెలుసుకోవాలి.

23 శాతం ఫిట్ ఇచ్చి బీద అరుపులు అరుస్తున్న వైసీపీ మంత్రులు నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల గారి ఆర్ధిక క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలి. నాడు తెలుగుదేశం లో ఏ మంత్రి కూడా వైసీపీ మంత్రుల్లా బీద అరుపులు అరవలేదు. పరిపాలన చేతగాక, పరిపాలన నైపుణ్యం లేక వైసీపీ నేతలు బీద అరుపులు అరుస్తున్నారు. వైసీపీ నేతలకు తెలిసిందల్లా ప్రజలను దోచుకోవడం….దాచుకోవడమే.

రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయిందని చెబుతున్న పేర్నినానికి కాగ్ లెక్కల ఆధారాలతో సమాధానం చెబుతున్నాం. పేర్ని నానిలా ఎవరో రాసిచ్చిన కాగితం పట్టుకుని మీడియా ముందుకు రాలేదు. 2018-19 లో తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన ముగిసే నాటికి ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాల భారం రూ. 49,884 కోట్లు. అంటే దాదాపు రూ. 50 వేల కోట్లు. జగన్ రెడ్డి హయాంలో 2019-20 కి నాటికి అది రూ. 53,565 కోట్లు. అంటే పెరిగింది షుమారు 3,500 కోట్లు మాత్రమే. 2020-21 కి అది రూ. 57,462 కోట్లకు చేరింది.

అంటే, వైసీపీ ప్రభుత్వంపై 2018-19 తో పోల్చుకుంటే పడిన ఉద్యోగుల జీతాల భారం అదనంగా రూ 7 వేల కోట్లు మాత్రమే. కానీ, నిన్న నిస్సిగ్గుగా పేర్ని నాని 2020-21 లో రూ. 67,340 కోట్లు జీతాల ఖర్చు భారం పడిందని పచ్చి అబద్దాలు ఆడారు. మంత్రి గారికి సి.ఏజీ రిపోర్టులోని అంకెలు మార్చడానికి కూడా ఏ మాత్రం సిగ్గులేదు. ఐ.ఆర్ రూపంలో రూ 17 వేల కోట్ల భారం వైసీపీ ప్రభుత్వంపై పడిపోయిందని అబద్దాలు ఆడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కులు వాస్తవమైతే అవి సిఏజీ రిపోర్టుల్లో ఎందుకు కనపడటం లేదు?

2019-20 లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ. 1,11,034 కోట్లు. 2020-21 లో 1,17,136 కోట్లు, 2021-22 నవంబర్ నాటికి రూ. 88,618 కోట్లు. మూడు ఆర్దిక సంవత్సరాలలో (నవంబర్, 2021 వరకు) వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అక్షరాల రూ. 3,16,788 కోట్లు. దీనికి అదనంగా చేసిన అప్పు 2019-20 లో రూ. 46,205 కోట్లు, 2020-21 లో రూ. 55,161 కోట్లు, 2021-22 నవంబర్ నాటికి రూ. 49,976 కోట్లు. అనగా మొత్తం 1,51,342 కోట్లు. వీటికి అధనంగా కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు రూ. 1,21,761 కోట్లు. అంటే మొత్తం ప్రభుత్వ మరియు కార్పొరేషన్ల అప్పు 2,73,103 కోట్లు. అప్పులు, ఆదాయం రెండూ కలుపుకుని వైసీపీ ప్రభుత్వ ఖజానాలోకి వచ్చి చేరిన డబ్బు అక్షరాల రూ.5,89,891 కోట్లు (3,16,788+2,73,103).

ఇక, జీతాలకు అయిన ఖర్చు 2019-20 లో రూ.53,565 కోట్లు, 2020-21 లో మరో రూ.57,462 కోట్లు, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2021-22 నవంబర్ నాటికి మరో షుమారుగా రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారు. అంటే మొత్తంగా జీతభత్యాల కోసం జగన్ రెడ్డి సర్కార్ నవంబర్ 2021 వరకు చేసిన ఖర్చు కేవలం రూ. 1,51,027 కోట్లు. జగన్ రెడ్డి ఖజానాకు చేరిన 5,89,895 కోట్లలో అది కేవలం 25 శాతం మాత్రమే. కానీ పేర్ని నాని రాష్ట్ర ఆదాయంలో 110 శాతం జీతభత్యాల కోసం ఖర్చు చేస్తున్నామని నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి మించి జీతాల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పడం దుర్మార్గం.

నేను చెబుతున్న ఒక లెక్కైనా తప్పని రుజువు చేసే దమ్ము, ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా అని సవాల్ విసురుతున్నాను. ప్రభుత్వం వద్ద రూపాయి లేదని మాట్లాడుతున్న మంత్రులు వేల కోట్లు దిగమింగకుండా, దోచుకోకుండా ఉంటే ఈ ఆర్ధిక ఇబ్బందులు ఉండేవి కావని గుర్తించుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ ఉంది కాబట్టే నాడు ఏడాదికి రూ. 15 వేల కోట్లు జీతభత్యాల భారం పడినా మోయగలిగాం. రాష్ట్ర సంపద పెంచి అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చూసుకోగలిగాం. కానీ. నేడు వైసీపీ ప్రభుత్వంలో ఆర్దిక క్రమశిక్షణ లోపించింది.

అందుకే అన్ని వర్గాల ప్రజలపై భారం మోపుతున్నారు. సి.పి.ఎస్ రద్దు ఏమైంది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో పనిచేసే ఉద్యోగస్తులను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అయిన APCOS లోకి ఎందుకు తీసుకోలేదు? వారిని రెడ్డి ఎంటర్ ప్రైజెస్ కిందకు ఎందుకు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలి. రెడ్డి ఎంటర్ ప్రైజెస్ పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు జగన్ గ్యాంగ్ దోచుకోవడానికా? APCOS ఉండగా మధ్యం దుకాణాలలో పనిచేసే వారిని రెడ్డి ఎంటర్ ప్రైజెస్ లోకి తీసుకు రావాల్సిన అవసరం ఏంటో సమాధానం చెప్పగలరా?

పీఆర్సీ నివేదిక అనేది ఒక ఓపెన్ డాక్యుమెంట్. కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే ఏ ముఖ్యమంత్రైనా దాన్ని ఉద్యోగులకు ఇస్తారు. కానీ, జగన్ రెడ్డి ఇప్పటి వరకు నివేదిక కాపీని కూడా ఉద్యోగులకు ఎందుకు ఇవ్వలేదు? కనీసం పీఆర్సీ రిపోర్టును కూడా బయటపెట్టని వైసీపీ ప్రభుత్వం ఉద్యోగస్తుల గురించి, పారదర్శకత గురించి మాట్లాడే అర్హత లేదు.

సి.పి.ఎస్ రద్దు చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకొచ్చిన కాంపెన్పేటరీ సిటీ అలవెన్స్ (సిసిఏ) ను రద్దు చేశారు. దీని ద్వారా ప్రతీ ఉద్యోగికి ప్రతీ నెల రూ.700 లు అధనంగా వచ్చేది. 70 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లకు నేటి వరకు ఇచ్చిన అడిషనల్ పెన్షన్ బెనిఫిట్ ను కూడా రద్దు చేశారు. కేవలం 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఇస్తామని చెప్పడం వృద్దాప్యంలో ఉన్న పెన్షన్లను దగా చేయడం కాదా? మీరు మనుషులా, మీకు మనసుందా? వయసు పైబడిన ముసలివాళ్ల అదనపు పెన్షన్ బెనిఫిట్ ను తొలగించడం దుర్మార్గం కాదా?

వైసీపీ ప్రభుత్వ ఇప్పటి వరకు 7 డిఏలు పెండింగ్ పెట్టి ఇప్పుడు వాటిల్లో కూడా కోత పెడుతున్నారు. జూన్ 2019 నుంచి 27 శాతం ఐఆర్ ఇచ్చామని గొప్పటు చెప్పుకుంటున్న జగన్ సర్కార్ రివర్స్ పీఆర్సీ ప్రకటించిన సంధర్బంలో ఏప్రిల్ 2020 నుంచి మానిటరీ బెనిఫిట్స్ వర్తింప చేస్తామని ప్రకటించి దానికి ముందున్న 9 నెలల కాలానికి చెల్లించిన అదనపు ఐఆర్ మొత్తాన్ని నిస్సిగ్గుగా డిఏలలో కోత పెడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం.

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచమని వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరడిగారు? రిటైర్ అవుతున్న ఉద్యోగులకు ఆ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని డ్రామాలు ఆడుతూ మోసం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయిన ఏ ఉద్యోగికి సక్రమంగా బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేదు. 2024 లో ఎన్ క్యాష్ చేసుకునేలా రిటైర్ అయిన ఉద్యోగులకు బాండ్స్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా? రిటైర్ అయిన ఉద్యోగులు వచ్చిన రిటైర్ మెంట్ బెనిఫిట్స్ తో తమ పిల్లలకు పెళ్లిళు చేసుకోవాలనో, ఒక ఇల్లు కట్టుకోవాలనో అనుకుంటారు.

జగన్ రెడ్డి పుణ్యమా అంటూ వారు అది కూడా చేసుకునే పరిస్తితులలో లేరు. బాండ్స్ పేరుతో వారిని మూడు, నాలుగు యేండ్లు వేచిచూసేలా చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రిటైర్ అయిన ఉద్యోగులకు నెల రోజుల్లో వారి క్లెయిములన్ని సెటిల్ చేసే పరిస్తితి ఉండేది. కానీ, నేడు రిటైర్ అయ్యే ఏ ఉద్యోగికి కూడా వారి బెనిఫిట్స్ దక్కనటువంటి పరిస్తితి.

గ్రామ, వార్డు సచివాలయాలలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిరుద్యోగులు సంబర పడుతున్నారని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఇది పచ్చి మోసం. పెద్దపెద్ద ఉద్యోగాలు వదులుకుని ప్రభుత్వ ఉద్యోగం అని వచ్చి చేరిన సచివాలయ ఉద్యోగులను పచ్చి దగా చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. వారిని రెగ్యులరైజ్ చేసే అంశాన్ని వాయిదాల పై వాయిదాలు వేస్తూ ఇప్పుడు జూన్ కు చేస్తామని చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగులు సైతం విధులను భహిష్కరించి రోడ్ల పైకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు.

రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. 27 శాతం ఐఆర్ అని ప్రకటించి 23 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి దాదాపు 4 శాతం కోతపెట్టిన పరిస్థితి దేశ చరిత్రలోనే లేదు. ఆదాయానికి మించి జీతభత్యాల కోసం ఖర్చు చేస్తున్నామని చెబుతున్న మాట పూర్తి అవాస్తం. కాబట్టి ఉద్యోగస్తులు ఇప్పటికైనా ఏ ప్రభుత్వ హయాంలో సంతోషంగా ఉన్నమో అని ఆలోచన చేయాలని విజ్ఘప్తి చేస్తున్నా. 16 వేల కోట్ల ఆర్ధిక లోటులో కూడా ఉద్యోగస్తులు బాగుండాలి అని 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ను ఒకసారి గుర్తు చేసుకోవాలి. హెచ్.ఆర్.ఏ స్లాబులు కూడా చంద్రబాబు ఏ విధంగా పెంచి ఇచ్చారో, సకాలంలో ఒకటో తారీఖునే టంచన్ గా జీతాలు ఏ విధంగా ఇచ్చారో గుర్తుంచుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మదత్తు తెలియజేస్తోంది.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతా ఏ విధంగా కష్టాలు పడుతున్నారో కూడా ఉద్యోగస్తులు ఆలోచన చేయాలి. సి.పి.ఎస్ పరంగా ఏ విధంగా మోసపోయారో ఒకసారి ఆలోచించండి. పీఆర్సీ నివేదిక కూడా ఇవ్వకుండా తొక్కిపెట్టి జగన్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నాడో కూడా ఆలోచన చేయాలి. కాంపెన్ సేటరీ సీటీ అలవెన్సు (సిసిఏ) అడిషనల్ బెనిఫిట్స్ ను ఏ విధంగా తొలగించారో గుర్తుచేసుకోండి. ఉద్యోగస్తులకు ప్లాట్లు ఇస్తామని వారితో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని కొత్త ప్రణాళిక చేశారు జగన్ రెడ్డి. కాకి లెక్కలు, తప్పుడు లెక్కలు కట్టి పెట్టి ఉద్యోగస్తుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించండి.

రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీయించడానికి ప్రధాన కారణం మీ దోపిడీ, దుబారానే. కాబట్టి వైసీపీ నాయకులు తమ దోపిడీని అరికట్టి ఉద్యోగస్తులకు న్యాయం చేయండి. అర్ధరాత్రి విడుదల చేసిన ఉద్యోగస్తుల నడ్డివిరిచే జీవోలను తక్షణమే రద్దు చేయాలి. సంప్రదింపుల పేరుతో వేసిన కమిటీ కేవలం ఉద్యోగస్తులను బెదిరింపులకు గురిచేయడానికే.

LEAVE A RESPONSE