Suryaa.co.in

Telangana

ప్రజల ఆస్తులు ప్రజలకే

– సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని అభ్యర్థన
– ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ కో ఆర్డినేటర్ల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు
– సమావేశం అనంతరం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దేశ ప్రజలకు మీడియా మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు.పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం చేయాల్సిన భవిష్యత్తు కార్యక్రమాల వ్యూహా రచనపై ఈరోజు సమావేశంలో అధిష్టానం దశ దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవడానికి వ్యూహా రచన, ప్రణాళికలు చేయడానికి కావలసిన సూచనలు అధిష్టానం చేసింది.

అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని అత్యధిక స్థానాల్లో విజయం సాధించడానికి పని చేస్తాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించి అధికారం ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో గెలిపిస్తారు. దేశ సంపద వనరులు దేశానికి ఉండాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తున్నారు

ప్రజల ఆస్తులు ప్రజలకే, దేశానికి ఉండాలి. దేశానికి సంబంధించిన ఆస్తులు దేశానికి ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారు.ప్రజల ఆస్తులు దేశ వనరులను కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు అమ్మకానికి పెట్టి దారా దత్తం చేసే రాజకీయ పార్టీలకు ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. లోక్ సభ ఎన్నికల్లో ఇదే తీర్పు వస్తుంది.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ అంటే రాష్ట్ర ప్రజలకు అపరిమితమైన ప్రేమ, గౌరవం ఉంది.

స్వరాష్ట్రం కావాలనే దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను నిజం చేసిన సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి ఏకగ్రీవంగా తీర్మానం చేసి అభ్యర్థించాము. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కోరికను సోనియా గాంధీ మన్నిస్తారని ఆశిస్తున్నాము.

LEAVE A RESPONSE